సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై టోల్ గేట్ ఫీజుల చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త విధివిధానాలను రూపొందించింది. ప్రధానంగా ప్రైవేటు కార్ల యజమానులకు టోల్ ఫీజుల పాస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేటు కార్ల యజమానులకు సౌలభ్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అన్ లిమిటెడ్ యూసేజ్ (అపరివిుత వినియోగం) ప్రాతిపదికన టోల్ ఫీజు పాస్‌లను రెండు కేటగిరీలుగా జారీ చేసే ముసాయిదాను ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా ఆమోదించింది.
ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం ద్వారానే పాస్‌ల విధానాన్ని అమల్లోకి తెస్తారు. వార్షిక టోల్ ఫీజు పాస్, లైఫ్‌టైమ్ పాస్ (15ఏళ్లు)లను అందుబాటులోకి తేనుంది. వార్షిక పాస్ రూ.3 వేలు, లైఫ్‌టైమ్ (15ఏళ్లు) పాస్‌ను రూ.30 వేలుగా నిర్ణయించింది. వార్షిక పాస్ తీసుకుంటే జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏడాదిలో ఎన్ని సారై్లనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది.
ఇక లైఫ్‌టైమ్ పాస్ తీసుకుంటే ఆ వాహన జీవిత కాలం అంటే గరిష్టంగా 15ఏళ్ల పాటు టోల్ ఫీజు చెల్లించకుండా జాతీయ రహదారులపై ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం టోల్ గేట్లకు సమీపంలో ఉన్న గ్రామాల వారికి ఆ ఒక్క టోల్ గేటు వరకు పాస్‌ల విధానాన్ని అమలు చేస్తోంది. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు తమ అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పిస్తే నెలకు రూ.340 పాస్‌ను జారీ చేస్తోంది. అంటే ఏడాదికి రూ.4,080 అవుతోంది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఏడాదిపాటు టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి రూ.3 వేలకే పాస్ అన్నది అత్యంత సమంజసమైనదిగా ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి. 2023–24లో టోల్‌ఫీజుల రూపంలో రూ.55వేల కోట్లు వసూలయ్యాయి. వాటిలో ప్రైవేటు కార్ల వాటా రూ.8 వేల కోట్లు మాత్రమే.
కాబట్టి ప్రైవేటు కార్లకు వార్షిక, లైఫ్‌టైమ్ టోల్ ఫీజు పాస్‌ల జారీతో రాబడిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించదని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. టోల్ ఫీజుల పాస్‌ల జారీ కోసం ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన ముసాయిదాపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment