ఒక్క సీటు రెండు కోట్లు! | Private Medical PG Seat RS. 2 Crore | Sakshi
Sakshi News home page

ఒక్క సీటు రెండు కోట్లు!

Published Thu, Jan 16 2014 2:55 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఒక్క సీటు రెండు కోట్లు! - Sakshi

ఒక్క సీటు రెండు కోట్లు!

 * ఇది యాజమాన్య కోటా వైద్యవిద్య పీజీ సీట్ల ధర
* 646 పోస్టులకు 22 వేల మంది అభ్యర్థుల పోటీ
* ప్రవేశ పరీక్షకు రెండు నెలల ముందే బేరసారాలు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ఉన్న 646 పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) సీట్లు ప్రవేశపరీక్ష నిర్వహించటానికి రెండు నెలల ముందే ‘అమ్ముడు’పోతున్నాయి. ఒక్కో పీజీ సీటు రూ. 2 కోట్లు పలుకుతోందంటే డిమాండు ఎలా ఉందో తెలుస్తోంది. వైద్యవిద్యలో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీటు ధర రూ. కోటి దాటిపోయింది. మార్కెట్లో పీజీ వైద్యులకే తగినంత గుర్తింపు ఉండడంతో.. వైద్యవిద్య పీజీ సీట్ల కోసం ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. కానీ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి.

ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైద్యవిద్య పీజీ ప్రవేశపరీక్ష మార్చిలో జరగనుంది. కానీ రెండు నెలల ముందే ప్రైవేటు కాలేజీల్లో పీజీ వైద్య సీట్లకు బేరాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 8 ప్రభుత్వ, 15 ప్రైవేటు రంగ వైద్య కళాశాలల్లో మొత్తం 2,431 పీజీ సీట్లు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది సుమారు 22 వేల మంది పోటీపడే అవకాశముందని అంచనా.

ఇందులో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద 646 పీజీ సీట్లున్నాయి. ఆ సీట్ల కోసం డబ్బున్న అభ్యర్థులు కళాశాలల యాజమాన్యాలతో బేరం మాట్లాడుకుని టోకెన్ అడ్వాన్సులు ఇస్తున్నారు.

వైద్యవిద్య పీజీ కోర్సుల్లో రేడియాలజీ విభాగం సీటును రూ. 1.80 నుంచి రూ. 2 కోట్లకు అమ్ముతున్నట్టు తెలిసింది. ఆర్థోపెడిక్ విభాగానికి కూడా తీవ్ర డిమాండ్ ఉంది. గతేడాది రూ. 1.30 కోట్లు పలికిన సీటు ఈ ఏడాది రూ. 1.50 కోట్లకు చేరింది.

మిగతా సీట్లకు డిమాండ్‌ను బట్టి ధర: ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎండీ జనరల్ మెడిసిన్, ఎండీ పీడియాట్రిక్, ఎండీ అనస్థీషియా సీట్లకు డిమాండ్ ఆధారంగా యాజమాన్యాలు ధరలను నిర్ణయిస్తున్నాయి.

* గతేడాది ఎంఎస్ ఆర్థోపెడిక్ యాజమాన్య సీటుకూ ఈ ఏడాదికీ 20% పెంచారని ఒక అ భ్యర్థి తెలిపారు. మరొక అభ్యర్థి అయితే ఇక్కడి రేటు ఎక్కవనుకుని.. కేరళలో అనస్థీషియా సీటు రూ. 90 లక్షలకే కొనుక్కున్నట్లు చెప్పారు.
 
సర్కారు నియంత్రణ లేదు...
ఎంబీబీఎస్ యాజమాన్య కోటా విషయంలో ఇటీవల హైకోర్టు ఆదేశాలిస్తూ.. ప్రతిభ ఆధారంగా ఆన్‌లైన్‌లో భర్తీ చేపట్టాలని నిర్దేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకూ ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. ఇక పీజీ వైద్యవిద్య యాజమాన్య కోటా సీట్ల విక్రయాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా పోతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
 
ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తేనే న్యాయం
ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. యాజమాన్య కోటా సీట్లకు వేరేగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామనే ప్రతిపాదన ఉంది. కానీ.. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ప్రైవేటు కళాశాలలు సొంతంగా ప్రవేశ పరీక్షలు పెట్టి సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డాయి. తమకు కావాల్సిన అభ్యర్థులకు మార్కులు వేసుకుని డబ్బులు దండుకున్నాయి.
- డా.వెంకటేష్, వైద్య విద్య సంచాలకులు (అకడమిక్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement