PG medical seats
-
సగం సీట్లు ‘ఇతరులకే’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ మెడికల్ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం సీట్లను నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఎంబీబీఎస్‌లో నేషన ల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో ఏకంగా సగం కేటాయిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి దాదాపు 2,800 పీజీ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 1,200 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వాటిల్లో 600 వరకు (50 శాతం) జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో నింపుతారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విధానం మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేస్తుండగా, తెలంగాణలాంటి రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం నష్టం కలిగిస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాదికి చెందిన చాలామంది విద్యార్థులు మన రాష్ట్రంలోని సీట్లపై ఆసక్తి చూపుతారు. కానీ మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జాతీయ కోటాలో నింపే మన రాష్ట్ర 600 సీట్లలో దాదాపు 300 మంది ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని చెబుతున్నారు. -
పీజీ వైద్య సీట్ల పంట
సాక్షి, అమరావతి: ఇటు ఎంబీబీఎస్ సీట్లు.. అటు పీజీ సీట్లు! ఒకేసారి కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లతోపాటు అదనంగా 510 పీజీ వైద్య సీట్లతో రాష్ట్ర వైద్య విద్యా రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ గేమ్ ఛేంజర్‌గా అవతరిస్తోంది. ఒక్క ఏడాదిలోనే వీటిని సాధించడం ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్ర వైద్య విద్యా రంగం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పీజీ సీట్లు పెరుగుతున్నాయి. వైద్య విద్యను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత నాలుగేళ్లలో ఏకంగా 702 పీజీ సీట్లు కొత్తగా సమకూరడం గమనార్హం. అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూనే అప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో వసతులను మెరుగు పరిచారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో వైద్యులు, సిబ్బందిని సమకూర్చడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. ఫలితంగా 1956 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వైద్య సీట్లు పెరిగాయి. పీజీ సీట్లు ఇంకా పెరిగే చాన్స్ రాష్ట్రంలో పది వైద్య కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం వరకూ 966 పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఏసీఎస్ఆర్ కళాశాలలో ఒక్క పీజీ సీటు కూడా లేదు. అలాంటిది నాలుగేళ్లలో వరుసగా 2020లో 24 సీట్లు, 2021లో 31 సీట్లు, 2022లో 137 సీట్లు చొప్పున రాష్ట్రానికి అదనంగా పీజీ సీట్లు సమకూరాయి. 2023లో 737 సీట్లు పెంచాలని ఎన్ఎంసీకి ప్రతిపాదించగా ఇప్పటి వరకు 510 సీట్లు మంజూరయ్యాయి. మిగిలిన సీట్ల పెంపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల ప్రవేశాలకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా మరికొన్ని సీట్లు రాష్ట్రానికి దక్కే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగేళ్లలోనే ఏకంగా 702 సీట్లు పెరగడంతో ఇప్పటికే 1,668 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 42.08 శాతం సీట్లు పెరిగాయి. ఏసీఎస్ఆర్ కళాశాల కూడా పీజీ సీట్లలో బోణీ కొట్టింది. ప్రస్తుతం ఆ కళాశాలలోనూ 24 పీజీ సీట్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరాయి. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉంది. పీజీ సీట్లు పెరగడంతో స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు సత్వరమే, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీట్ల పెంపుతో పలు లాభాలు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడం వల్ల చాలా లాభాలుంటాయి. రీసెర్చ్ కార్యకలాపాలు, రోగులకు వైద్యుల అందుబాటు పెరుగుతుంది. మన ఆస్పత్రుల్లో నిత్యం వేల సంఖ్యలో ఓపీలు, ఐపీలు నమోదవుతుంటాయి. వీటిద్వారా రీసెర్చ్ కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రభుత్వం సైతం రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు. పీజీ సీట్లు పెరగడంవల్ల చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. – కంచర్ల సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ భారీగా పోస్టుల భర్తీ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య సీట్లు పెరగాలంటే ఆయా విభాగాల్లో తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది విధిగా ఉండాలి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 2 పీజీ సీట్ల చొప్పున ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డీఎంఈలో 106 ప్రొఫెసర్, 312 అసోసియేట్ ప్రొఫెసర్, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కొత్తగా సృష్టించారు. వీటితో కలిపి 1,585 పోస్టులను ఇప్పటివరకూ భర్తీ చేశారు. పదోన్నతుల ద్వారా 500 వరకూ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయ్యాయి. -
నెక్ట్స్ పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఎంబీబీఎస్ పట్టా పొందాలన్నా, పీజీ మెడికల్ సీట్లలో ప్రవేశించాలన్నా, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు గుర్తింపు ఇవ్వాలన్నా అందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎగ్జిట్) పాస్ కావాలి. ఆ తర్వాతే వైద్యవిద్య పట్టా ఇవ్వనున్నారు. నెక్ట్స్ పాసైతేనే మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాదు నియామకాలకు కూడా ఈ పరీక్షలో వచ్చే మార్కులే ఆధా రం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా విడుదల చేసింది. దాన్ని ప్రజాభిప్రాయం నిమిత్తం అందుబాటులో ఉంచింది. తదుపరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి దీన్ని అమలులోకి తీసుకొస్తారు. అంటే 2019–20లో ఎంబీబీఎస్‌లో చేరిన బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అమలవుతుందని చెబుతున్నారు. దీనిపై ఎన్ఎంసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రెండింట్లో పాసైతేనే... నెక్ట్స్ పరీక్ష రెండుషెడ్యూళ్లలో నిర్వహిస్తారు. స్టెప్–1, స్టెప్–2 పద్ధతిలో జరుగుతుంది. స్టెప్–1 పరీక్ష నాలుగున్నరేళ్లకు తర్వాత... ఇంటర్న్‌షిప్‌కు ముందు ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షతో సమానం. అంటే ఎంబీబీఎస్‌లో ఫైనయర్ బదులుగా నెక్ట్స్ స్టెప్–1 థియరీ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ రెండో వారంలో దీన్ని నిర్వహిస్తారు. దీని ఫలితాలు జన వరి రెండో వారంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా కాలేజీలు నిర్వ హించే ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఇంటర్న్‌షిప్ అయ్యాక స్టెప్–2 ప్రాక్టికల్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక అంటే స్టెప్–1 పరీక్ష తర్వాత ఏడాదికి స్టెప్–2 పరీక్షను నిర్వహిస్తారు. అది పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష. స్టెప్–2 పరీక్ష ఏటా మార్చిలో నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేస్తారు. ఈ రెండింటిలో పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా, పీజీ మెడికల్ అర్హత, విదేశీ వైద్య కు గుర్తింపు ఉంటుంది. స్టెప్–2 కేవలం పాసైతే సరిపోతుంది. ఒకవేళ ఇందులో 3 అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైతేనే సప్లిమెంటరీ ఉంటుంది. లేకుంటే అన్ని పరీక్షలు రాయాలి. మూడు కంటే ఎక్కువ ఫెయిలైతే ఏడాది కోల్పోయినట్లే లెక్క. పదేళ్లలోగా ఎన్నిసార్లు అయినా నెక్ట్స్ రాసుకోవచ్చు. అలాగే ఒకసారి పాసైనా కూడా మార్కులను పెంచుకొనేందుకు కూడా పరీక్ష రాసుకోవచ్చు. అంటే పీజీలో సీటు పొందేందుకు ఎక్కువ మార్కులు రావాలనుకుంటే మరోసారి రాసుకోవచ్చు. నెక్ట్స్ అమలైతే సంబంధిత సమానమైన ప్రస్తుత పరీక్షలు దశలవారీగా రద్దవుతాయి. ఉదాహరణకు ‘నీట్’పీజీ పరీక్ష రద్దు అవుతుంది. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సింది... అమెరికా లాంటి దేశాల్లో గత 20 ఏళ్ల నుంచి ఈ తరహా పరీక్షా విధానం అమలవుతోంది. వైద్యవిద్యలో దేశవ్యాప్తంగా ఏకీకృతంగా ఇప్పటికే అమలు చేస్తున్న ‘నీట్’విధానానికి నెక్ట్స్ కొనసాగింపు మాత్రమే. తుది ర్యాంకులో స్టెప్–1కు మాత్రమే కాకుండాప్రాక్టికల్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. – డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు -
PG Medical Seats: కేంద్రం కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌కు 630 పీజీ వైద్యసీట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పీజీ వైద్యసీట్ల పంట పండింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం ఒకేసారి 630 పీజీ వైద్యసీట్లను తెచ్చింది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అండర్ సెక్రటరీ చందన్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఈ మేరకు ఎంవోయూ పంపిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీల వారీగా ఎంవోయూకు ఆమోదం తెలపాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాలలు పీజీలు, సీనియర్ రెసిడెంట్లతో కళకళలాడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు రెండునెలల కిందట సెంట్రల్ స్పాన్సర్షిప్ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపించాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 630 పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. భారీగా నియామకాలు చేసినందునే.. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనివినీ ఎరుగని రీతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిపినందునే పీజీ సీట్లు మంజూరు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో దాదాపు 455 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. 2,500 మందికిపైగా పారామెడికల్ సిబ్బందిని నియమించారు. దీంతోపాటు నాడు–నేడులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ చేయడం వల్లనే కేంద్రం కొత్త పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. తాజాగా మంజూరైన సీట్లలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఇలా సుమారు 18 విభాగాలకు సంబంధించిన పీజీ వైద్యసీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కళాశాలకు 128 సీట్లు రాగా అత్యల్పంగా నెల్లూరు మెడికల్ కాలేజీకి 5 సీట్లు వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కొత్తగా పీజీ వైద్యసీట్లతో పాటు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా సీట్లొచ్చాయి. దీనివల్ల సామాన్యులకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరగడం పేద వైద్యవిద్యార్థులకూ మంచి పరిణామం. – డాక్టర్ హరిచరణ్, వైస్ ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ -
Andhra Pradesh: పీజీ వైద్య సీట్లు డబుల్!
సాక్షి, అమరావతి: స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిధిలోని వైద్య కాలేజీల్లో భారీగా పీజీ వైద్య సీట్లు పెంచుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు దాదాపు రెట్టింపు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు విద్యార్థులకు సైతం పీజీ వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అన్ని స్పెషాలిటీలలో పీజీ సీట్లు 1,008 ఉండగా.. కొత్తగా 939 సీట్లను పెంచుకునే అవకాశం ఉన్నట్టు వైద్య విద్యా శాఖ తాజా అంచనాల్లో తేలింది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కాలేజీల్లో భారీగా సీట్లు పెరగనున్నాయి. అదనపు పడకలు.. స్టాఫ్‌కు అనుమతి కావాలి ప్రస్తుత అంచనా ప్రకారం 939 పీజీ సీట్లు పెంచుకోవాలంటే ఆయా కళాశాలల్లో అదనపు పడకలు, అందుకు తగిన సిబ్బంది నియామకానికి అనుమతి కావాలి. బోధనాస్పత్రుల్లో వాస్తవ పడకల సంఖ్య 11,274 కాగా.. ఎప్పటికప్పుడు అవసరం మేరకు అనధికారికంగా పడకలు పెంచుకుంటూ వాటిని 13,376కు చేర్చారు. అంటే 2,102 పడకలు అనధికారికంగా ఉన్నాయి. తాజాగా అంచనా వేసిన లెక్క ప్రకారం 7,783 పడకలు కావాలి. ప్రస్తుతం అనధికారికంగా ఉన్న 2,102 పడకలతో పాటు 5,681 పడకలకు మంజూరు ఇవ్వాలి. భారీగా యూనిట్లు పెరుగుతాయి బోధనాస్పత్రుల్లో యూనిట్లే కీలకం. ప్రస్తుతం మన బోధనాస్పత్రుల్లో 377 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే మరో 184 యూనిట్లు పెంచాలని అంచనా వేశారు. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన పడకలు, యూనిట్లు పెంచుకుంటూ వెళ్లాలి. కానీ గత ఏడేళ్లుగా ఈ పని జరగలేదు. దీంతో జనాభా పెరుగుతున్న కొద్దీ బోధనాస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. పీజీ సీట్లు, పడకలు, యూనిట్లు పెరిగితే ఈ ఒత్తిడి తగ్గుతుంది. సిబ్బందిని పెంచుకోవాల్సిందే పీజీ సీట్లు పెంచుకోవాలంటే వైద్య అధ్యాపకులను పెంచుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా 15 మంది ప్రొఫెసర్లు, 111 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం 57 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. సిబ్బందిని పెంచుకోవడం వల్ల 33 అదనపు సూపర్ స్పెషాలిటీ సీట్లనూ పెంచుకునే వీలుంటుంది. యూనిట్లు, పడకలు, వైద్యులు వంటివన్నీ పెరగడం వల్ల రోజువారీ ఔట్ పేషెంట్ సేవలు, ఇన్ పేషెంట్ సేవలు భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ప్రతిపాదన తాజాగా అంచనా వేసిన మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. పీజీ వైద్యసీట్లు పెరగడం వల్ల రానున్న రోజుల్లో రాష్ట్రంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్య బాగా పెరుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల వారికీ స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం నాడు–నేడు పనులతో వైద్య కళాశాలల్లోనూ మౌలిక వసతులు పెరుగుతున్నాయి. పీజీ సీట్లు పెరిగితే బోధనాస్పత్రులు ప్రైవేటుకు దీటుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, డైరెక్టర్, వైద్య విద్య -
కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరలేం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లకు కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ సంక్లిష్టతతో కూడుకున్నదని, కేంద్ర పరిధిలో అమలయ్యే వాటికి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రిజర్వేషన్లకు భిన్నమైన పరిస్థితులున్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. మరోవైపు విభజన చట్టం ఇంకా అమల్లోనే ఉన్నందున 2024 వరకూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేమని కమిటీ తెలిపింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సమ్మతి తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో చేరితే తలెత్తే సమస్యలపై అధ్యయనం కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కూలంకషంగా చర్చించిన అనంతరం కమిటీ తన నివేదికను వెల్లడించింది. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... 371–డి రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయి.. రాష్ట్రంలో 371–డి అనుసరించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్థానిక కోటాను 42ః36ః22 నిష్పత్తి ప్రకారం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరితే ఈ కోటాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బీసీ రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో ఓబీసీ కోటా లేదు. బీసీ కోటా మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ కేటగిరీకి 29 (బీసీ–ఏ, బీసీ–బి, బీసీ–సి, బీసీ–డి, బీసీ–ఇ కలిపి), ఈడబ్లు్యఎస్ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వీటితోపాటు స్పెషల్ కేటగిరీ కింద మహిళలకు 33.1, దివ్యాంగులకు 5, సైనికుల పిల్లలకు 1, ఎన్సీసీకి 1, క్రీడాకారులకు 0.5, అమరవీరుల కుటుంబాల చిన్నారులకు 0.25 శాతం రిజర్వేషన్లున్నాయి. వీటన్నిటికీ సంబంధించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం పలు జీవోలను విడుదల చేసింది. ఇవన్నీ కచ్చితంగా అమలు చేయాలంటే కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేం. ‘ఎంఆర్సీ’ అమల్లో ఉంది.. మెరిట్ ఆఫ్ ఏ రిజర్వ్డ్ కేటగిరీ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఒక రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీకి వెళితే ఆ సీటును అదే కేటగిరీతో వారితో భర్తీ చేయాలి. దీనికోసం 2001లో జీవో 550 ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లడంతో 2019 ఆగస్ట్ 13న జీవో నెం.111 ఇచ్చారు. తిరిగి 2020 నవంబర్ 13న కొద్దిపాటి మార్పులతో జీవో 159 ఇచ్చారు. ఇవన్నీ ప్రక్రియను బట్టి మారుతూ వచ్చాయి. చివరగా మళ్లీ 2020 డిసెంబర్ 4న జీవో 151 ఇచ్చారు. బీడీఎస్, ఎంబీబీఎస్‌కు విడివిడిగా ఒకేసారి ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించాలని దీని సారాంశం. కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరితే దీనికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నాం. చిన్న సమస్యలకూ ఢిల్లీ వెళ్లాలి.. నీట్ జాతీయ ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం 85 శాతం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. మిగతా 15 శాతం జాతీయ కోటాలో ఇచ్చిన సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. పూర్తి సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఏవైనా సమస్యలొచ్చినప్పుడు విద్యార్థులు పదేపదే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరే పరిస్థితి లేదని కమిటీ భావిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కేంద్రానికి స్పష్టత ఇస్తుంది. నిపుణుల కమిటీ ఇదే.. చైర్మన్: డా.శ్యాంప్రసాద్, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.మెంబర్ కన్వీనర్: డా.కె.శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సభ్యులు: డా.ఐవీ రావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, డా.ఎం రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు, ఎస్.నాగవేణి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఏపీ ఉన్నతవిద్యా మండలి. పీజీ అడ్మిషన్లకూ ప్రత్యేక విధివిధానాలు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో ఒక రకమైన విధానాలుండగా పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో రకమైన ఇబ్బందులున్నాయి. బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు (పీజీ వైద్య సీట్లు) 2013 మార్చి 13న ఇచ్చిన జీవో 43 ప్రకారం నిర్వహిస్తున్నాం. ప్రాంతాలవారీగా నిర్వహిస్తున్నాం. స్పెషాలిటీ పరంగా, కేటగిరీపరంగా చేస్తున్నాం. 2020 మే 29న ఇచ్చిన జీవో 57 ప్రకారం పీజీ కౌన్సెలింగ్‌లో సవరణలు వచ్చాయి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ సీటుకు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లేందుకు స్లైడింగ్ విధానం ఉంది. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేస్తున్నాం. కేంద్ర కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరితే వీటి అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. -
భారీగా పీజీ సీట్ల పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గానికొకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు పీజీ వైద్య సీట్లను పెంచేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో 11 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 980 వరకూ పీజీ వైద్య సీట్లున్నాయి. మరిన్ని సీట్లు పెరగాలంటూ యూనిట్లు పెంచడం, మౌలిక వసతులు కల్పించడం, పడకల స్థాయి పెంచడం వంటివి చేయాలి. ఇవన్నీ చేసేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నెల్లూరు, గుంటూరు, విజయవాడ వైద్య కళాశాలల్లో భారీగా సీట్లు పెంచేందుకు ఇప్పటికే వైద్య విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. పెంచనున్న సీట్లకు అఫిలియేషన్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి దరఖాస్తు చేసింది. యూనివర్శిటీ అనుమతించిన అనంతరం భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి దరఖాస్తు చేస్తారు. జూన్ 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని వైద్యవిద్యా శాఖాధికారులు తెలిపారు. ఆ మూడు కాలేజీల్లో సీట్ల పెంపు ► నెల్లూరు, గుంటూరు, విజయవాడలోని మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు పెంచేందుకు ఏర్పాట్లుచేశారు. ► కొత్తగా నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 104 క్లినికల్ పీజీ వైద్య సీట్లు, మరో 16 నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లు పెంచనున్నారు. ► గుంటూరు వైద్య కళాశాలలో రెండు ఎండీ రేడియో డయాగ్నసిస్ సీట్లు ఉండగా మరో 4 అదనంగా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ► విజయవాడలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండటంతో 19 గైనకాలజీ సీట్లు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ► ఈ మూడు వైద్య కళాశాలల్లో 158 పీజీ వైద్య సీట్లు కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ► ఈ ఏడాది గుంటూరులో కొత్త విభాగాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ► అదనంగా సీట్లు పెరగడంవల్ల యూనిట్లు పెరగడంతోపాటు స్పెషాలిటీ సేవలు పేద రోగులకు అందుబాటులోకి వస్తాయి. మిగతా కాలేజీల్లోనూ ఏర్పాటుకు సన్నాహాలు ప్రస్తుతం ఈ మూడు కాలేజీల్లో సీట్లకు దరఖాస్తు చేస్తున్నాం. ఈ సీట్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది నుంచి ఇవి అందు బాటులోకి వస్తాయి. ఇవికాకుండా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు మిగతా కాలేజీల్లోనూ ఎక్కడ అవకాశముంటే అక్కడ పీజీ వైద్య సీట్ల పెంపునకు కృషిచేస్తున్నాం. – డా. కె.వెంకటేష్, వైద్యవిద్యా సంచాలకులు ‘పీజీ’ చేసిన వారే బోధనకు అర్హులు రాష్ట్రంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో నాన్ మెడికల్ పీజీ వారితో బోధన చేయిస్తున్నారని, ఇది భారతీయ వైద్య మండలి నిబంధనలకు విరుద్ధమని ఎంబీబీఎస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీ క్లినికల్, పారా క్లినికల్ సబ్జెక్టుల్లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ చేసిన వారితోనే బోధన చేయించాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వీళ్లు మాత్రమే అర్హులని ఎంసీఐ స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని తోసిరాజని ప్రయివేటు వైద్య కళాశాలలు ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనాటమీ, ఎంఎస్సీ ఫిజియాలజీ, ఎంఎస్సీ ఫార్మకాలజీ చదివిన వారితో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తున్నారు. ► ఎంఎస్సీ చదివిన వారైతే తక్కువ వేతనానికి వస్తారని, మెడికల్ పీజీ చదివిన వారికి ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. ► ఒకవేళ ఎండీ, ఎంఎస్, డీఎన్బీ అభ్యర్థులు లేకుంటే ఎంఎస్సీ చదివిన వారిని కేవలం ట్యూటర్లుగా మాత్రమే నియమించుకోవాలని ఎంసీఐ స్పష్టం చేసింది. ► నాన్ మెడికల్ పీజీ చేసిన వారు పాఠాలు సరిగా చెప్పలేకపోతున్నారని ప్రైవేటు వైద్యకళాశాలల్లో చదువుతున్న ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ► త్వరలోనే దీనిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కొంతమంది వైద్యవిద్యార్థులు పేర్కొన్నారు. ► 2018లో అప్పటి ప్రభుత్వం సైతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారూ అర్హులని నోటిఫికేషన్ ఇవ్వడం ఎంసీఐ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ముగిసిన తొలి విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జీవో 57తో 187 మంది ఎంఆర్సీలకు మేలు 2020–21 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, ఎండీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రెండు రోజులుగా నిర్వహించిన తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారంతో ముగిసింది. పీజీ మెడికల్‌లో 1,134 సీట్లకు 1,091, ఎండీఎస్‌లో 235 సీట్లకు 219 సీట్లు భర్తీ అయ్యాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. 2013లో ఇచ్చిన జీవో 43 ప్రకారం మెరిటోరియస్ రిజర్వుడు క్యాండిడేట్స్ (ఎంఆర్సీ) విద్యార్థులకు అన్యాయం జరుగుతోందనే విషయమై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసి కొన్ని సవరణలు చేస్తూ పీజీ మెడికల్‌కు జీవో నం.57, పీజీ డెంటల్ (ఎండీఎస్)కు జీవో నెం.58 జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఈ జీవోలతో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే పీజీ మెడికల్‌లో 187 మంది, ఎండీఎస్‌లో 30 మంది ఎంఆర్సీ అభ్యర్థులకు మేలు జరిగినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. అయితే 57, 58 జీవోలపై కొంత మంది ఆదివారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ వర్గాల సమాచారం. -
9 వైద్య కళాశాలల్లో కొత్త విభాగాలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న వైద్య అవసరాలు, కొత్తరకం జబ్బులను ఎదుర్కోవడానికి బోధనాస్పత్రులను మరింత బలోపేతం చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లేని కొత్త విభాగాలను వాటిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా ఇందులో 9 బోధనాస్పత్రుల్లో అవసరాన్ని బట్టి కొత్త విభాగాలు, కొన్ని చోట్ల ఉన్న విభాగాల్లోనే అదనపు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. బోధనాస్పత్రికి వెళ్తే ఎక్కడా ‘ఈ జబ్బుకు వైద్యం లేదు’ అనే మాట రాకుండా చేయాలన్నదే సర్కార్ ఉద్దేశం. దీనికి తగ్గట్టు పడకలు, డాక్టర్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్‌లో పీజీ వైద్య సీట్లు కూడా పెరగనున్నాయి. వైద్య కళాశాలలు – విభాగాలు.. ► గుంటూరు మెడికల్ కాలేజ్: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్) ► కర్నూలు మెడికల్ కాలేజ్: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్) ► ఎస్వీఎంసీ, తిరుపతి: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ ► ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్), కార్డియాలజీ (అదనపు యూనిట్) ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అనంతపురం: పీడియాట్రిక్ సర్జరీ ► రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్) ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కడప: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, నియోనెటాలజీ ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఒంగోలు: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ. -
ఫీజుల పెంపుపై జూడాలు ఆందోళన బాట..
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలకు అనుకూలంగా ఫీజులు పెంచారని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. 2017లో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని.. పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారంటూ జూడాలు ప్రశ్నించారు. తక్షణమే జీవో 28 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తెలంగాణకు కొత్తగా 54 పీజీ మెడికల్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 54 పీజీ మెడికల్ సీట్లను మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులిచ్చింది. ఈ సీట్లన్నీ నిజామాబాద్ మెడికల్ కాలేజీకే దక్కడం విశేషం. ఎంసీఐ నుంచి నిజామాబాద్ వైద్య విద్య కళాశాలకు శాశ్వత గుర్తింపు లభించిన ఏడాదికి ఒకేసారి 54 పీజీ సీట్లు మంజూరు కావడంపై వైద్య విద్య ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి మంజూరైన పీజీ సీట్లలో జనరల్ మెడిసిన్ – 10, అనస్థీషియా – 6, గైనకాలజీ – 6, ఆర్థోపెడిక్స్ – 4, అనాటమీ – 4, ఈఎన్టీ – 3, ఫోరెన్సిక్ మెడిసిన్ – 3, ఫిజియాలజీ – 2, పీడియాట్రిక్ – 3, సైకియాట్రీ – 2, అప్తామాలజీ – 3, పాథాలజీ – 3, మైక్రోబయాలజీ – 3, బయో కెమిస్ట్రీ – 2 ఉన్నాయి. ఇదే కాలేజీకి గతేడాది 3 పీజీ ఫార్మాకాలజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నీట్ పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఏడాది మార్చి – ఏప్రిల్ నెలలో నిజామాబాద్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు ఇస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 706 పీజీ సీట్లుండగా, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 917 సీట్లున్నాయి. మొత్తం అన్నీ కలిపి 1,623 పీజీ సీట్లున్నాయి. కొత్తగా వచ్చిన 54 సీట్లతో కలపి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే 760 సీట్లు అవుతాయి. -
యూనిట్ల లెక్క తప్పింది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్లు కాపాడుకునేందుకు ఇచ్చిన తప్పుడు లెక్కలు ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. యూనిట్లు తక్కువగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ ఉన్నట్లు చూపించి సీట్లను కాపాడుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్) కింద 10 శాతం కోటా కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం పీజీ వైద్యసీట్లను అదనంగా 10 శాతం పెంచుతామని ప్రకటించింది. కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పీజీ వైద్యసీట్లు, యూనిట్లు, అధ్యాపకులు, బెడ్లు ఇలా అన్ని వివరాలను తక్షణమే పంపించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 10 శాతం ఈబీసీ కోటా అమలు చేయాలని, ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 శాతం సీట్లు పెంచాలన్నది కేంద్రం ఆలోచన. కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో స్పెషాలిటీల వారీగా అదనంగా 3 సీట్లు వస్తాయి. ప్రతి స్పెషాలిటీలో ప్రతి కళాశాలలో సీట్లు పెరుగుతాయి. ఈ ఆలోచన బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిక్కుల్లో పడింది. ఒక పీజీ వైద్య సీటుపెరగాలంటే ఫ్యాకల్టీ నుంచి యూనిట్ల వరకూ లెక్కలుండాలి. ఇదివరకే రాష్ట్రంలో తక్కువ యూనిట్లున్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించి పీజీ వైద్య సీట్లను నిలుపుకుంది. కొన్ని కాలేజీల్లో యూనిట్ల లెక్కలు ప్రభుత్వం నిధులిచ్చేనా? రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 820 పీజీ సీట్లు అందుబాటులో ఉండగా, ఈబీసీ కోటా కింద 10 శాతం అదనంగా.. అంటే 82 పీజీ వైద్యసీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ, ఈ 82 సీట్లకు సంబంధించిన వసతులు కల్పించే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే మౌలిక వసతులు, వైద్య పరికరాలకు అవసరమైన నిధులే ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈబీసీ కోటా సీట్లకు కావాల్సిన వసతులు ఏ మేరకు కల్పిస్తారోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యసీట్లలో ఈబీసీ కోటా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ కోటా కోసం పెరగాల్సిన సీట్లు పెరిగే అవకాశం లేకపోవడంతో కష్టాలు తప్పవంటున్నారు. 10 శాతం అదనపు సీట్లకు యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? యూనిట్లు కావాలంటే అదనపు సిబ్బంది కావాలి, నర్సులు పెరగాలి, పడకలు పెరగాలి, ఇవన్నీ చెయ్యాలంటే నిధులు కావాలి, ఏం చేద్దాం అంటూ వైద్య విద్యా శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. ఉన్న సీట్లనే కాపాడుకోవడానికి లేని యూనిట్లను చూపిస్తున్నాం, మళ్లీ కొత్త సీట్లు కావాలంటే ఉన్నవి కూడా పోయే ప్రమాదం ఉంటుందేమో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘నీట్’గా సీట్లు బ్లాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు పీజీ వైద్య సీట్ల భర్తీలో యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎన్ఆర్ఐ కోటాగా మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. 2019– 20 వైద్య విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ సీట్ల మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ శని, ఆదివారాల్లో జరగనున్న నేపథ్యంలో భారీగా సీట్లను బ్లాక్ చేసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాయి! నీట్లో మంచి ర్యాంకులు సాధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సీట్లు పొందిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రూ. లక్షల్లో నజరానాలు ఇచ్చి తమ కాలేజీల్లో చేరినట్లుగా చూపేందుకు పక్కాగా స్కెచ్ వేసుకున్నాయని తెలిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో అప్పటికప్పుడే సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండటం, ఈ సీట్లకు స్థానిక రిజర్వేషన్ ఉండకపోవడం, ‘నీట్’వల్ల దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్మెంట్ సీట్లకు పోటీ పడే అవకాశం ఉండటంతో యాజమాన్యాలు వీటిని తమకు అనుకూలంగా మార్చుకోజూస్తున్నాయి. నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే విడుదల చేసిన మెరిట్ జాబితాలో దాదాపు 50 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. వారంతా అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందిన వారేనని, ఇప్పటికే అఖిల భారత కౌన్సెలింగ్, వాళ్ల సొంత రాష్ట్రాల్లోని కౌన్సెలింగ్‌లో సీట్లు పొందారని చెబుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు పొంది మళ్లీ మన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో పీజీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని కొందరు టాప్ ర్యాంకర్లు కూడా జాతీయస్థాయి కాలేజీల్లో చేరినా ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లకు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇలా చేయడం వెనుక మతలబు ఏమిటని ఇతర వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేవలం సీటు బ్లాక్ చేసే ఎత్తుగడలో భాగంగా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆయా విద్యార్థులను రంగంలోకి దింపాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ చేయడం ద్వారా సీటుకు రూ. కోట్లు.. రాష్ట్రంలో మైనారిటీ కాలేజీలతో కలుపుకొని 11 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లుండగా మరో 50%మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లు ఇప్పటికే భర్తీ అవగా మేనేజ్మెంట్ కోటా కింద 500 సీట్లున్నాయి. ఈ కోటాలో మళ్లీ మూడు కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ–1లో సగం అంటే 250 సీట్లు ఉన్నాయి. వాటిలో ఫీజు ఏడాదికి రూ. 24 లక్షలు. ఇక కేటగిరీ–2లో 30 శాతం లెక్కన 150 సీట్లున్నాయి. ఇక కేటగిరీ–3లో 20 శాతం కింద 100 సీట్లున్నాయి. కేటగిరీ–2 సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తారు. వాటి ఫీజు కేటగిరీ–1 ఫీజుకు మూడు రెట్లు ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 72 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇక కేటగిరీ–3 కోటాను ఇన్స్టిట్యూషనల్ కోటా అంటారు. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వారి పిల్లలకు కేటాయించుకోవడానికి సంబంధించిన కోటా. వారి బంధువులకు కూడా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. వాటి ఫీజు కూడా కేటగిరీ–2 ఫీజుల మాదిరిగానే రూ. 72 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. ఇప్పుడు కేటగిరీ–1 సీట్లను బ్లాక్ చేయడం ద్వారా మేనేజ్మెంట్లు సీట్ల దందాకు తెరలేపాయి. కేటగిరీ–1 సీట్లలో చేరిన విద్యార్థులెవరైనా వాటిని వదులుకుంటే అవి ఆటోమేటిక్‌గా కేటగిరీ–2లోకి అంటే ఎన్ఆర్ఐ సీట్లుగా మారిపోతాయి. అలా మారిపోతే వాటి ఫీజు అధికారికంగానే రూ. 72 లక్షలు అవుతుంది. ఇక అనధికారికంగా డిమాండ్‌ను బట్టి రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు కూడా అమ్ముకునేలా యాజమాన్యాలు దందాకు సిద్ధమయ్యాయి. ఎలా బ్లాక్ చేస్తారంటే? పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందిన మెరిట్ విద్యార్థులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కుమ్మక్కయ్యాయని సమాచారం. ఈ కుమ్మక్కులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేరిన విద్యార్థులు కస్టోడియన్ సర్టిఫికెట్‌కు బదులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లనే వెరిఫికేషన్ కోసం తీసుకొస్తారు. అలా అక్కడ సీటు వచ్చిన విద్యార్థి ఇక్కడ కూడా కౌన్సిలింగ్లో పాల్గొంటారు. కాలేజీ యాజమాన్యంతో ముందే జరిగిన ఒప్పందం ప్రకారం ఇక్కడి కాలేజీల్లో వాళ్లు కేటగిరీ–1 సీటు కింద చేరతారు. అలాగే ఫీజు కింద రూ. 24 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన ఏళ్లకు బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తారు. మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి అన్ని కేటగిరీల్లోని అన్ని విడతల కౌన్సిలింగ్‌లు అయిపోయాక ఈ విద్యార్థులు తమ సీటును వదులుకుంటారు. దీంతో కేటగిరీ–1 సీట్లు కేటగిరీ–2లోకి అంటే ఎన్ఆర్ఐ కోటాలోకి మారిపోతాయి. అయితే సీటును వదులుకుంటే తప్పనిసరిగా సంబంధిత విద్యార్థి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 5 లక్షల జరిమానా చెల్లించాలి. ఆ సొమ్మును సైతం కాలేజీ యాజమాన్యాలే విద్యార్థికి ఇవ్వడంతోపాటు మరో రూ. 4–5 లక్షలు ముట్టజెబుతాయి. ఆ తర్వాత ఆ సీట్లను ఎన్ఆర్ఐ కోటాలోకి మార్చుకొని డిమాండ్‌ను బట్టి రూ. కోటి నుంచి రూ. రెండు కోట్ల వరకు అమ్ముకుంటాయి. రూ. 200 కోట్ల దందాకు వ్యూహం! ప్రైవేటు మెడికల్ కాలేజీల దందాను ఆపడం ఎవరి తరం కాదని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలే అనధికారికంగా అంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి ఇక్కడ చేరితే తాము ఎలా అడ్డుకోగలమని అంటున్నాయి. కేటగిరి–1లోని 250 సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతోపాటు మన రాష్ట్రంలోని టాప్ ర్యాంకర్ల ద్వారా కూడా ఇటువంటి దందా నిర్వహించేందుకు యాజమాన్యాలు వ్యూహం రచించాయి. కనీసం 75 నుంచి 100 కేటగిరీ–1 సీట్లను కేటగిరీ–2 సీట్లలోకి మార్చేందుకు పథకం రచించినట్లు తెలిసింది. కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో అధికారులు కూడా నోరుమెదపడంలేదు. వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ దందా వల్ల పలు కాలేజీలు దాదాపు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు అక్రమంగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా వల్ల సహజంగా మెరిట్ ప్రకారం కేటగిరీ–1లో సీటు దక్కించుకోవాల్సిన విద్యార్థులు నష్టపోతున్నారు. గతేడాది దాదాపు 30 సీట్లు కేటగిరీ–1 నుంచి ఎన్ఆర్ఐ కేటగిరీలోకి మారినట్లు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి యాజమాన్యాలు 75 నుంచి 100 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఇదంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. 50మందిలో మనోళ్లు ముగ్గురే.. ప్రైవేటు మెడికల్ కాలేజీలు మైండ్‌గేమ్ ఆడుతూ వ్యాపారం చేస్తున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన మేనేజ్మెంట్ మెరిట్ లిస్టులోని టాప్–50 మందిలో 47 మంది కశ్మీర్, బిహార్, బెంగాల్ విద్యా ర్థులే ఉన్నారు. కేవలం ముగ్గురే మన రాష్ట్ర విద్యార్థులున్నారు. ఆ 47 మంది విద్యార్థులు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో కాలేజీల్లో చేరారు. మళ్లీ ఇక్కడ వారెందుకు దరఖాస్తు చేశారంటే యాజమాన్యాలు కుమ్మక్కైనట్లు అర్థమవుతోంది. దీనిపై ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోవాలి. – విజయేందర్, జూడా, తెలంగాణ అధ్యక్షుడు ఒక్క సీటు కూడా బ్లాక్ కానివ్వం... మేనేజ్మెంట్ కోటాలోని కేటగిరీ–1 సీటు కోసం దేశంలోని ఏ విద్యార్థైనా పోటీ పడొచ్చు. అయితే తమ సొంత రాష్ట్రాల్లోని ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీటు పొంది మళ్లీ ఇక్కడ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని గతంలోనే మాకు ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ సీటు పొందిన వారు ఇప్పటికే అక్కడ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారు. మన దగ్గర సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ ఉన్న వారినే అనుమతిస్తాం. ఈ విషయమై కౌన్సెలింగ్ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా వెరిఫికేషన్‌కు అనుమతించం. ఈ నెల 22న ఆలిండియా కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారి జాబితా కూడా వస్తుంది. ఆ జాబితాలో మేనేజ్మెంట్లోని కేటగిరీ–1 మెరిట్ లిస్ట్‌లో పేర్లను పరిశీలిస్తాం. అక్కడా ఇక్కడా ఆ విద్యార్థులే ఉంటే ఆయా కాలేజీలకు ఫోన్ చేసి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని తెలియజేస్తాం. ఆ తర్వాతే సీట్లు కేటాయిస్తాం. ఒక్క సీటు కూడా బ్లాక్ అవకుండా చూస్తాం. ఈ విషయంలో రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం -
మెడికల్ పీజీ సీట్లలో కోటా పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లలో ఇన్‌సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఇన్‌సర్వీస్ కోటా సీట్లను సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ మాట్లాడుతూ దేశంలో 11 రాష్ట్రాలు ఇన్‌సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయని, దీంతో చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చారన్నారు. అయితే నీట్ పరీక్షలను తీసుకురావడంతో మొత్తం వ్యవహారం తలకిందులైందన్నారు. దీంతో ప్రజాఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఇన్సర్వీసెస్ కోటా రద్దు నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఇన్‌సర్వీస్ కోటాపై తమిళనాడు ప్రభుత్వ వైద్యులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ను వేశారని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జాతీయ స్థాయిలో దీనిపై కీలక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇన్సర్వీస్కోటాను పునరుద్ధరించాలని ఎన్ఎంసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైద్యులకు ఇచ్చే వేతనాలు, అలవెన్సులపైనా సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం ఇక నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశానికి దక్షిణ భారత రాష్ట్రాల నుంచి డాక్టర్ రాజేశ్గైక్వాడ్( మహారాష్ట్ర), కత్రివేలు(తమిళనాడు), డా.రావూఫ్(కేరళ), డా. జయధీర్(ఏపీ), రంగానాథ్(కర్ణాటక), డాక్టర్ ప్రవీణ్(టీజీజీఎ) తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్యాణ్‌చక్రవర్తి, దీన్‌దయాల్, డాక్టర్. జనార్థన్‌తో పాటు పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. -
మెడికల్ పీజీ కోటాపై డాక్టర్ల పోరాటం
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లలో ఇన్‌సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంఘం కీలక సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇన్‌సర్వీస్ కోటా సీట్లను సాధించేందుకు పోరాటం చేయాలని పిలుపు ఇవ్వనున్నారు. ఢిల్లీ వెళ్లి ఎంపీలను, ఇతర కేంద్ర పెద్దలను కలసి విన్నవించాలని తీర్మానించాలని భావిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సమావేశంలో ఈ ప్రాంత డాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపైనా చర్చించే అవకాశముంది. ‘నీట్’తో కోటాకు టాటా.. రాష్ట్రాల్లో పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్‌సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అయితే నీట్ పరీక్షలతో ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ కోటాను రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీం కోర్టులో పిటిషన్.. ఇన్‌సర్వీస్ కోటా రద్దుపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం ఎంసీఐ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్‌సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకురారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఘ ప్రతినిధులను సంఘటితం చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
పీజీ వైద్య సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ వైద్య సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఏప్రిల్ 20 లోగా తొలి దశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 (సోమవారం) నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి నాలుగైదు రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయిన వెంటనే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 10న వెబ్ ఆప్షన్లు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేస్తారు. మన రాష్ట్రంలో జాతీయ పూల్‌కు సీట్లు మినహాయిస్తే 428 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ ఏడాది అర్హత సాధించినవారు తక్కువగా ఉండటం, జాతీయ పూల్‌లో ఎక్కువ మందికి సీట్లు రాకపోవడం, వాళ్లంతా స్టేట్ సీట్లకు రావడంతో పోటీ మరింతగా పెరిగింది. ఒక్కో సీటుకు 15 మందికిపైనే పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్థోపెడిక్స్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ మెడిసిన్, ఎండీ గైనకాలజీ, ఎండీ రేడియాలజీ తదితర కోర్సులపై అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది నేషనల్ పూల్ నిలువునా ముంచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అర్హత మార్కులు సాధించినవారు చాలా తక్కువగా ఉన్నారని, కటాఫ్ మార్కుల శాతం తగ్గిస్తే మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. మే 31 నాటికి చివరి దశ కౌన్సెలింగ్ పూర్తి: రిజిస్ట్రార్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న అన్ని సీట్లకూ మే 31లోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం మే 31 నాటికి అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నుంచి సీట్ల కేటాయింపు వరకూ అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 50 శాతం పీజీ వైద్య సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, మిగతా 50 శాతం జాతీయ పూల్ సీట్లకు సీబీఎస్ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని చెప్పారు. -
నేషనల్ పూల్‌లోని సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: నేషనల్ పూల్‌లో ఉన్న పీజీ వైద్య సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల అధికారులకూ తెలియజేసింది. పీజీ వైద్యసీట్ల భర్తీకి జాతీయస్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్ష (నీట్) ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. జమ్మూ– కశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు ఈఏడాది జాతీయ పూల్‌లోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ 50 శాతం సీట్లను నేషనల్ పూల్‌కు ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలు ఇచ్చే 50 శాతం పీజీ వైద్య సీట్లకూ మన అభ్యర్థులు పోటీ పడవచ్చు. మిగతా 50 శాతం సీట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో కూడా కొన్ని నిబంధనలు విధించారు. మొదటిసారి కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థి సీటు ఎంపిక చేసుకోకపోయినా రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. రెండో సారి కూడా సీటు ఎంపిక చేసుకోకపోతే ఆ అభ్యర్థిని తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌కు అనుమతించరు. సీటు ఎంచుకున్న అభ్యర్థి ఐదు రోజుల్లోగా కళాశాలలో చేరకపోతే సీటు రద్దు చేస్తారు. -
నేడు యాజమాన్య పీజీ వైద్య సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య యాజమాన్య, ఎన్నారై, ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు శనివారం నోటిఫికేషన్ జారీకానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ప్రకటన విడుదల చేయనుంది. ప్రైవేట్ మెడికల్ పీజీ సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టే ఎత్తివేతకు కాలేజీలు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. రెండో విడత కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కొందరిని శుక్రవారం చేర్చుకున్నాయి. బ్యాంకు గ్యారంటీపై గందరగోళం నెలకొనడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మొదలైందని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సమయం సరిపోకపోవడంతో శనివారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిం చారు. కన్వీనర్ కోటా సీట్లకు ఒకవైపు కౌన్సిలింగ్ నిర్వహిస్తూనే యాజమాన్య, ఎన్నారై కోటా సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా విద్యార్థులను నేరుగా పిలిపించి సీట్లు కేటాయిస్తారు. ఈ నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. -
పీజీ వైద్య ఫీజుల మోత
► కన్వీనర్ కోటా ఫీజు రూ. 3.20 లక్షల నుంచి రూ.6.90 లక్షలకు పెంపు ► యాజమాన్య కోటా రూ.5.80 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు.. ► కొత్తగా ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్ కోటా.. వాటికి మేనేజ్మెంట్ సీట్ల ఫీజుకు మూడింతలు వసూలు చేసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టే పీజీ వైద్య సీట్ల ఫీజులను రాష్ట్ర సర్కారు భారీగా పెంచింది. అటు యాజమాన్య కోటాతోపాటు ఇటు కన్వీనర్ కోటా సీట్ల ఫీజులనూ పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ‘నీట్’లో అర్హత సాధించిన వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఫీజుల పెంపుతో.. సర్కారుకు, ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సంఘానికి మధ్య జరిగిన చర్చల్లో ప్రైవేటు వైద్య కళాశాలలే విజయం సాధించినట్టయింది. కొత్తగా ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్.. ప్రస్తుతం రాష్ట్రంలో క్లినికల్ కన్వీనర్ కోటా సీటుకు రూ.3.20 లక్షల ఫీజు ఉండగా.. దాన్ని ఏకంగా రూ.6.90 లక్షలు చేశారు. ఇక యాజమాన్య కోటా సీట్లకు ప్రస్తుతం ఉన్న రూ.5.80 లక్షల ఫీజును రూ.24.20 లక్షలకు పెంచారు. కొత్తగా ఇన్స్టిట్యూషనల్ కోటా 10 శాతం, ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) కోటా 15 శాతంతో ఏర్పాటు చేశారు. ఈ కేటగిరి సీట్లకు యాజమాన్య కోటా సీటుకు వసూలు చేసే సొమ్ములో మూడు రెట్లు మించకుండా వసూలు చేసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ.72.60 లక్షల వరకు, మూడేళ్లకు కలిపి రూ.2.17 కోట్లు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్ఆర్ఐ కోటా సీటుకు చెల్లించే డొనేషన్ రూ.కోటిన్నర వరకు ఉంటే.. ఇప్పుడు అధికారికంగానే రూ. 2.17 కోట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాదినుంచి 4 కేటగిరీలు ఈ ఏడాది నుంచి పీజీ వైద్య సీట్లను 4 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరి (కన్వీనర్ కోటా) కింద 50 శాతం సీట్లుంటాయి. అంటే ఉదాహరణకు ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో 100 సీట్లుంటే 50 సీట్లు ప్రభుత్వానికి మిగతా 50 సీట్లు ప్రైవేటుకు ఉంటాయి. ప్రైవేటుకు ఉన్న 50 శాతం సీట్లలో 10 శాతం ఇన్స్టిట్యూషన్ కోటాగా, మరో 15 శాతం ఎన్ఆర్ఐ కోటాగా నిర్ధారించారు. వీటన్నింటినీ నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదినుంచి ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు, కన్వీనర్ కోటా కింద లేదా యాజమాన్య కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు విధిగా స్టైఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు కాలేజీల్లో 728 పీజీ వైద్య సీట్లు రాష్ట్రంలో నిమ్స్ సహా మొత్తం 15 మెడికల్ కాలేజీల్లో 1,477 పీజీ, డిప్లొమా వైద్య సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 677 పీజీ సీట్లుండగా, నిమ్స్‌లో 72 సీట్లున్నాయి. ఇవిగాక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 728 పీజీ సీట్లున్నాయి. ప్రస్తుతం వీటిల్లో సగం అంటే 364 సీట్లు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. మిగిలిన 364 సీట్లు యాజమాన్య కోటా కిందకు వస్తాయి. ఫీజుల వివరాలు ఇవీ.. ఎండీ/ఎంఎస్/డిప్లొమా..కేటగిరీ పెరగబోయే ఫీజు కన్వీనర్ కోటా కింద (ఏడాదికి) ప్రి క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ.3.60 లక్షలు పారా క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ.6.60 లక్షలు క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ.6.90 లక్షలు మేనేజ్మెంట్ కోటా కింద ప్రి క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ.3.60 లక్షలు పారా క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ.6.90 లక్షలు క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ.24.20 లక్షలు ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషన్ కేటగిరీ కింద.. ప్రి క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ. 10.80 లక్షలు పారా క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ. 20.70 లక్షలు క్లినికల్ డిగ్రీ/డిప్లొమా రూ. 72.60 లక్షలు ఎండీఎస్ (డెంటల్) కోర్సుల ఫీజుల వివరాలు కన్వీనర్ కోటా కింద.. పారా క్లినికల్ డిగ్రీ రూ.5.25 లక్షలు క్లినికల్ డిగ్రీ రూ.5.50 లక్షలు యాజమాన్య కోటా కింద.. పారా క్లినికల్ డిగ్రీ రూ.7 లక్షలు క్లినికల్ డిగ్రీ రూ.10 లక్షలు ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషన్ కోటా కింద.. పారా క్లినికల్ డిగ్రీ రూ.8 లక్షలు క్లినికల్ డిగ్రీ రూ.15 లక్షలు -
3,618 వైద్య పోస్టుల భర్తీ
రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 3,618 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైద్యులు, నర్సులతో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులనూ భర్తీ చేయనుంది. ఇందులో ఇప్పటికే 2,118 పోస్టులకు అనుమతివ్వగా.. తాజాగా మరో 1,500 పోస్టులకు పచ్చజెండా ఊపింది. ఈ నియామకాల బాధ్యతను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు అప్పగించాలని నిర్ణయించినట్లు, ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశమున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం పోస్టుల్లో దాదాపు వెయ్యి వరకు వైద్య పోస్టులున్నట్లు అంచనా. మిగతావి నర్సులు, పారామెడికల్ పోస్టులు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు ఇతర ఆస్పత్రుల వరకు మొత్తంగా 5,302 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలోనే వైద్యారోగ్య శాఖ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. అందులోనే 3,618 పోస్టులను భర్తీకి చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి 9, కాకతీయ మెడికల్ కాలేజీకి 36 సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. 2017– 18 పీజీ అడ్మిషన్ల నుంచే సీట్లను భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గాంధీలో ఎంఎస్ సర్జరీలో 6 సీట్లు, ఎంఎస్ ఈఎన్టీలో 2, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒక సీటు..కాకతీయలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో 11 సీట్లు, ఎంఎస్ జనర ల్ సర్జరీలో 9, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 6, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒకటి, ఎంఎస్ ఓబీజీలో 6, ఎంఎస్ పీడియాట్రిక్స్‌లో 3 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది. -
రాష్ట్రానికి మరో 45 పీజీ సీట్లు
హైదరాబాద్: రాష్ట్రానికి మరో 45 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి 9, కాకతీయ మెడికల్ కాలేజీకి 36 పీజీ వైద్య సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. 2017-18 పీజీ అడ్మిషన్ల నుంచే సీట్లను భర్తీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గాంధీలో ఎంఎస్ సర్జరీలో 6 సీట్లు, ఎంఎస్ ఈఎన్టీలో 2, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒక సీటు.. కాకతీయలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో 11 సీట్లు, ఎంఎస్ జనరల్ సర్జరీలో 9, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 6, ఎంఎస్ ఆప్తమాలజీలో ఒకటి, ఎంఎస్ ఓబీజీలో 6, ఎంఎస్ పీడియాట్రిక్స్‌లో 3 సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చింది. ఇటీవలే రాష్ట్రానికి 131 పీజీ వైద్య సీట్లకు ఎంసీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అందులో ఉస్మానియాకు 90, నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు.. అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉన్నప్పుడు ఒక సీటును రెండుకు పెంచాలని ఎంసీఐ నిర్ణయించడంతో ఈ సీట్లు రాష్ట్రానికి మంజూరయ్యాయి. -
రాష్ట్రానికి కొత్తగా 153 పీజీ వైద్య సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 11 వైద్య కళాశాలలు, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (స్విమ్స్)లకు 153 పీజీ వైద్య సీట్లు పెంచేందుకు భారతీయ వైద్య మండలి అనుమతిచ్చింది. ప్రొఫెసర్లు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం సీట్లు పెంచుతామని రెండు నెలల క్రితమే కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేసి 15 రోజుల క్రితమే 389 వైద్య పీజీ సీట్లు పెంచాలంటూ కేంద్రానికి, భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో 153 పీజీ వైద్య (క్లినికల్) సీట్లు మాత్రమే మండలి పెంచింది. పీజీ వైద్య సీట్లు పెరిగినట్లు తమకు వైద్య మండలి నుంచి అనధికారిక సమాచారం అందిందని, అధికారిక ఉత్తర్వులు మాత్రం రావాల్సి ఉందని డీఎంఈ తెలిపారు. త్వరలోనే పీజీ వైద్య సీట్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరగనుంది. -
రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు
⇒ అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు ⇒ ఉస్మానియాకు ఏకంగా 90 సీట్లు ⇒ నిమ్స్‌కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు ⇒ 2017–18 పీజీ అడ్మిషన్ల నుంచే వీటి భర్తీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీగా పీజీ వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అదనంగా 131 పీజీ వైద్య సీట్లు కేటా యిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అధికంగా 90 సీట్లు, నిమ్స్‌కు 30, గాంధీకి 11 కేటాయిం చింది. ఉస్మానియాలో 279 పీజీ సీట్లుండగా అవి 369కి పెరగనున్నాయి. గాంధీలో 138 నుంచి 149కి, నిమ్స్‌లో 50 నుంచి 80కి పెరుగుతున్నాయి. పెరిగిన సీట్లన్నింటినీ 2017–18లోనే భర్తీ చేస్తారు. సీట్లు పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదనంగా మరో 100 పీజీ సీట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజీ కి 50 సీట్లు కోరాలని నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు కోరనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు రమణి ‘సాక్షి’కి తెలిపా రు. పీజీ సీట్లు లేని ఆదిలాబాద్, నిజామా బాద్ మెడికల్ కాలేజీలకు కూడా ఈసారి సీట్లు కోరాలని నిర్ణయించామన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉండగా ప్రస్తుతమున్న ఒక సీటును రెండుకు పెంచా లని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు పెంచింది. వీటిలో భాగంగా రాష్ట్రా నికి 131 సీట్లను అదనంగా కేటాయించింది. మరో 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని రమణి తెలిపారు. ఈ మేరకు ఇప్ప టికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్కు రెండు పీజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసింది. ప్రైవేట్‌లో ఒక మెడికల్ కాలేజీలో మాత్రమే ఈ సదుపాయం ఉండగా ప్రభుత్వ రంగంలో నిమ్స్‌కు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. ఈ విభాగంలో నిమ్స్‌కు 2 ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు కేటాయించింది. ► ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 విభాగాలకు సీట్లను పెంచారు. అత్యధికంగా ఎంఎస్ జనరల్ సర్జరీ విభాగంలో 18 సీట్లు, ఎండీ పీడియాట్రిక్‌లో 17 సీట్లు పెంచారు. ఎంఎస్ ఆప్తమాలజీలో 12, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 11 సీట్లు పెరిగాయి. ► గాంధీ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్‌లో 8 పీజీ సీట్లు పెరిగాయి హా నిమ్స్‌లో ఎండీ జనరల్ మెడిసిన్‌లో 11 సీట్లు, ఎండీ అనెస్థీషియాలజీలో 8 సీట్లు, ఎండీ రేడియో డయాగ్నసిస్‌లో 6 సీట్లు పెరిగాయి. -
పీజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్
- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం - నేడు అన్ని రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని పీజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిం చాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లోటు పాట్లు, ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రా ల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, వైద్యవిద్యా సంచాలకులను ఆదేశిం చింది. ఇందు కోసం ఈ నెల 28న (నేడు)అన్ని రాష్ట్రాల అధికారు లతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధి కారులు వీడియో కాన్ఫ రెన్స నిర్వ హిస్తున్నారు. 1956 ఐఎంఏ యాక్ట్‌ను సవ రించి, అన్ని కళాశాలల్లోని పీజీ సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తే బావుంటుందని నిర్ణయించింది. దీంతోపాటు నీట్ ప్రవేశ పరీ క్షను హిందీ, ఇంగ్లిష్, అస్సామి, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, తెలుగు భాషల్లో నిర్వహించే విషయంపై చర్చ జరగనుంది. పాశ్చాత్య దేశాల్లో విద్యనభ్యసించిన విద్యా ర్థులు కూడా నీట్ పరీక్ష రాసే అంశంపై చర్చి స్తారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం జరిగే నీట్ ప్రవేశపరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఇంటర్మీ డియట్‌లో కనీస మార్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఇంటర్లో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులు, అన్రిజర్వ్డ్ (రిజర్వేషన్లేని) వారికి 50 శాతం మార్కులు ఉండాలనేది కేంద్రం అభిప్రాయం. ఈ మార్కుల శాతం ప్రధానంగా ఫిజిక్స్, కెమి స్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఉంటే సరిపోతుంద ని, అన్నిసబ్జెక్టుల్లో నిర్ణరుుంచిన శాతం మార్కు లుండాల్సిన పనిలేదని అధికారులు నిర్ణరుుంచారు. పదవీ విరమణ వయసు పొడిగింపు వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్య అధ్యాప కులకు ఇకపై పదవీ విరమణ వయసును 70 ఏళ్లకు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఎంబీబీఎస్ తర్వాత ‘నెక్ట్స్’ పరీక్ష ఎంబీబీఎస్ పూర్తి కాగానే ఇష్టారా జ్యంగా ఎక్కడంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకుం టామంటే ఇకపై కుదరదు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (‘నెక్స్ట్’) పరీక్షలో అర్హత సాధించిన వారే వైద్యం చేసేందుకు అర్హులు. ఇది రెం డు విధాలుగా ఉంటుంది. మొదటిది థీరిటి కల్ నాలెడ్‌జ (సబ్జెక్టులపై అవగాహన), రెం డోది స్కిల్ ఎవాల్యుయేషన్ (నైపుణ్యం). ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఏటా 53 వేల మంది ఎంబీ బీఎస్ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులం దరూ ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. -
పీజీ వైద్య సీట్లకూ నీట్
వచ్చే ఏడాది నుంచి అమలు: ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారానే రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీ జరగనుంది. సుప్రీంకోర్టు అన్ని వైద్య సీట్లకు నీట్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో పీజీ వైద్య సీట్లను కూడా నీట్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. పీజీ వైద్య సీట్లకు నీట్ తప్పనిసరి చేసినా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులను విద్యార్థులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు కాబట్టి నీట్‌కు భాష సమస్య తలెత్తదు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ సిలబస్ ఆధారంగానే ప్రవేశ పరీక్ష ఉంటుంది కాబట్టి విద్యార్థులకు సిలబస్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ ఉండదంటున్నారు. పైగా దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మేనేజ్మెంట్ కోటా సీట్లకు పోటీ పడొచ్చని చెబుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు పీజీ మెడికల్ కోసం, బీడీఎస్ పూర్తి చేసినవారు డెంటల్ పీజీకి వేర్వేరు నీట్ ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అక్రమాలకు చెక్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 1,619 పీజీ వైద్య సీట్లున్నాయి. 180 వరకు పీజీ డెంటల్ సీట్లున్నాయి. రాష్ట్రంలో 3 ప్రభుత్వ మెడికల్ పీజీ కాలేజీలుండగా... వాటిల్లో 827 సీట్లున్నాయి. 8 ప్రైవేటు కాలేజీలుండగా.. వాటిల్లో 572 పీజీ వైద్య సీట్లున్నాయి. మైనారిటీ కాలేజీల్లో 220 పీజీ వైద్య సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 827 సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 286 కన్వీనర్ కోటా సీట్లను ఇప్పటివరకు పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసేవారు. ప్రైవేటులోని మేనేజ్మెంట్ కోటాకు చెందిన 286 సీట్లను ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రైవేటు యాజమాన్యాలు తమ ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. మైనారిటీ కాలేజీల్లోని 220 పీజీ వైద్య సీట్లది ఇదే పరిస్థితి. ఇవిగాక డెంటల్ పీజీ సీట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 200 వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వీటన్నింటినీ నీట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల పరీక్షలు రాయనక్కర్లేదు.. నీట్ పరీక్ష అనంతరం రాష్ట్రానికి ర్యాంకులు కేటాయిస్తారు. ఆ ర్యాంకుల ఆధారంగానే ప్రభుత్వ సీట్లు, ప్రైవేటులోని కన్వీనర్, మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యార్థులు దేశంలో వివిధ ప్రైవేటు మేనేజ్మెంట్ సీట్లలో అడ్మిషన్లకు అనేక ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ఈ మొత్తం పరీక్షల ఫీజుల ఖర్చే రూ.లక్ష దాటుతోంది. ఇకపై అలా కాకుండా నీట్ రాసి.. అన్ని రాష్ట్రాల్లోని సీట్లకూ పోటీ పడొచ్చు. అంతేకాదు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ పీజీ వైద్య సీట్లను యాజమాన్యాలు రూ.2 కోట్ల వరకూ అమ్మేసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితికి కూడా చెక్ పడనుంది. ర్యాంకుల ఆధారంగా సీటు పొందడమే కాకుండా... ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. నవంబర్-డిసెంబర్ మధ్య పీజీ నీట్ ప్రతీ ఏడాది పీజీ వైద్య నీట్ పరీక్ష నవంబర్-డిసెంబర్ మధ్య ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియ అక్టోబర్ నుంచే మొదలవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఎంబీబీఎస్ హౌస్‌సర్జన్ పూర్తి చేయబోయే వారు ముందుగా జరిగే నీట్ రాయల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే పీజీ వైద్య పరీక్ష ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేవారు. అంటే దాదాపు రెండు నెలలు ముందుగానే నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుందన్నమాట! -
పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
♦ తెలంగాణలో మొదటిసారి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ ♦ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో వైద్య విద్యలో పీజీ సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్‌ను మొదటిసారిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పీజీ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్‌పై శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గల కోర్సుల్లో 15 శాతం అన్ రిజర్వుడు సీట్ల కోసం ఈ నెల 22 నుంచి 24 వరకు, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలోని 85 శాతం సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వరకు తెలంగాణ విద్యార్థులు వెబ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు రెండుసార్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, నమోదు చేసుకున్న 48 గంటల అనంతరం వారి మొబైల్‌కు పాస్వర్డ్ వస్తుందని తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎన్నైనా ఇవ్వొచ్చని, వీటికి పరిమితి లేదని చెప్పారు. మొదటి దశలో కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మే 31 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంద న్నారు. 1,113 పీజీ వైద్య సీట్లు పీజీ వైద్య సీట్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో 37 బ్రాంచీల్లో 1,113 సీట్లు ఉన్నాయని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో కన్వీనర్ కోటా కింద 827, మేనేజ్మెంట్ కోటా కింద 286 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన డాక్టర్లకు 30 శాతం చొప్పున పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఇన్‌సర్వీస్ వైద్యులు అన్ రిజర్వ్డ్ కోటా కింద 24న విజయవాడలో, లోకల్ సీట్ల కోసం 26న జేఎన్టీటీయూ, ఓయూకు రావాలని పేర్కొన్నారు. పీజీ వైద్య సీట్లలో ప్రభుత్వ పరిధిలో 529 సీట్లు ఉన్నాయన్నారు. ప్రైవేటు కళాశాలల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 50 శాతం మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్‌లో దాదాపు 4 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. కాళోజీ వర్సిటీ కోసం వరంగల్ సెంట్రల్ జైలుకు సంబంధించిన 35 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఇకముందు వైద్యానికి సంబంధించిన అన్ని కోర్సుల కౌన్సెలింగ్‌లను తామే చేపడతామని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.