నూజివీడు : ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అడ్మిషన్ల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌన్సెలింగ్‌ను ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ డాక్టర్ ఇబ్ర హీంఖాన్ పర్యవేక్షిస్తారు.
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, తెలంగాణలోని బాసరలలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,807మందిని ఎంపిక చేసిన ఆర్జీయూకేటీ అధికారులు ఈ నెల ఏడో తేదీన ప్రకటించారు. మొత్తం ఎంపికైన వారిలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి 936 మందిని కేటాయించారు. ట్రిపుల్ ఐటీలకు కృష్ణా జిల్లా నుంచి 153 మంది ఎంపికయ్యారు.
తొలి రోజు 500 మందికి కౌన్సెలింగ్
స్థానిక ట్రిపుల్ ఐటీలో బుధవారం 500 మందికి, గురువారం 436 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యార్థులకు కాల్‌లెటర్లు పంపారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 12 కౌంటర్లను ఏర్పాటుచేశారు. విధుల నిర్వహణ కోసం 70 మంది సిబ్బందిని, మరో 35 మంది వాలంటీర్లను నియ మించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తారు. విద్యార్థులతోపాటు వచ్చేవారికి రూ.30లకు భోజనం అందిస్తారు.
28 నుంచి తరగతుల ప్రారంభం
ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థుల స్థానంలో వెయిటింగ్‌లిస్టులో ఉన్నవారిని పిలుస్తారు. సీటు కేటాయించిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,500, జనరల్ విద్యార్థులు రూ.3వేలు చొప్పున చెల్లించాలి.
నేటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
Published Wed, Jul 23 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement
Advertisement