సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కాలేజీలు విద్యార్థులను దోచుకుంటున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో చదివే వారికి ప్రభుత్వ పరంగా చెల్లించే స్టైపెండ్‌ను స్వాహా చేస్తున్నాయి. విద్యార్థులకు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్నాయి. దాదాపు అన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలువురు హౌజ్ సర్జన్లు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ)కు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలు పక్కనపెట్టి..
ఎంబీబీఎస్ కోర్సు ఐదున్నర ఏళ్లు ఉంటుంది. తొలి ఏడాది మొత్తం తరగతిలోనే బోధన ఉంటుంది. రెండో ఏడాది నుంచి నాలుగున్నర ఏళ్ల వరకు తరగతి బోధనతోపాటు వైద్య చికిత్స అంశాలను ప్రాక్టికల్‌గా(ప్రత్యక్షంగా) బోధిస్తారు. అనంతరం ఏడాది పాటు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో నేరుగా అన్నిరకాల చికిత్సలు చేస్తారు. ఈ ఏడాది సమయంలో వీరిని హౌస్ సర్జన్లుగా పిలుస్తారు. వైద్య కాలేజీకి అనుబంధంగా ఉండే ఆస్పత్రిలోని వైద్య విభాగాల్లో కొన్నిరోజుల చొప్పున సేవలు అందిస్తారు. మెడిసిన్, సర్జరీ, గైనిక్ విభాగాల్లో తప్పనిసరిగా పనిచేస్తారు. ఇలా చదువులో భాగంగా వైద్య సేవలు అందిస్తున్న హౌస్‌సర్జన్లకు ప్రతి నెలా రూ.12,800 చొప్పున స్టైపెండ్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. హౌస్‌సర్జన్లకు చెల్లింపులను అంగీకరిస్తున్నట్లుగా అడ్మిషన్ల సమయంలోనే కాలేజీ యాజమాన్యాలు.. వైద్య విద్య డైరెక్టరేట్‌కు, వైద్య విశ్వవిద్యాలయానికి లేఖ ఇస్తాయి. కానీ ఈ నిబంధనలు ఆచరణలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో 15 ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2,100 మంది హౌజ్ సర్జన్లు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికీ స్టైపెండ్ అందడం లేదని తెలుస్తోంది. అసలే బోధనా ఫీజులకు తోడు ప్రత్యేక ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్య కాలేజీలు.. చివరికి ౖస్టైపెండ్ సొమ్మును కూడా సొంతానికి వాడుకుంటున్నాయి.
ప్రభుత్వ కాలేజీల్లోనూ...
హౌస్‌సర్జన్లకు స్టైపెండ్ చెల్లింపు విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్ (ఆదిలాబాద్), నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ ప్రభుత్వ కాలేజీలో మినహా.. మిగతా ఐదు కాలేజీల్లో 900 మంది హౌస్‌సర్జన్లు ఉన్నారు. డీఎంఈ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 ఆస్పత్రుల్లో వారు సేవలు అందిస్తున్నారు. అయితే వారికి ఏడు నెలలుగా స్టైపెండ్ అందడం లేదు. ప్రభుత్వ బోధనాస్పత్రుల వైద్య సేవల్లో కీలకంగా వ్యవహరిస్తున్న హౌస్‌సర్జన్లకు చెల్లించే స్టైపెండ్ చెల్లింపులో నిర్లక్ష్యం వైఖరితో.. పేదలకు అందే ఆరోగ్య సేవలపైనా ప్రభావం చూపుతుందనే విమర్శలున్నాయి.
హౌస్ సర్జన్ల స్టైపెండ్ స్వాహా!
Published Tue, Nov 28 2017 3:00 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment