ఏరు దాటాక తెప్ప తగలేసిన బాబు ప్రభుత్వం
గద్దెనెక్కాక హామీలకు తిలోదకాలు ఇస్తున్న దుస్థితి
ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తేస్తామని హామీ
తీరా అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించిన కూటమి ప్రభుత్వం
సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కొనసాగిస్తామని హైకోర్టుకు స్పష్టీకరణ
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ సీట్లను అందేలా చూస్తాను. – 2023 ఆగస్టు 16న మంగళగిరిలో నారా లోకేశ్
ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ 4వ తేదీన కృష్ణా జిల్లాపెడనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుంది. హామీలకు తిలోదకాలిచ్చే పరంపరలో భాగంగా తాజాగా యువతకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఇ చ్చిన హామీకి తూట్లు పొడిచింది.
నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దురదృష్టకరం అని గతంలో చిలక పలుకులు పలికారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రగల్భాలు పలికారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయబోమంటూ శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేయడం ద్వారా యువతను దగా చేసింది. దీంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూసుకోవాలనే కోరిక ఉండే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు వీరి మాయమాటలు నమ్మి మోసపోయారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా గత విద్యా సంవత్సరం నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ క్రమంలో ఆయా కళాశాలల్లో 50 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ కోటాగా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ, జనసేన పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను రద్దు చేయాలంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు అప్పట్లో నిరసనలు వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ జీవోలను రద్దు చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు.
ఇ చ్చిన హామీ నెరవేర్చాలి
సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్ల విధానాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నారా లోకేశ్ సహా పలువురు ముఖ్య నాయకులు ఈ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నీట్ మార్కుల ఆధారంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను కేటాయించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు,రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment