
పెరిగిన పీజీ వైద్య సీట్లు
♦ నిమ్స్‌లో 7, ఉస్మానియాలో 10 డెంటల్ పీజీ సీట్లు
♦ నిమ్స్ సీట్లలో కోటా కోరుతున్న ఏపీ... తెలంగాణ ససేమిరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పీజీ వైద్య సీట్లు పెరిగాయి. నిమ్స్‌లో రేడియాలజీ పీజీలో 5, డిప్లొమాలో 2 సీట్లు పెరిగాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలోనూ 10 డెంటల్ వైద్య సీట్లు పెంచుతూ భారత వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. నిమ్స్‌లో పెరిగిన వైద్య పీజీ సీట్లలో తమకు 64 శాతం వాటా కావాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దీనిపై ఏపీ తరపున ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ రవిరాజు, తెలంగాణ తరపున కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్ సోమవారం సమావేశమయ్యారు. ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం సీట్ల కేటాయింపన్నది విభజన చట్టం ప్రకారం 2014 జూన్‌కు ముందు న్న సీట్లకే వర్తిస్తుంది తప్ప ఆ తర్వాత కొత్తగా వచ్చే సీట్లకు కాదని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలోనే తాము స్పష్టంగా మెమో జారీ చేశామని పేర్కొంది. అయితే దీనిపై ఏపీ విద్యార్థులు ఆందోళన చేసే అవకాశముందని సమాచారం.
పాలమూరులో ఎంసీఐ బృందం
ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రానున్న మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మౌలిక వసతులు తదితరాలను పరిశీలించేందుకు ఎంసీఐ బృందం సోమవారం అక్కడ పర్యటించింది. కాలేజీ నిర్మాణానికి చేపడుతున్న చర్యలను, వసతులను తనిఖీ చేసింది. ఇదే తుది తనిఖీ అని ఎంసీఐ అధికారులు పేర్కొన్నారు. 150 ఎంబీబీఎస్ సీట్లుండే ఈ కాలేజీలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు మొదలవుతాయి.