సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లకు కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ సంక్లిష్టతతో కూడుకున్నదని, కేంద్ర పరిధిలో అమలయ్యే వాటికి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రిజర్వేషన్లకు భిన్నమైన పరిస్థితులున్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. మరోవైపు విభజన చట్టం ఇంకా అమల్లోనే ఉన్నందున 2024 వరకూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేమని కమిటీ తెలిపింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సమ్మతి తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో చేరితే తలెత్తే సమస్యలపై అధ్యయనం కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కూలంకషంగా చర్చించిన అనంతరం కమిటీ తన నివేదికను వెల్లడించింది. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ...
371–డి రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయి..
రాష్ట్రంలో 371–డి అనుసరించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్థానిక కోటాను 42ః36ః22 నిష్పత్తి ప్రకారం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరితే ఈ కోటాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బీసీ రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో ఓబీసీ కోటా లేదు. బీసీ కోటా మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ కేటగిరీకి 29 (బీసీ–ఏ, బీసీ–బి, బీసీ–సి, బీసీ–డి, బీసీ–ఇ కలిపి), ఈడబ్లు్యఎస్ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వీటితోపాటు స్పెషల్ కేటగిరీ కింద మహిళలకు 33.1, దివ్యాంగులకు 5, సైనికుల పిల్లలకు 1, ఎన్‌సీసీకి 1, క్రీడాకారులకు 0.5, అమరవీరుల కుటుంబాల చిన్నారులకు 0.25 శాతం రిజర్వేషన్లున్నాయి. వీటన్నిటికీ సంబంధించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం పలు జీవోలను విడుదల చేసింది. ఇవన్నీ కచ్చితంగా అమలు చేయాలంటే కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేం.
‘ఎంఆర్‌సీ’ అమల్లో ఉంది..
మెరిట్ ఆఫ్ ఏ రిజర్వ్‌డ్ కేటగిరీ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఒక రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీకి వెళితే ఆ సీటును అదే కేటగిరీతో వారితో భర్తీ చేయాలి. దీనికోసం 2001లో జీవో 550 ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లడంతో 2019 ఆగస్ట్ 13న జీవో నెం.111 ఇచ్చారు. తిరిగి 2020 నవంబర్ 13న కొద్దిపాటి మార్పులతో జీవో 159 ఇచ్చారు. ఇవన్నీ ప్రక్రియను బట్టి మారుతూ వచ్చాయి. చివరగా మళ్లీ 2020 డిసెంబర్ 4న జీవో 151 ఇచ్చారు. బీడీఎస్, ఎంబీబీఎస్‌కు విడివిడిగా ఒకేసారి ఆప్షన్‌లు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించాలని దీని సారాంశం. కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరితే దీనికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నాం.
చిన్న సమస్యలకూ ఢిల్లీ వెళ్లాలి..
నీట్ జాతీయ ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం 85 శాతం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. మిగతా 15 శాతం జాతీయ కోటాలో ఇచ్చిన సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. పూర్తి సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఏవైనా సమస్యలొచ్చినప్పుడు విద్యార్థులు పదేపదే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరే పరిస్థితి లేదని కమిటీ భావిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కేంద్రానికి స్పష్టత ఇస్తుంది.
నిపుణుల కమిటీ ఇదే..
చైర్మన్: డా.శ్యాంప్రసాద్, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.మెంబర్ కన్వీనర్: డా.కె.శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.
సభ్యులు: డా.ఐవీ రావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, డా.ఎం రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు, ఎస్.నాగవేణి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఏపీ ఉన్నతవిద్యా మండలి.
పీజీ అడ్మిషన్లకూ ప్రత్యేక విధివిధానాలు
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో ఒక రకమైన విధానాలుండగా పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో రకమైన ఇబ్బందులున్నాయి. బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు (పీజీ వైద్య సీట్లు) 2013 మార్చి 13న ఇచ్చిన జీవో 43 ప్రకారం నిర్వహిస్తున్నాం. ప్రాంతాలవారీగా నిర్వహిస్తున్నాం. స్పెషాలిటీ పరంగా, కేటగిరీపరంగా చేస్తున్నాం. 2020 మే 29న ఇచ్చిన జీవో 57 ప్రకారం పీజీ కౌన్సెలింగ్‌లో సవరణలు వచ్చాయి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ సీటుకు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లేందుకు స్లైడింగ్ విధానం ఉంది. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేస్తున్నాం. కేంద్ర కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరితే వీటి అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment