ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... అమ్మవారిశాల సమీపంలోని గౌని సర్కిల్‌లో ఉన్న శ్రీవాణి విద్యాలయం స్కూల్ బస్సు సోమవారం ఉదయం విద్యార్థులను తీసుకొని వచ్చేందుకు మండల పరిధిలోని కల్లూరు గ్రామానికి వెళ్లింది. కల్లూరు, తాళ్లమాపురం, నీలాపురం గ్రామాల విద్యార్థులందరూ ఇదే బస్సులో వస్తారు. కల్లూరులో సుమారు 60 మంది దాకా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. వారిలో నర్సరీ, ఒకటి, రెండు, మూడో తరగతులు చదివే చిన్న పిల్లలు కూడా వున్నారు.
విద్యార్థులు ప్రయాణించే ఈ బస్సు కల్లూరు గ్రామం దాటిన తర్వాత కొంత దూరం వెళ్లగానే బస్సు వెనుక వైపున ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. ఊడిపోయిన టైర్లు రహదారికి ఇరువైపుల ఉన్న పొలాల్లో దూరంగా పడ్డాయి. టైర్లు విడిపోగానే బస్సు ఒక వైపుకు ఒరిగి పెద్ద శ బ్దం వచ్చింది. విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో కల్లూరు గ్రామానికి చెందిన తేజేష్, ఉదయ్‌కుమార్, భరత్, బాలాజీ, నాని, గురుప్రసాద్ అనే విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. కొందరైతే భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ విషయం విద్యార్థుల తల్లి దండ్రులకు తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. గాయ పడిన విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు. బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది. వీరిని మరో బస్సులో పాఠశాలకు తరలించారు. కాగా 25-30 మాత్రమే ప్రయాణించాల్సిన మినీ బస్సులో 60-70 మందిని పాఠశాలకు తరలిస్తున్నట్లు కల్లూరు గ్రామస్తులు అంటున్నారు. అంతేగాక స్కూల్ యాజమాన్యం బస్సు కండీషన్ పట్ల జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సులపై నిఘా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యార్థులకు తప్పిన ప్రమాదం
Published Tue, Aug 20 2013 6:06 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM
Advertisement