పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో1,200 పీజీ సీట్లు.. అందులో 600 వరకు నేషనల్ పూల్ కింద భర్తీ
ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకే 300 వరకు సీట్లు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ మెడికల్ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం సీట్లను నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఎంబీబీఎస్‌లో నేషన ల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో ఏకంగా సగం కేటాయిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి దాదాపు 2,800 పీజీ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 1,200 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వాటిల్లో 600 వరకు (50 శాతం) జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో నింపుతారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
విధానం మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేస్తుండగా, తెలంగాణలాంటి రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం నష్టం కలిగిస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాదికి చెందిన చాలామంది విద్యార్థులు మన రాష్ట్రంలోని సీట్లపై ఆసక్తి చూపుతారు. కానీ మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జాతీయ కోటాలో నింపే మన రాష్ట్ర 600 సీట్లలో దాదాపు 300 మంది ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment