సాక్షి, హైదరాబాద్: కర్ణాటక మణిపాల్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా ఉన్న కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ. 11.24 లక్షలు.. అదే రాష్ట్రంలోని కొలార్‌లో శ్రీదేవరాజ్ యూఆర్‌ఎస్ డీమ్డ్ మెడికల్ కాలేజీలో రూ. 9 లక్షలు.. కానీ మన రాష్ట్రంలో ఏ ప్రైవేటు కాలేజీలోనైనా ఎన్నారై కోటా సీటు ఫీజు మాత్రం రూ. 23.1 లక్షలు ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్ మెడికల్ కాలేజీల ఎంబీబీఎస్ ఫీజుకు, రాష్ట్రంలో సీ (ఎన్నారై) కేటగిరీ ఫీజుకు ఇంతలా తేడా ఉండటంతో రాష్ట్ర విద్యార్థులు అటువైపు పరుగులు తీస్తున్నారు. మెడికల్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నేషనల్ పూల్‌లో చేరడంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో 319 సీ కేటగిరీ సీట్లకుగాను తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 120 సీట్లు మిగిలాయి. 102 బీడీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
నేషనల్ పూల్ దెబ్బ
రాష్ట్రం నేషనల్ పూల్‌లో చేరడంతో అఖిల భారత కోటా కింద దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లకు, డీమ్డ్ వర్సిటీలకు నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్‌కు కలిపి దేశవ్యాప్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడటానికి రాష్ట్ర విద్యార్థులకు వీలు కలిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 120 ఎన్నారై సీట్లు మిగలడం, డీమ్డ్ వర్సిటీల సీట్లకు మరో రెండు కౌన్సెలింగ్‌లు ఉండటంతో రాష్ట్రంలో సీట్ల భర్తీపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఇప్పటికే పలు మైనారిటీ మెడికల్ కాలేజీలు ఫీజు తగ్గించాయి. మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్నారై ఎంబీబీఎస్ సీటు ఫీజు రూ. 28 లక్షలుంటే షాదాన్ మెడికల్ కాలేజీ యాజమాన్యం రూ. 22 లక్షలకు తగ్గించింది. వీఆర్‌కే మైనారిటీ కాలేజీ యాజమాన్యం రూ. 20 లక్షలకు, అయాన్ మెడికల్ కాలేజీ రూ. 18 లక్షలకు తగ్గించాయి. నాన్ మైనారిటీ ప్రైవేటు కాలేజీలూ ఇదే బాటలో నడిచే పరిస్థితి కనిపిస్తోంది.
టాప్ ర్యాంకుల్లో డీమ్డ్ కాలేజీలు
రాష్ట్ర ప్రభుత్వం 2018–19 వైద్య విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరింది. దీంతో విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. నీట్ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేస్తుండటంతో అఖిల భారత కోటా సీట్లకు, డీమ్డ్ వర్సిటీల్లోని వైద్య సీట్లకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏ కాలేజీకి ఆ కాలేజీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ‘నీట్’పుణ్యమా అని అన్నింటికీ ఒకే దరఖాస్తు, ఒకే కౌన్సెలింగ్ వచ్చింది. పైగా డీమ్డ్ వర్సిటీ హోదా ఉన్న మెడికల్ కాలేజీలు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలతో సమానమైనవని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. ర్యాంకింగ్‌లోనూ ఈ కాలేజీలు ముందు స్థానంలో ఉన్నాయని, డీమ్డ్ వర్సిటీ కాలేజీల నాణ్యతలో మన ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏమాత్రం సరిపడవని అంటున్నారు.
అన్ని సీట్లకూ ఒకే ఫీజు
డీమ్డ్ మెడికల్ కాలేజీలు కర్ణాటక, తమిళనా డు, మహారాష్ట్రల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికెళ్లడానికి రాష్ట్ర విద్యార్థులకు ఏ ఇబ్బందీ ఉండదు. ఆ కాలేజీల్లో అన్ని సీట్లకు ఒకే ఫీజు. అంటే మన ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ ఫీజు కు అటుఇటుగా అక్కడ ఫీజులు ఉంటాయి. కొన్ని కాలేజీల్లో ఇక్కడి బీ కేటగిరీ ఫీజు కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడి బీ కేటగిరీ సీట్లపైనా విద్యార్థులు ఆసక్తి కనబరిచే పరిస్థితి ఉండదని వాదనలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment