ఇంజనీరింగ్‌లో ఫీజుల బాంబు
► కళాశాలల ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఏఎఫ్‌ఆర్‌సీ
► టాప్ కాలేజీల్లో మోతే..
► ఐఐటీ, ఎన్‌ఐటీలతో సమానంగా పెంచాలంటున్న కాలేజీలు
► రూ. 2.59 ల క్షల ఫీజుకు ప్రతిపాదనలు సమర్పించిన సీబీఐటీ.. అదే దారిలో వాసవి
► సాధారణ కాలేజీలు సైతం రూ.80 వేలపైనే..
► పతిపాదనల్లో శాస్త్రీయత లేని పలు కాలేజీలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల బాంబు పేలబోతోంది! వార్షిక ఫీజులు భారీగా పెంచాలని కళాశాలల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అంచనాలకు మించి ఫీజుల పెంపు ఉండే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన ఫీజుల విధానం కోసం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇంజనీరింగ్ కాలేజీలు తమ ప్రతిపాదనలు అందజేశాయి. అవి కోరినంత కాకపోయినా ఫీజుల పెంపు భారీ స్థాయిలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓ మోస్తరు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి టాప్ కాలేజీలు రూ.1 లక్ష నుంచి రూ. 2.59 లక్షల వరకు ఫీజులను పెంచాలని టీఏఎఫ్‌ఆర్‌సీని కోరాయి. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కాలేజీ అయితే ఐఐటీ, ఎన్‌ఐటీలకు దీటుగా ఫీజులు పెంచాలని కోరింది. వచ్చే జూలై నుంచి ఎన్‌ఐటీల్లో ఫీజును రూ.2 లక్షలకు పెంచగా, ఐఐటీల్లో రూ.2.50 లక్షలకు పెంచారు. అదే స్థాయిలో సీబీఐటీ అత్యధికంగా రూ.2.59 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించింది. వాసవి ఇంజనీరింగ్ కాలేజీ కూడా రూ.1.60 లక్షల ఫీజును ప్రతిపాదించింది.
ఇక సాధారణ కాలేజీలు రూ.50 వేల నుంచి రూ.80 వేలకుపైగా ఫీజులను ప్రతిపాదించాయి. ద్రవ్యోల్బణాన్ని బట్టి పాత ఫీజు కంటే 15 శాతం ఫీజు పెంచాల్సి వస్తుందని ఇదివ రకే ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ అంచనాల కంటే రెట్టింపు స్థాయిలో ఫీజుల పెంపునకు కాలేజీ యాజమాన్యాలు ప్రతిపాదనలు అందజేశాయి. వీటిని పరిశీలించిన ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదనల్లో లోపాలపై కొన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఆదాయ వ్యయాల నివేదికలను శాస్త్రీయ లెక్కల ప్రకారం అందజేయాలని సూచించింది.
ప్రతిపాదనలు పరిశీలించాకే...
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, మెడికల్, డెంటల్, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి వచ్చే మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19) వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ ఏఎఫ్‌ఆర్‌సీ గత నవంబర్ 23న నోటిఫికేషన్ జారీ చేసింది. 2013-14, 2014-15 సంవత్సరాలు, 2015-16 నవంబర్ వరకు చేసిన ఆదాయ, వ్యయాల ఆధారంగా ఫీజుల పెంపును నిర్ణయిస్తామని పేర్కొంది. 2015 నవంబర్ 24 నుంచి జనవరి 30 వరకు కాలేజీ యాజమాన్యాల నుంచి ఫీజుల పెంపు ప్రతిపాదనలు స్వీకరించింది. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తోంది. అందులో భాగంగా ఆదాయ వ్యయాల నివేదికల్లోని లోపాలు, అశాస్త్రీయ అంచనాలపై కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తోంది. అవసరమైన డాక్యుమెంట్లు, వివరణలు అందజేయాలని సూచిస్తోంది. వాటిని పరిశీలించాకే కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ధారించనుంది.
బయటపడుతున్న బోగస్‌లు
కాలేజీల ప్రతిపాదనల పరిశీలన సందర్భంగా పలు కాలేజీల్లో బోగస్ అధ్యాపకుల వ్యవహారం బయట పడింది. అదాయ వ్యయాల పరిశీలనలో భాగంగా అధ్యాపకుల పాన్ కార్డులను అందజేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ సూచించింది. యాజమాన్యాలు అందజేసిన వాటిని ఆదాయ పన్నుల శాఖకు పంపి పరిశీలన చేయించడంతో బోగస్ కార్డులు ఉన్నట్లు తేలింది. ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా ఫీజుల పెంపును ప్రతిపాదించిన 17 కాలేజీలకు నోటీసులు జారీ చేసింది.
కనీస ఫీజులున్న కాలేజీల్లోనూ పెంపు
ప్రస్తుతం రాష్ట్రంలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో టాప్, ఓ మోస్తరు కాలేజీలు మినహా మిగతా 150కిపైగా కాలేజీల్లో కనీస ఫీజు అమలవుతోంది. ప్రస్తుతం ఆ కాలేజీల యాజమాన్యాలు కూడా భారీగా ఫీజుల పెంపును కోరేందుకు సిద్ధవుతున్నాయి. ఈ కాలేజీల యాజమాన్యాలన్నీ 2013-14 నుంచి 2016-17 వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు ఇవ్వలేదు. తమ కాలేజీల్లోని లోపాల కారణంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రూ.35 వేల కనీస ఫీజు తీసుకునేందుకే ఒప్పుకున్నాయి. ఇప్పుడు మాత్రం తమ ఆదాయ వ్యయాల ప్రకారం ఫీజుల పెంపును కోరేందుకు సిద్ధమవుతున్నాయి.