‘ఫీజు’ లేట్‌.. మారని ఫేట్‌! | Huge troubles students fee reimbursement arrears in Telangana | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ లేట్‌.. మారని ఫేట్‌!

Published Sun, Jul 31 2022 3:01 AM | Last Updated on Sun, Jul 31 2022 3:13 AM

Huge troubles students fee reimbursement arrears in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌.రాజవర్ధన్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఫైనలియర్‌ చదువుతున్నప్పుడే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ప్రముఖ (క్యాప్‌ జెమినీ) సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగం సంపాదించాడు. సంవత్స రానికి రూ.25 లక్షల ప్యాకేజీ కావడంతో జీవితంలో స్థిరపడొ చ్చని భావించాడు. కోర్సు పూర్తయింది. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగంలో చేరాలని కంపెనీ షరతు పెట్టింది. కానీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు అందలేదని.. ఆ నిధులు వచ్చాక సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ కొర్రీ పెట్టింది. లేదంటే ఫీజు సొమ్ము చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని.. ప్రభుత్వం నుంచి నిధులొచ్చాక తిరిగిస్తామని పేర్కొంది. దీంతో రాజవర్ధన్‌ అప్పుచేసి కాలేజీలో ఫీజు కింద కట్టాడు. నెలనెలా వడ్డీ కడుతున్నాడు. ప్రభుత్వం నిధులు ఎప్పుడిస్తుందో, కాలేజీ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నాడు.

.. ఒక్క రాజవర్ధన్‌ సమస్య కాదు ఇది. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతుండటంతో పై చదువులకు వెళ్లేందుకు, ఉద్యోగాల్లో చేరేందుకు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు నిధులు అందక అవస్థ పడుతున్నామని కాలేజీల యాజమాన్యాలు వాపోతున్నాయి.

బడ్జెట్‌ లో కేటాయిస్తున్నా..
రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం కేటాయింపులు జరుపుతున్నా.. వాటిని సకాలంలో విడుదల చేయడం లేదు. వివిధ కారణాలతో ఇలా ‘ఫీజు’ బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 విద్యా సంవత్సరం వరకు.. రూ.3,397.23 కోట్లకుపైగా రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్టు సంక్షేమ శాఖలే పేర్కొంటున్నాయి. ఇక 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల పరిశీలన చివరి దశలో ఉంది. ఇవి కూడా తోడైతే బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ‘ఫీజు’ నిధులు అందకపోతుండటంతో కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు రానందున.. కాలేజీల నిర్వహణ కోసం విద్యార్థులే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చాక తిరిగి తీసుకోవాలని చెబుతున్నాయి.

పెండింగ్‌లో ఎక్కువ బీసీ విద్యార్థులవే..
పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ఎక్కువగా బీసీ కేటగిరీకి చెందిన నిధులే ఉన్నాయి. సంక్షేమ శాఖల అంచనా ప్రకారం.. ఇప్పటివరకు రూ.3,397.23 కోట్ల మేర ఫీజు బకాయిలు ఉండా.. అందులో సగానికిపైగా బీసీ విద్యార్థులకు సంబంధించినవే. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా సంక్షేమ శాఖలు నిధులను రీయింబర్స్‌మెంట్‌ పథకానికి ఖర్చు చేస్తుండగా.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన నిధులు మాత్రం విడుదలకాని పరిస్థితి ఉంది. బీసీలకు సంబంధించి రూ. 1,532.56 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. బీసీ, ఈబీసీ బకాయిలను కలిపితే రూ.1,953.49 కోట్లు చెల్లించాల్సి ఉంది.

నిధులపై కోవిడ్‌ ప్రభావం
ప్రభుత్వంలో అన్ని రంగాలపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. దీనితో ప్రభుత్వానికి ఆదాయం తగ్గి.. 2020–21, 2021–22 సంవత్సరాల్లో నిధుల విడుదల గాడి తప్పింది. దీనితో బకాయిలు పేరుకుపోయాయి. గత ఏడాదిగా కోవిడ్‌ ప్రభావం తగ్గినా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకానికి నిధుల విడుదలలో జాప్యం జరిగింది. చెల్లింపులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు కరోనా ప్రభావంతో కాలేజీలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు వస్తే ఊరట లభిస్తుందని కాలేజీలు భావించినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు విద్యార్థులపై భారం వేస్తున్నాయి. వారి నుంచి ఫీజులు వసూలు చేస్తూ.. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక తిరిగి ఇస్తామంటున్నాయి. కాలేజీలు ఈ విషయంగా గట్టిగా ఒత్తిడి చేస్తుండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ఫీజుల సొమ్ము చెల్లించాల్సి వస్తోంది.

నిధుల విడుదల కాగితాలకే పరిమితం
ప్రైవేటు కాలేజీలు మూడేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు వస్తే కాస్త అయినా ఊరట లభించేది. కానీ మూడేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించి చాలా బీఆర్వోలు (బడ్జెట్‌ రిలీజింగ్‌ ఆర్డర్స్‌) జారీ చేశారు. కానీ నిధుల విడుదల కాగితాలకే పరిమితమైపోయింది. ఇది కాలేజీ యాజమాన్యాల్లో ఆందోళన రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా మార్చి 31 నాటికి తప్పకుండా నిధులు విడుదలయ్యేవి. ఇప్పుడు పరిస్థితి ఏమిటో అర్థంకాకుండా పోయింది.
– నాగయ్య, ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బడ్జెట్‌లో ఒక శాతమే అయినా సరిగా ఇవ్వడం లేదు
పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం ఒక్క శాతం మాత్రమే. ఈ ఒక్క శాతం నిధులను కూడా సకాలంలో ఇవ్వడం లేదంటే ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్‌ చార్జీలపైనే ఆధారపడి ఉన్నత విద్య చదువుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులివ్వక, వ్యక్తిగతంగా చెల్లించే పరిస్థితి లేక ఉన్నత విద్యలో డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. కాలేజీల్లో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి.
– గౌరీ సతీశ్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement