పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
♦ తెలంగాణలో మొదటిసారి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ
♦ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో వైద్య విద్యలో పీజీ సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్‌ను మొదటిసారిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పీజీ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్‌పై శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గల కోర్సుల్లో 15 శాతం అన్ రిజర్వుడు సీట్ల కోసం ఈ నెల 22 నుంచి 24 వరకు, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలోని 85 శాతం సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వరకు తెలంగాణ విద్యార్థులు వెబ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు రెండుసార్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, నమోదు చేసుకున్న 48 గంటల అనంతరం వారి మొబైల్‌కు పాస్‌వర్డ్ వస్తుందని తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎన్నైనా ఇవ్వొచ్చని, వీటికి పరిమితి లేదని చెప్పారు. మొదటి దశలో కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మే 31 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంద న్నారు.
1,113 పీజీ వైద్య సీట్లు
పీజీ వైద్య సీట్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో 37 బ్రాంచీల్లో 1,113 సీట్లు ఉన్నాయని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో కన్వీనర్ కోటా కింద 827, మేనేజ్‌మెంట్ కోటా కింద 286 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన డాక్టర్లకు 30 శాతం చొప్పున పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ ఉంటుందన్నారు.
ఇన్‌సర్వీస్ వైద్యులు అన్ రిజర్వ్‌డ్ కోటా కింద 24న విజయవాడలో, లోకల్ సీట్ల కోసం 26న జేఎన్టీటీయూ, ఓయూకు రావాలని పేర్కొన్నారు. పీజీ వైద్య సీట్లలో ప్రభుత్వ పరిధిలో 529 సీట్లు ఉన్నాయన్నారు. ప్రైవేటు కళాశాలల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 50 శాతం మేనేజ్‌మెంట్ కోటా కింద కేటాయిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్‌లో దాదాపు 4 వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. కాళోజీ వర్సిటీ కోసం వరంగల్ సెంట్రల్ జైలుకు సంబంధించిన 35 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఇకముందు వైద్యానికి సంబంధించిన అన్ని కోర్సుల కౌన్సెలింగ్‌లను తామే చేపడతామని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.