RGKUT
-
Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఉన్నత సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ రికార్డు సృష్టిస్తోంది. కోవిడ్ సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోగా ఆర్జీయూకేటీ విద్యార్థులకు మాత్రం ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం విశేషం. ప్రభుత్వ విద్యా సంస్థ అయిన ఆర్జీయూకేటీ విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉన్నత ప్రమాణాలు గుర్తించిన ఆయా కంపెనీలు నేరుగా ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. ఉచిత భోజన వసతులతో సాంకేతిక విద్య గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తూ ఆరేళ్ల సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్సార్ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీ పరిధిలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ప్రతి సంస్థలో వేయి మంది చొప్పున నాలుగు వేల మందికి ఇక్కడ సాంకేతిక విద్యను అందిస్తున్నారు. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా, తదుపరి నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుగా నిర్వహిస్తున్నారు. ఈ నాలుగింటిలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో ఆయా బ్యాచ్‌ల ఆరేళ్ల కోర్సు కాలపరిమితి ఇంకా కొనసాగుతోంది. ముందుగా ఏర్పాటైన నూజివీడు, ఆర్కే వ్యాలీల్లోని విద్యార్థులకు మాత్రం పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2014–15 నుంచి 2020–21 వరకు చూస్తే మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో అవకాశాలు దక్కాయి. నూజివీడు క్యాంపస్‌లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి. అత్యధిక వార్షిక ప్యాకేజీలు అందించిన కంపెనీలు – అనలాగ్ డివైజెస్– బెంగళూరు: రూ.20 లక్షలు – ఫ్రెష్ డెస్క్–చెన్నై: రూ.12 లక్షలు – టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్– బెంగళూరు: రూ.10 లక్షలు – సినాప్సిస్– హైదరాబాద్: రూ.9.5 లక్షలు – జేవోటీటీఈఆర్–ఐఈ: రూ.9.0 లక్షలు – థాట్ వర్క్స్– హైదరాబాద్: రూ.7.8 లక్షలు – ఏడీపీ, మేథ్ వర్క్స్, గోల్డెన్ హిల్స్: రూ. 5.0 లక్షల నుంచి రూ. 6.5 లక్షల వరకు ఇవేకాకుండా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్ టాక్, పర్పుల్.కామ్, సెలెక్ట్, నూక్కాడ్ షాప్స్, సెవ్యా, అడెప్ట్చిప్స్, సినాప్సిస్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్‌రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ గణనీయంగా కొలువులు గ్రామీణ విద్యార్థులకు కూడా ఐఐటీల స్థాయిలో మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఆర్జీయూకేటీ ఏర్పాటైంది. త్రిపుల్ ఐటీల్లో ఆరేళ్లు చదివే విద్యార్థులు హైక్వాలిటీ గ్రాడ్యుయేట్లుగా బయటకు రావాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. సివిల్ సర్వీసెస్ వంటి ఆలిండియా క్యాడర్ ఉద్యోగాల్లోనూ కొలువుదీరేలా తర్ఫీదు ఇస్తోంది. దీనివల్లే కోవిడ్ సంక్షోభంలోనూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు పొందగలిగారు. రానున్న కాలంలో మరింతమందికి ప్లేస్మెంట్లు దక్కనున్నాయి. నేటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిలబస్‌లో మార్పులు చేస్తున్నాం. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీ ఉన్నత విద్యామండలి కంప్యూటర్ సైన్స్‌కే అగ్రపీఠం ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఆయా కంపెనీలు ఇచ్చిన ఉద్యోగాలను పరిశీలిస్తే.. ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే అగ్రభాగాన ఉన్నారు. తదుపరి ఈసీఈ, సివిల్, మెకానికల్, కెమికల్ విభాగాల విద్యార్థులున్నారు. 2014–15 నుంచి ఇప్పటివరకు ఉద్యోగాలు దక్కించుకున్నవారిలో 1,921 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు. కాగా 1,702 మంది ఈసీఈ విద్యార్థులున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), అమెజాన్, ఐబీఎం, కేప్ జెమిని, ఇన్ఫోసిస్ తదితర ప్రముఖ కంపెనీల్లో వీరికి కొలువులు దక్కాయి. -
ఒక వ్యక్తి.. మూడు పదవులు
నూజివీడు: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకే వ్యక్తి మూడు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ ఆ మూడింటినీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయా (ఆర్జీయూకేటీ)నికి వైస్ చాన్స్‌లర్‌గా పని చేస్తున్న ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు. ఆయన ఆర్జీయూకేటీ వీసీగా పనిచేస్తుండగానే గత అక్టోబర్ నెలలో ఆర్జీయూకేటీ చాన్సలర్‌గా ఉన్న ఆచార్య డి.రాజ్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో రామచంద్రరాజుకే ఇన్చార్జ్ చాన్స్‌లర్ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలను అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. తరువాత కృష్ణా వర్సిటీ వీసీ పదవి ఖాళీ కావడంతో ఆయననే ఆ యూనివర్సిటీకి కూడా ఇన్చార్జ్ వీసీగా గత ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా రాజ్ రెడ్డి పదవీకాలం గతేడాది అక్టోబర్ 20తో ముగియగా, ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించగా, అనూహ్యంగా ఇన్చార్జ్ చాన్స్‌లర్‌గా రామచంద్రరాజు నియమితులయ్యారు. అస్తవ్యస్తంగా మారిన ఆర్జీయూకేటీ మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత వీసీ హయాంలో ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీల అభివృద్ధి ఏమాత్రం జరగకపోగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలలో టీడీపీ నాయకులతో పాటు ఆగిరిపల్లి మండలంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ చెప్పిన వారికల్లా అవసరం లేకపోయినా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్క శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలోనే ఆఫీసులలో పనిచేసే నాన్‌టీచింగ్ స్టాఫ్ దాదాపు 170 మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీసీ కార్యాలయంలో సైతం టీడీపీ నాయకులు చెప్పిన వారినల్లా నియమించుకున్నారు. ఈ నియామకాలు నిబంధనల మేరకు జరగలేదు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్ కూడా లేదు. గత మూడేళ్లుగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మెస్‌ల నిర్వహణకు టెండర్లను ఖరారు చేయకుండా నామినేషన్ పద్ధతిపైనే కొనసాగిస్తున్నారు. ఏటా టెండర్లు పిలవడం, సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందంటూ నిలిపివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇన్చార్జ్ చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్ ఒక్కరే కావడంతో నియంతృత్వ పోకడలు కూడా ఎక్కువయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. -
పేద విద్యార్థులపై ఫీజు పిడుగు
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికైన నిరుపేద విద్యార్థులకు ఫీజుల కష్టం వచ్చిపడింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ఒక్కసారిగా ఫీజులు పెంచటం వారికి శాపంగా మారింది. గతేడాదితో పోలిస్తే రూ.5 వేల ఫీజు పెంచుతూ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో ఫీజులు చెల్లించలేక అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు సైతం హాజరుకాలేని దీన స్థితిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు దిక్కులు చూస్తున్నారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కోర్సుకు ఆర్జీయూకేటీ ఎంపిక చేసింది. సెలెక్టయిన విద్యార్థులకు కాల్ లెటర్లు పంపింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే రూ.5,000 ఫీజును అదనంగా వడ్డిస్తున్నట్లు ఫీజుల వివరాలను అందులో పొందుపరిచింది. యూనివర్సిటీ నిర్వాకాన్ని చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజులను తగ్గించకుండా, పెంచిన తీరు విమర్శల పాలవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోనూ కోత ఫీజు పెంపు కారణాన్ని యూనివర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసింది. కోర్సుకు నిర్దేశించిన ఫీజును రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయడం లేదని, అందులో కోత పెడుతోందని పేర్కొంది. దీంతో అంత మేరకు విద్యార్థులే భరించాలంటూ షరతు విధించింది. ట్రిపుల్‌ఐటీలో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు యూనివర్సిటీ నిర్దేశించిన ప్రకారం రూ.40,700 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.40,200 చెల్లించాలి. ఇందులో రూ.36 వేలు ట్యూషన్ ఫీజు కాగా, మిగతావి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, కాషన్ డిపాజిట్. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అర్హులైన వారందరికీ రూ.36 వేల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా యూనివర్సిటీకి చెల్లించాలి. కానీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆ ఫీజును తమకు చెల్లించటం లేదని, సగటున అర్హులైన ఒక్కొక్కరికి రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని కాల్ లెటర్లో ప్రస్తావించింది. అందుకే మిగిలిన వ్యత్యాసంలో రూ.5 వేలు విద్యార్థులే భరించాలనే నిబంధనను విధించింది. అడ్మిషన్ పొందేటప్పుడే ఈ ఫీజును చెల్లించాలని స్పష్టం చేసింది. చిల్లిగవ్వ లేదు: ట్రిపుల్ఐటీకి ఎంపికైన ధరణి రాయికల్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని ధరణి ట్రిపుల్ఐటీకి ఎంపికైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ధరణి.. 10 జీపీఏ సాధించి టాపర్‌గా నిలిచింది. ధరణి తండ్రి రామగిరి నరేశ్ దర్జీ పని చేస్తుండగా.. తల్లి పద్మ బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలంగా బీడీల కంపెనీ తరచూ బంద్ ఉంటుండంతో తల్లి ఉపాధి కోల్పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. ‘ఈనెల 21న అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంది. రూ.9,700 చెల్లించాలట. నిరుడు రూ.4,700 ఫీజు కడితే చేర్చుకున్నారు. అదనంగా రూ.5 వేలు ఫీజు పెంచారు. ఇప్పుడు ఫీజు కట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి’ అంటూ ధరణి కన్నీటి పర్యంతమైంది. రాష్ట్రం నుంచి 1,200 మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. వీరిలో 90 శాతం మంది నిరుపేదలే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అదనంగా విధించిన ఫీజును భరించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. -
నేటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
నూజివీడు : ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అడ్మిషన్ల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌన్సెలింగ్‌ను ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ డాక్టర్ ఇబ్ర హీంఖాన్ పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, తెలంగాణలోని బాసరలలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,807మందిని ఎంపిక చేసిన ఆర్జీయూకేటీ అధికారులు ఈ నెల ఏడో తేదీన ప్రకటించారు. మొత్తం ఎంపికైన వారిలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి 936 మందిని కేటాయించారు. ట్రిపుల్ ఐటీలకు కృష్ణా జిల్లా నుంచి 153 మంది ఎంపికయ్యారు. తొలి రోజు 500 మందికి కౌన్సెలింగ్ స్థానిక ట్రిపుల్ ఐటీలో బుధవారం 500 మందికి, గురువారం 436 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యార్థులకు కాల్‌లెటర్లు పంపారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 12 కౌంటర్లను ఏర్పాటుచేశారు. విధుల నిర్వహణ కోసం 70 మంది సిబ్బందిని, మరో 35 మంది వాలంటీర్లను నియ మించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తారు. విద్యార్థులతోపాటు వచ్చేవారికి రూ.30లకు భోజనం అందిస్తారు. 28 నుంచి తరగతుల ప్రారంభం ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థుల స్థానంలో వెయిటింగ్‌లిస్టులో ఉన్నవారిని పిలుస్తారు. సీటు కేటాయించిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,500, జనరల్ విద్యార్థులు రూ.3వేలు చొప్పున చెల్లించాలి.