పీజీ మెడికల్‌లో పెరిగిన సీట్లు
తెలంగాణలో 36, ఏపీలో 20
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఈ ఏడాది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొత్తగా 56 పీజీ మెడికల్ సీట్లు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లోని మొత్తం 39 కళాశాలల్లో తెలంగాణలో 1196, ఏపీలో 1393 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలంగాణలో 36 సీట్లు, ఏపీలో 20 సీట్లు అదనంగా పెరిగాయి. ఏయూ పరిధిలో కొత్తగా విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో 3 అనస్తీషియా, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో 6 అనస్తీషియా, ఎస్‌వీ పరిధిలోని నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో 2 ఆప్తమాలజీ, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో 6 జనరల్ సర్జరీ, 3 పిడియాట్రిక్స్ సీట్లు పెరిగాయి.
ఓయూ పరిధిలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2 ఫోరెన్సిక్, 2 సైక్రియాటీ, 7 మైక్రోబయాలజీ, సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో 1 సైక్రియాటీ, 4 పాథాలజీ, 3 అనస్తీషియా, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 1 పిడియాట్రిక్స్, 2 జనరల్ మెడిసిన్, క రీంనగర్ సీఏఆర్ కళాశాలలో 6 జనరల్ సర్జరీ, 1 పిడియాట్రిక్స్, 3 జనరల్ మెడిసిన్, రంగారెడ్డి జిల్లా భాస్కర్ మెడికల్ కళాశాలలో 3 జనరల్ మెడిసిన్, 1 ఈఎన్‌టీ సీట్లు పెరిగాయి.
21 నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్: ఈనెల 21 నుంచి పీజీ మెడికల్ (వెబ్) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది నుంచి కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ కింద పీజీ మెడికల్ సీట్లు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి లేఖ అందినట్లు సమాచారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి పూర్తి సాంకేతిక సహకారంతో సీట్లు భర్తీ చేసుకుంటామని ఆ లేఖలో కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విడివిడిగా కౌన్సెలింగ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.