పేద విద్యార్థులపై ఫీజు పిడుగు | Increase Fee On Poor Students In Basar IIIT | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులపై ఫీజు పిడుగు

Published Mon, Jun 18 2018 2:43 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

Increase Fee On Poor Students In Basar IIIT - Sakshi

బాసర ట్రిపుల్‌ ఐటీ

సాక్షి, హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన నిరుపేద విద్యార్థులకు ఫీజుల కష్టం వచ్చిపడింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు ఒక్కసారిగా ఫీజులు పెంచటం వారికి శాపంగా మారింది. గతేడాదితో పోలిస్తే రూ.5 వేల ఫీజు పెంచుతూ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో ఫీజులు చెల్లించలేక అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు సైతం హాజరుకాలేని దీన స్థితిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు. పదో తరగతి మెరిట్‌ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కోర్సుకు ఆర్‌జీయూకేటీ ఎంపిక చేసింది. సెలెక్టయిన విద్యార్థులకు కాల్‌ లెటర్లు పంపింది. గత విద్యా సంవత్సరంతో    పోలిస్తే రూ.5,000 ఫీజును అదనంగా వడ్డిస్తున్నట్లు ఫీజుల వివరాలను అందులో పొందుపరిచింది. యూనివర్సిటీ నిర్వాకాన్ని చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజులను తగ్గించకుండా, పెంచిన తీరు విమర్శల పాలవుతోంది. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోనూ కోత
ఫీజు పెంపు కారణాన్ని యూనివర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసింది. కోర్సుకు నిర్దేశించిన ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేయడం లేదని, అందులో కోత పెడుతోందని పేర్కొంది. దీంతో అంత మేరకు విద్యార్థులే భరించాలంటూ షరతు విధించింది. ట్రిపుల్‌ఐటీలో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు యూనివర్సిటీ నిర్దేశించిన ప్రకారం రూ.40,700 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.40,200 చెల్లించాలి.

ఇందులో రూ.36 వేలు ట్యూషన్‌ ఫీజు కాగా, మిగతావి రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఎగ్జామ్‌ ఫీజు, కాషన్‌ డిపాజిట్‌. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో అర్హులైన వారందరికీ రూ.36 వేల ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా యూనివర్సిటీకి చెల్లించాలి. కానీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆ ఫీజును తమకు చెల్లించటం లేదని, సగటున అర్హులైన ఒక్కొక్కరికి రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని కాల్‌ లెటర్‌లో ప్రస్తావించింది. అందుకే మిగిలిన వ్యత్యాసంలో రూ.5 వేలు విద్యార్థులే భరించాలనే నిబంధనను విధించింది. అడ్మిషన్‌ పొందేటప్పుడే ఈ ఫీజును చెల్లించాలని స్పష్టం చేసింది.

చిల్లిగవ్వ లేదు: ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన ధరణి
రాయికల్‌ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని ధరణి ట్రిపుల్‌ఐటీకి ఎంపికైంది. స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ధరణి.. 10 జీపీఏ సాధించి టాపర్‌గా నిలిచింది. ధరణి తండ్రి రామగిరి నరేశ్‌ దర్జీ పని చేస్తుండగా.. తల్లి పద్మ బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలంగా బీడీల కంపెనీ తరచూ బంద్‌ ఉంటుండంతో తల్లి ఉపాధి కోల్పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి.

‘ఈనెల 21న అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ ఉంది. రూ.9,700 చెల్లించాలట. నిరుడు రూ.4,700 ఫీజు కడితే చేర్చుకున్నారు. అదనంగా రూ.5 వేలు ఫీజు పెంచారు. ఇప్పుడు ఫీజు కట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి’ అంటూ ధరణి కన్నీటి పర్యంతమైంది. రాష్ట్రం నుంచి 1,200 మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీకి ఎంపికయ్యారు. వీరిలో 90 శాతం మంది నిరుపేదలే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అదనంగా విధించిన ఫీజును భరించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement