► మొత్తం రూ.6 వేల కోట్లు అవసరం
► అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం బకాయిలు ప్రభుత్వవర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి (2016-17) అవసరమైన బడ్జెట్, గత రెండేళ్ల పాత బకాయిలను కలుపుకుని మొత్తం రూ.6 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంటుకు అవసరమవుతాయి. అందులో 2014-15 బకాయిల కింద రూ. వెయ్యి కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా, 2015-16కు సంబంధించి రూ.2400 కోట్లు, 2016-17 విద్యాసంవత్సరానికి దాదాపు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం వచ్చే ఏడాది నుంచైనా ఈ పథకం కింద అర్హులకే ప్రయోజనం కలిగేలా, అసలైన కాలేజీలకే ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని ఫ్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించారు.
బయోమెట్రిక్‌తో చెక్..: ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతున్నదనే భావనతో అంతగా శ్రద్ధ లేకపోయినా కొందరు ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులను చదువుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరగతులకు హాజరు కాకుండానే, పరీక్షల్లో కనీస మార్కులు సాధించకుండానే వచ్చే ఏడాదికి ప్రమోట్ అవుతున్నారని, ఇటువంటి అంశాల్లో ఆయా కాలేజీలు సైతం విద్యార్థులకు ప్రోద్భలమిచ్చి సహకరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రతిరోజు కచ్చితంగా విద్యార్థుల అటెండెన్‌్రను బయోమెట్రిక్ విధానం ద్వారా పర్యవేక్షణ నెలవారీ పరీక్షలు మొదలు, వార్షిక పరీక్షలకు సంబంధించిన మార్కులను ఆయా యూనివర్శిటీలే ఇచ్చేలా చేయడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంటులో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించే ఒక్కో విద్యార్థికి రూ.1.84 లక్షల మేర (కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1.44 లక్షలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద రూ.40 వేలు కలుపుకుని) ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లిస్తున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. కచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్‌ను పర్యవేక్షిస్తే, ఒక్క ఏడాదిలోనే కాలేజీలకు రెగ్యులర్‌గా హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య తేలుతుందని, తద్వారా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు, అన్ని నియమనిబంధనలు పాటించి సక్రమంగా నిర్వహించే కాలేజీలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందేలా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం అమలుపై ఒక స్పష్టమైన అవగాహన, ఇతరత్రా అంశాల పరిశీలనకు అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలను తీసుకోనుంది. ముందుగా ఈ పథకం అమలుతీరును పరిశీలించేందుకు కాలేజీల తనిఖీలు చేపట్టనుంది.
భారంగా ‘ఫీజు’ బకాయిలు
Published Wed, Mar 9 2016 2:52 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement