సాక్షి, హైదరాబాద్: ఇకపై ఎంబీబీఎస్ పట్టా పొందాలన్నా, పీజీ మెడికల్ సీట్లలో ప్రవేశించాలన్నా, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు గుర్తింపు ఇవ్వాలన్నా అందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎగ్జిట్) పాస్ కావాలి. ఆ తర్వాతే వైద్యవిద్య పట్టా ఇవ్వనున్నారు. నెక్ట్స్ పాసైతేనే మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాదు నియామకాలకు కూడా ఈ పరీక్షలో వచ్చే మార్కులే ఆధా రం కానున్నాయి.
ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా విడుదల చేసింది. దాన్ని ప్రజాభిప్రాయం నిమిత్తం అందుబాటులో ఉంచింది. తదుపరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి దీన్ని అమలులోకి తీసుకొస్తారు. అంటే 2019–20లో ఎంబీబీఎస్‌లో చేరిన బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అమలవుతుందని చెబుతున్నారు. దీనిపై ఎన్‌ఎంసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
రెండింట్లో పాసైతేనే...
నెక్ట్స్ పరీక్ష రెండుషెడ్యూళ్లలో నిర్వహిస్తారు. స్టెప్–1, స్టెప్–2 పద్ధతిలో జరుగుతుంది. స్టెప్–1 పరీక్ష నాలుగున్నరేళ్లకు తర్వాత... ఇంటర్న్‌షిప్‌కు ముందు ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షతో సమానం. అంటే ఎంబీబీఎస్‌లో ఫైనయర్ బదులుగా నెక్ట్స్ స్టెప్–1 థియరీ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ రెండో వారంలో దీన్ని నిర్వహిస్తారు. దీని ఫలితాలు జన వరి రెండో వారంలో విడుదల చేస్తారు.
ఆ తర్వాత యథావిధిగా కాలేజీలు నిర్వ హించే ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఇంటర్న్‌షిప్ అయ్యాక స్టెప్–2 ప్రాక్టికల్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక అంటే స్టెప్–1 పరీక్ష తర్వాత ఏడాదికి స్టెప్–2 పరీక్షను నిర్వహిస్తారు. అది పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష. స్టెప్–2 పరీక్ష ఏటా మార్చిలో నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేస్తారు. ఈ రెండింటిలో పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా, పీజీ మెడికల్ అర్హత, విదేశీ వైద్య కు గుర్తింపు ఉంటుంది.
స్టెప్–2 కేవలం పాసైతే సరిపోతుంది. ఒకవేళ ఇందులో 3 అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైతేనే సప్లిమెంటరీ ఉంటుంది. లేకుంటే అన్ని పరీక్షలు రాయాలి. మూడు కంటే ఎక్కువ ఫెయిలైతే ఏడాది కోల్పోయినట్లే లెక్క. పదేళ్లలోగా ఎన్నిసార్లు అయినా నెక్ట్స్ రాసుకోవచ్చు. అలాగే ఒకసారి పాసైనా కూడా మార్కులను పెంచుకొనేందుకు కూడా పరీక్ష రాసుకోవచ్చు. అంటే పీజీలో సీటు పొందేందుకు ఎక్కువ మార్కులు రావాలనుకుంటే మరోసారి రాసుకోవచ్చు. నెక్ట్స్ అమలైతే సంబంధిత సమానమైన ప్రస్తుత పరీక్షలు దశలవారీగా రద్దవుతాయి. ఉదాహరణకు ‘నీట్’పీజీ పరీక్ష రద్దు అవుతుంది.
ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సింది...
అమెరికా లాంటి దేశాల్లో గత 20 ఏళ్ల నుంచి ఈ తరహా పరీక్షా విధానం అమలవుతోంది. వైద్యవిద్యలో దేశవ్యాప్తంగా ఏకీకృతంగా ఇప్పటికే అమలు చేస్తున్న ‘నీట్’విధానానికి నెక్ట్స్ కొనసాగింపు మాత్రమే. తుది ర్యాంకులో స్టెప్–1కు మాత్రమే కాకుండాప్రాక్టికల్స్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది.
– డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment