
జాతీయ వైద్య సీట్లపై సర్కారు కన్ను
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ మెడికల్ కాలేజీల్లో వైద్య సీట్లు సాధించాలంటే నేషనల్ మెడికల్ సీట్ల పూల్‌లో చేరాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. నేషనల్ పూల్‌లో చేరడం వల్ల అధిక సీట్లు పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తుంది. ఈ అంశాన్ని వైద్య విద్యార్థులు కూడా స్వాగతిస్తున్నారు. మరోవైపు పూల్‌లో చేరాక మన విద్యార్థులు అనుకున్న స్థాయిలో పోటీ పరీక్షల్లో సత్తా చాటకపోతే ఎలా అని కొందరు వెద్య నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు మెరుగ్గా రాణిస్తేనే ప్రయోజనం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి విన్నవించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
15 శాతం ఎంబీబీఎస్..
50 శాతం పీజీ వైద్య సీట్లు
ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు ఆధ్వర్యంలో 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం 2,650 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 1,800 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. పీజీ మెడికల్ సీట్లు 1,140 ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీట్లలో 371డీ నిబంధన ప్రకారం స్థానికులకు 85 శాతం, స్థానికేతరులకు 15 శాతం సీట్లు కేటాయిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధన ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇదే నిబంధన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం ఆ ప్రవేశ పరీక్ష పరిధిలోని మెడికల్ సీట్ల పూల్‌లో చేరాలంటే రాష్ట్రాలు తమ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం సీట్లను జాతీయ మెడికల్ సీట్ల పూల్ తీసుకొంటుంది. అలా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సీట్లకు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను కేటాయిస్తుంది.
ప్రస్తుతం పూల్ పరిధిలో ఎంబీబీఎస్‌లో 43,640 సీట్లు, పీజీ మెడికల్ సీట్లు 17,334 ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం మెడికల్ పూల్‌లో చేరితే మన ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం కేంద్రానికి ఇవ్వాలి. రాష్ట్రంలో వందల సంఖ్యలో సీట్లు కోల్పోయినా జాతీయ స్థాయిలో వేల సంఖ్యలో మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని.. జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలల్లో సీట్లు పొందొచ్చని.. అందుకే తెలంగాణ ప్రభుత్వం జాతీయ మెడికల్ సీట్ల పూల్‌లో చేరాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
371(డి) నిబంధన అడ్డంకి...
ఇదిలావుంటే నేషనల్ పూల్‌లో చేరాలంటే 371 (డి) నిబంధన అడ్డంకిగా ఉందని పలువురు అంటున్నారు. జాతీయ వైద్య సీట్ల పరిధిలోకి చేరాలంటే ఈ నిబంధనను సవరించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం పార్లమెంటులో సవరణ బిల్లు తీసుకురావాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారికంగా విన్నవిస్తే కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఈ ఏడాది ఇప్పటికిప్పుడు నేషనల్ పూల్‌లో చేరడం సాధ్యం కాదు. కానీ ఇప్పటినుంచి ప్రయత్నిస్తే వచ్చే ఏడాదికల్లా నేషనల్ పూల్‌లో చేరడానికి ఆస్కారం ఉంది.