సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ వైద్య సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఏప్రిల్ 20 లోగా తొలి దశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 (సోమవారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి నాలుగైదు రోజులపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇది పూర్తయిన వెంటనే ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 10న వెబ్ ఆప్షన్లు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేస్తారు.
మన రాష్ట్రంలో జాతీయ పూల్‌కు సీట్లు మినహాయిస్తే 428 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ ఏడాది అర్హత సాధించినవారు తక్కువగా ఉండటం, జాతీయ పూల్‌లో ఎక్కువ మందికి సీట్లు రాకపోవడం, వాళ్లంతా స్టేట్ సీట్లకు రావడంతో పోటీ మరింతగా పెరిగింది. ఒక్కో సీటుకు 15 మందికిపైనే పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్థోపెడిక్స్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ మెడిసిన్, ఎండీ గైనకాలజీ, ఎండీ రేడియాలజీ తదితర కోర్సులపై అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది నేషనల్ పూల్ నిలువునా ముంచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అర్హత మార్కులు సాధించినవారు చాలా తక్కువగా ఉన్నారని, కటాఫ్ మార్కుల శాతం తగ్గిస్తే మరికొంతమందికి సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది.
మే 31 నాటికి చివరి దశ కౌన్సెలింగ్ పూర్తి: రిజిస్ట్రార్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న అన్ని సీట్లకూ మే 31లోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అప్పలనాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం మే 31 నాటికి అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నుంచి సీట్ల కేటాయింపు వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 50 శాతం పీజీ వైద్య సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, మిగతా 50 శాతం జాతీయ పూల్ సీట్లకు సీబీఎస్‌ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని చెప్పారు.
పీజీ వైద్య సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ కసరత్తు
Published Mon, Mar 26 2018 2:56 AM | Last Updated on Mon, Mar 26 2018 2:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment