పీజీ వైద్య ఫీజుల మోత | fees hikes for medico | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య ఫీజుల మోత

Published Wed, May 10 2017 1:59 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

పీజీ వైద్య ఫీజుల మోత - Sakshi

పీజీ వైద్య ఫీజుల మోత

కన్వీనర్‌ కోటా ఫీజు రూ. 3.20 లక్షల నుంచి రూ.6.90 లక్షలకు పెంపు
యాజమాన్య కోటా రూ.5.80 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు..
► కొత్తగా ఎన్‌ఆర్‌ఐ, ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా.. వాటికి మేనేజ్‌మెంట్‌ సీట్ల ఫీజుకు మూడింతలు వసూలు చేసుకునే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్‌: అనుకున్నట్టే పీజీ వైద్య సీట్ల ఫీజులను రాష్ట్ర సర్కారు భారీగా పెంచింది. అటు యాజమాన్య కోటాతోపాటు ఇటు కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులనూ పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ‘నీట్‌’లో అర్హత సాధించిన వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఫీజుల పెంపుతో.. సర్కారుకు, ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సంఘానికి మధ్య జరిగిన చర్చల్లో ప్రైవేటు వైద్య కళాశాలలే విజయం సాధించినట్టయింది.
 
కొత్తగా ఎన్‌ఆర్‌ఐ, ఇన్‌స్టిట్యూషనల్‌..
ప్రస్తుతం రాష్ట్రంలో క్లినికల్‌ కన్వీనర్‌ కోటా సీటుకు రూ.3.20 లక్షల ఫీజు ఉండగా.. దాన్ని ఏకంగా రూ.6.90 లక్షలు చేశారు. ఇక యాజమాన్య కోటా సీట్లకు ప్రస్తుతం ఉన్న రూ.5.80 లక్షల ఫీజును రూ.24.20 లక్షలకు పెంచారు. కొత్తగా ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా 10 శాతం, ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) కోటా 15 శాతంతో ఏర్పాటు చేశారు. ఈ కేటగిరి సీట్లకు యాజమాన్య కోటా సీటుకు వసూలు చేసే సొమ్ములో మూడు రెట్లు మించకుండా వసూలు చేసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ.72.60 లక్షల వరకు, మూడేళ్లకు కలిపి రూ.2.17 కోట్లు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు చెల్లించే డొనేషన్‌ రూ.కోటిన్నర వరకు ఉంటే.. ఇప్పుడు అధికారికంగానే రూ. 2.17 కోట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది.
 
ఈ ఏడాదినుంచి 4 కేటగిరీలు
ఈ ఏడాది నుంచి పీజీ వైద్య సీట్లను 4 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరి (కన్వీనర్‌ కోటా) కింద 50 శాతం సీట్లుంటాయి. అంటే ఉదాహరణకు ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో 100 సీట్లుంటే 50 సీట్లు ప్రభుత్వానికి మిగతా 50 సీట్లు ప్రైవేటుకు ఉంటాయి. ప్రైవేటుకు ఉన్న 50 శాతం సీట్లలో 10 శాతం ఇన్‌స్టిట్యూషన్‌ కోటాగా, మరో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాగా నిర్ధారించారు. వీటన్నింటినీ నీట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదినుంచి ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు, కన్వీనర్‌ కోటా కింద లేదా యాజమాన్య కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు విధిగా స్టైఫండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
 
ప్రైవేటు కాలేజీల్లో 728 పీజీ వైద్య సీట్లు
రాష్ట్రంలో నిమ్స్‌ సహా మొత్తం 15 మెడికల్‌ కాలేజీల్లో 1,477 పీజీ, డిప్లొమా వైద్య సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 677 పీజీ సీట్లుండగా, నిమ్స్‌లో 72 సీట్లున్నాయి. ఇవిగాక ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 728 పీజీ సీట్లున్నాయి. ప్రస్తుతం వీటిల్లో సగం అంటే 364 సీట్లు కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. మిగిలిన 364 సీట్లు యాజమాన్య కోటా కిందకు వస్తాయి.

ఫీజుల వివరాలు ఇవీ..
ఎండీ/ఎంఎస్‌/డిప్లొమా..కేటగిరీ పెరగబోయే ఫీజు
కన్వీనర్‌ కోటా కింద (ఏడాదికి)
ప్రి క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ.3.60 లక్షలు
పారా క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ.6.60 లక్షలు
క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ.6.90 లక్షలు

మేనేజ్‌మెంట్‌ కోటా కింద

ప్రి క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ.3.60 లక్షలు
పారా క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ.6.90 లక్షలు
క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ.24.20 లక్షలు

ఎన్‌ఆర్‌ఐ, ఇన్‌స్టిట్యూషన్‌ కేటగిరీ కింద..
ప్రి క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ. 10.80 లక్షలు
పారా క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ. 20.70 లక్షలు
క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా రూ. 72.60 లక్షలు

ఎండీఎస్‌ (డెంటల్‌) కోర్సుల ఫీజుల వివరాలు
కన్వీనర్‌ కోటా కింద..
పారా  క్లినికల్‌ డిగ్రీ రూ.5.25 లక్షలు
క్లినికల్‌ డిగ్రీ రూ.5.50 లక్షలు

యాజమాన్య కోటా కింద..
పారా క్లినికల్‌ డిగ్రీ రూ.7 లక్షలు
క్లినికల్‌ డిగ్రీ రూ.10 లక్షలు

ఎన్‌ఆర్‌ఐ, ఇన్‌స్టిట్యూషన్‌ కోటా కింద..
పారా క్లినికల్‌ డిగ్రీ రూ.8 లక్షలు
క్లినికల్‌ డిగ్రీ రూ.15 లక్షలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement