న్యాయ శిక్షాస్మృతుల్లో ఇటీవల కేంద్రం గణనీయమైన మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(IPC)కి ప్రత్యామ్నాయంగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు ట్రక్ డ్రైవర్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. హిట్ అండ్ రన్‌లకు మరీ అంత శిక్ష సబబేనా? అనే చర్చ సోషల్ మీడియాలోనూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ‘హిట్ అండ్ రన్’ గణాంకాలు ఆందోళన కలిగించే అంశమేనని కొందరు గణాంకాలతో చెబుతున్నారు.
హిట్ అండ్ రన్.. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కడైనా పరిమితికి మించిన వేగంతో టూ వీలర్, కార్లు, ట్రక్కులు రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతే అది హిట్ అండ్ రన్ అవుతుంది. అలా పరారు కావటాన్ని మన గత చట్టం.. ఇప్పుడు కొత్త చట్టం కూడా నేరపూరిత చర్యగా పేర్కొంటోంది. అయితే..
భారతీయ న్యాయం సంహిత ప్రకారం.. హింట్ అండ్ రన్, ప్రమాదకర డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత చర్యల కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు ఉన్నాయి. మొదటి నిబంధన.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక ప్రాణం పోవడానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైటు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక రెండో నిబంధన: రోడు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదంటే స్థానిక మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించాలి. అలా ఇవ్వకుండా.. ఘటన స్థలం నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటు రూ. 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇంత ఆందోళనకరంగా ఉంది కాబట్టే..
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తంగా 2022 ఏడాది కాలంలో అధికారంగా 67,387 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రమాదాల్లో 30,486 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 12,250 ప్రమాదాల నమోదయ్యాయి. మహారాష్ట్ర (8768), ఉత్తరప్రదేశ్ (7585), రాజస్థాన్ ( 5618) వంటి పెద్ద రాష్ట్రాల్లో హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు మధ్య భారతం కేంద్ర బిందువుగా ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ (2099), ఆంధ్రప్రదేశ్(1560) హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో లెక్కలు ఉన్నాయి కాబట్టే.. కఠిన శిక్షల అమలును సమర్థిస్తున్నవాళ్లు లేకపోలేదు.
అభ్యంతరాలు అందుకే..
భారతీయ శిక్షాస్మృతి (IPC)లో హిట్ అండ్ రన్ కేసులు సెక్షన్ 304 ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే గరిష్టంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మాములు రోడ్డు ప్రమాదాల కంటే హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో విచారణలు పూర్తై శిక్షలు పక్కాగా అమలవుతున్నాయి. 2022లో విచారణ పూర్తిన హిట్ అండ్ రన్ కేసుల రేటు 47.9గా నమోదైంది. అయితే ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ రేటు కేవలం 21.8 శాతం మాత్రమే నమోదు కావటం గమనార్హం.
కానీ, కొత్త చట్టం ప్రకారం హిట్ అండ రన్ కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తుండడంపై ట్రక్కులు, లారీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారురు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దీంతో.. ట్రక్కు డ్రైవర్లు తాత్కాలికంగా శాంతించి సమ్మె విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment