నేడు యాజమాన్య పీజీ వైద్య సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య యాజమాన్య, ఎన్నారై, ఇన్‌స్టిట్యూషన్ కోటా సీట్లకు శనివారం నోటిఫికేషన్ జారీకానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ప్రకటన విడుదల చేయనుంది. ప్రైవేట్ మెడికల్ పీజీ సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టే ఎత్తివేతకు కాలేజీలు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. రెండో విడత కన్వీనర్ కోటా కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కొందరిని శుక్రవారం చేర్చుకున్నాయి.
బ్యాంకు గ్యారంటీపై గందరగోళం నెలకొనడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మొదలైందని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సమయం సరిపోకపోవడంతో శనివారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిం చారు. కన్వీనర్ కోటా సీట్లకు ఒకవైపు కౌన్సిలింగ్ నిర్వహిస్తూనే యాజమాన్య, ఎన్నారై కోటా సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా విద్యార్థులను నేరుగా పిలిపించి సీట్లు కేటాయిస్తారు. ఈ నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.