‘ఫీజు’ చిక్కుల్లో విద్యార్థులు! | Fees Reimbursement Unpaid government | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ చిక్కుల్లో విద్యార్థులు!

Published Tue, Jul 28 2015 1:06 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

‘ఫీజు’ చిక్కుల్లో విద్యార్థులు! - Sakshi

‘ఫీజు’ చిక్కుల్లో విద్యార్థులు!

ఉన్నత చదువులకు వెళ్లలేక లక్షలాది మంది తంటాలు
* ఫీజులిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజుల చిక్కుల్లో పడ్డారు. కొందరు అప్పులు చేసి ఫీజులను చెల్లిస్తుండగా అనేక మంది ఫీజులు చెల్లించలేక పైచదువులనే మానేస్తున్నారు. ప్రభుత్వం 2014-15 విద్యాసంవత్సరం ఫీజులను ఒక్క పైసా ఇవ్వకపోవడంతో విద్యార్థులు కష్టాల్లో పడ్డారు. దీంతో ఇంటర్ చదివి, ఎంసెట్‌లో ర్యాంకొచ్చినా ఇంజనీరింగ్‌లో చేరలేకపోతున్నారు.

ఇక ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులు ఫీజులు చెల్లించకుంటే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఫలితంగా చాలా మంది ఎంటెక్‌లో చేరడం లేదు. డిగ్రీ చేసిన వారి పరిస్థితి ఇలానే ఉంది.
 
మీరెళ్లిపోతే మా పరిస్థితేంటి?
2014-15 విద్యా సంవత్సరం ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తామని ప్రభుత్వం అంటుండటంతో యాజమాన్యాలు ఫీజులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. కో ర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తే ఎక్కడికి వెళతారో.. ఏ కాలే జీలో చేరతారో తెలియదు.. అలాంటప్పుడు ఫీజుల కోసం తామెక్కడ తిరుగుతామని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అప్పు లు చేసి కాలేజీలను నడుపుతున్నామని, కాలేజీల్లో పని చేసే దాదాపు లక్షన్నర మంది బోధన, బోధనేతర సిబ్బందికి ఆరు నెలలు గా జీతాలు చెల్లించలేదని చెబుతున్నాయి.
 
స్పష్టత లేని విధానంతోనే సమస్యలు
రీయింబర్స్‌మెంట్ విషయంలో స్పష్టమైన విధానం అమలు చేయకపోవడమే విద్యార్థులకు శాపంగా మారుతోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గతేడాది ఫీజుల పథకానికి అమలు చేసే నిబంధనలపై గందరగోళం తలెత్తింది. 1956ను స్థానికత ప్రామాణికంగా తీసుకుంటామనడం వివాదంగా మారింది. ఆ తర్వాత వరుసగా ఏడేళ్లు తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా తీసుకుంటామని పేర్కొంది. కనీసం అప్పటి నుంచైనా పథకం అమలుకు చర్యలు చేపట్టలేదు.

రెవెన్యూ అధికారులు స్థానికత సర్టిఫికెట్ల జారీని మధ్యలో నిలిపివేశారు. ఆ తరువాత ఓకే చేసినా వేగంగా విద్యార్థులకు ఇవ్వలేకపోయారు. జనవరి వరకైనా రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులను పూర్తి చేసి మార్చి, ఏప్రిల్‌లలో డబ్బులు విడుదల చేస్తే ఈ సమస్య వచ్చేదే కాదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం వైఖరి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 
ఇబ్బందుల్లో 3 లక్షల మంది విద్యార్థులు

పక్కా చర్యలు చేపట్టలేని ప్రభుత్వ యంత్రాంగం వల్ల ప్రస్తుతం 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2013-14లో రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న వారు రాష్ట్రంలో 8,27,775 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 2014-15లో రెన్యువల్‌కు అర్హులే. అంటే చదువును గతేడాది కొనసాగించినవారే. కానీ అందులో 7,47,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో 3 లక్షల మంది 2014-15లో ఇంటర్, డి గ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసిన వారే. ప్రస్తుతం వారికి ప్రభుత్వం నుంచి ఫీజులు రాక.. కాలేజీల్లో సొంతంగా చెల్లించలేక.. సర్టిఫికెట్లు కావాలనుకునేవారు అప్పులు చేస్తూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement