
మరో 4 వేల పీజీ వైద్య సీట్లు
న్యూఢిల్లీ: దాదాపు 4 వేల పీజీ వైద్య సీట్ల పెంపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిని పెంచి వాటిని ఆధునీకరించడానికి ఉద్దేశించిన పథకాన్ని కొనసాగించేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో గురువారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనివల్ల అదనంగా 4 వేల పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనికయ్యే మొత్తం రూ. 1,350 కోట్ల వ్యయంలో రూ. 1,124 కోట్లను కేంద్రం భరిస్తుంది. మిగిలిన రూ. 226 కోట్లను రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాలు భరించాల్సి ఉంటుంది. కేంద్రం వాటాలో రూ. 680 కోట్లను 72 వైద్య కళాశాలలకు కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది.
కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
- ఒడిశాలో అక్రమ మైనింగ్‌పై జస్టిస్ ఎంబీ షా కమిషన్ రూపొందించిన నివేదికను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెడ్తారు. తీసుకున్న చర్యల నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్)తో కలిపి నివేదికలో ఐదు సంపుటాలున్న మొదటి భాగాన్ని మాత్రమే ప్రస్తుతం బహిర్గతం చేయనున్నారు. రెండో భాగంతో పాటు జార్ఖండ్, గోవాల్లో జరిగిన అక్రమ మైనింగ్‌పై కమిషన్ రూపొందించిన నివేదికను ఈ సమావేశాల్లో వెల్లడి చేయకూడదని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
- సాంకేతిక విద్యను అందించే సంస్థలకు ఆనుమతినిచ్చే అధికారాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి మళ్లీ అప్పగించాలన్న ప్రతిపాదనపై కేబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆ అంశాన్ని మంత్రుల బృందానికి(జీఓఎం) అప్పగించారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ ఏఐసీటీఈ సవరణ బిల్లును రూపొందించారు. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు అనుమతినిచ్చే అర్హత కూడా ఏఐసీటీఈకి లేదని సుప్రీం ఆ తీర్పులో పేర్కొంది.
- ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ. 1240 కోట్ల గ్రాంట్‌ను ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 750 పరిశోధన ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాలిన గాయాల నిర్వహణ కేంద్రాలను ప్రారంభించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఉన్న పథకాన్ని పూర్తిస్థాయి జాతీయ పథకంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటిదశలో 67 మెడికల్ కాలేజీల్లో రూ. 407.21 కోట్లతో ఆ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 12వ ప్రణాళిక కాలంలో ట్రామా కేర్ పథకాన్ని కొనసాగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
- చెరకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.10 పెంచాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో 2014-15 మార్కెటింగ్ సంవత్సరం నుంచి మిల్లు యజమానులు చెరకు రైతులకు చెల్లించాల్సిన ధర క్వింటాలుకు రూ.220 కానుంది.