
సాక్షి, అమరావతి: నేషనల్ పూల్‌లో ఉన్న పీజీ వైద్య సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల అధికారులకూ తెలియజేసింది. పీజీ వైద్యసీట్ల భర్తీకి జాతీయస్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్ష (నీట్) ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. జమ్మూ– కశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు ఈఏడాది జాతీయ పూల్‌లోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ 50 శాతం సీట్లను నేషనల్ పూల్‌కు ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలు ఇచ్చే 50 శాతం పీజీ వైద్య సీట్లకూ మన అభ్యర్థులు పోటీ పడవచ్చు.
మిగతా 50 శాతం సీట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో కూడా కొన్ని నిబంధనలు విధించారు. మొదటిసారి కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థి సీటు ఎంపిక చేసుకోకపోయినా రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. రెండో సారి కూడా సీటు ఎంపిక చేసుకోకపోతే ఆ అభ్యర్థిని తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌కు అనుమతించరు. సీటు ఎంచుకున్న అభ్యర్థి ఐదు రోజుల్లోగా కళాశాలలో చేరకపోతే సీటు రద్దు చేస్తారు.