దూసుకువచ్చిన మృత్యువు | 3 dead, 5 injured in road accident in Rajahmundry | Sakshi
Sakshi News home page

దూసుకువచ్చిన మృత్యువు

Published Mon, Feb 2 2015 3:36 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

దూసుకువచ్చిన మృత్యువు - Sakshi

దూసుకువచ్చిన మృత్యువు

రాజమండ్రి క్రైం/రాజమండ్రి రూరల్ :మృత్యువు బస్సు రూపంలో రెప్పపాటులో దూసుకువచ్చి, ముగ్గురిని బలి తీసుకుంది. మరో ఐదుగురిని తీవ్ర గాయాలపాలు చేసింది. రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లో ఆదివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. 16వ నంబరు జాతీయ రహదారిపై వేమగిరి వైపు వెళుతున్న ఒక ప్రైవేటు పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్టీరింగ్ నొక్కేయడంతో గాయపడ్డ బస్సు డ్రైవర్ ఎం.శ్రీను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో ఆదివారం తీరని విషాదం నింపింది.
 
 అధికారులు, ప్రజాప్రతినిధుల సందర్శన
 బస్సు ప్రమాద సమాచారం తెలుసుకున్న కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఏఎస్పీ సిద్ధారెడ్డి, తూర్పు మండల డీఎస్పీ ఆస్మా ఫర్‌హీన్, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రభుత్వాసుపత్రి, బొల్లినేని ఆసుపత్రులకు వెళ్ళి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఈ నెల 3న కాకినాడలో జరగబోయే రోడ్ సేఫ్టీ సమావేశంలో మోరంపూడి వద్ద నిత్యం జరుగుతున్న ప్రమాదాల గురించి చర్చించి, నివారణకు నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
 
 మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారని చెప్పారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ, మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ శాఖలను గతంలోనే కోరామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. జాతీయ రహదారి పక్కన వైన్ షాపులను తొలగించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను కోరామన్నారు. ఈ ప్రమాదంపై విచారణాధికారిగా జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావును నియమించారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో స్కూలు బస్ డ్రైవర్‌ను పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. బస్సులో విద్యార్థులెవరూ లేరన్నారు. బస్సు ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులతో మాట్లాడి, వాహనాన్ని తనిఖీ చేసి చర్యలు చేపడతామన్నారు.
 
 బస్సు లీజు రద్దు
 నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదానికి కారణమైన బస్సు కాంట్రాక్టర్‌తో లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు నారాయణ విద్యాసంస్థల జిల్లా డీన్ సీహెచ్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 మే 23న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను మాత్రమే తిప్పాల్సి ఉందని, అయితే ఆ బస్సును ఇతరులను తీసుకెళ్లేందుకు వినియోగించారని, ఆ కారణంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పాఠశాలకు సెలవు రోజుల్లో బస్సును పార్కింగ్ చేసి ఉంచాలని, అయితే ఆదివారం సెలవు రోజైనప్పటికీ తమకు తెలియజేయకుండా, తమ అనుమతి లేకుండా బస్సును ఇతరుల కోసం ఆపరేటర్ వినియోగించడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
 
 బాధితులను ఆదుకుంటాం : డిప్యూటీ సీఎం
 రోడ్డు ప్రమాద బాధితులను ఆర్థికంగా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బస్సు ప్రమాద బాధితులను ఆయన ఆదివారం రాత్రి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. బస్సు డ్రైవర్ శ్రీను, బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇనుపకోళ్ల శ్రీనివాసరావులను పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, మోరంపూడి, హుకుంపేట, బొమ్మూరు వంటి జంక్షన్లను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తిస్తున్నట్టు తెలిపారు. ఆ ప్రాంతాల్లో నిరంతరం ట్రాఫిక్ పోలీసులు ఉండేలా, సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా, పోలీసు వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. స్పీడ్ కంట్రోల్, డ్రింక్ అండ్ డ్రైవ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
 
 పండక్కని ఇంటికి వచ్చింది..
 తనను చూసేందుకు, పండగకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు తన తల్లి శివనేని మహాలక్ష్మి (70) 20 రోజుల క్రితం కాకినాడ రూరల్ కరప మండలం కోదాడ గ్రామం నుంచి వచ్చిందని ఆమె కొడుకు సత్యనారాయణ తెలి పాడు. స్వగ్రామం వెళ్లేందుకు  ఆదివారం బాబానగర్‌లోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరామని, జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి తన వాహనంలో పెట్రోలు అయిపోవడంతో మోరంపూడి జంక్షన్‌లో ఉండమని చెప్పానని తెలిపారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని విలపించాడు.
 
 కొడుకును ఇంటికి తీసుకువెళుతూ..
 మండపేట గొల్లపుంతకు చెందిన ఇనుపకోళ్ల దుర్గాప్రసాద్ రాజమండ్రిలోని ప్రైవేటు విద్యా సంస్థ హాస్టల్‌లో ఉండి 7వ తరగతి చదువుకుంటున్నాడు. అతడిని ఇంటికి తీసుకువెళ్లేందు కు తల్లిదండ్రులు ఆదివారం వచ్చారు. ద్విచక్ర వాహనంపై హాస్టల్ నుంచి దుర్గాప్రసాద్‌ను తీసుకుని వస్తూ సిగ్నల్ పడడంతో మోరంపూడి జంక్షన్‌లో ఆగారు. ఇంతలో జరిగిన ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ (13) అక్కడికక్కడే మృతి చెందాడు. వారు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాసరావుకు వెన్నెముక విరిగింది. విజయలక్ష్మికి కాళ్లు విరిగిపోయాయి.
 
 దిక్కులేని తమ్ముడికి అన్నీ అక్కే..
 రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న(55) ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అతడిని అక్కే అన్నీ తానై చూస్తోంది. వెంకన్న ఆదివారం మోరంపూడి జంక్షన్‌లోని ఒక వైన్ షాపులో పనికి వెళ్లాడు. అదుపు తప్పిన బస్సు ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాడు.
 
 శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ..
 తన కొడుకు పెళ్లి శుభలేఖలను బంధువులకు ఇచ్చేందుకు బయలుదేరిన డాక్టర్ బుద్ధుడు మరో వైద్యుడితో కలిసి కారులో మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్నారు. వీరి కారును బస్సు ఢీకొనడంతో గాయపడి ఆస్పత్రిపాలయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement