భారత్ ఇప్పుడు అభివృద్ధి వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన ఇండియాలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా ఉంది. అయితే గత పదేళ్లలో జాతీయ రహదారులపైన టోల్ ప్లాజాలు పెరిగాయి, టోల్ ఫీజులు కూడా పెరిగాయి. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు టోల్ ఫీజుల భారాన్ని తగ్గించడానికి వార్షిక టోల్ పాస్‌లు & జీవితకాల టోల్ పాస్‌లను అందించాలని యోచిస్తోంది.
వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్‌ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్‌లు, లైఫ్ టైం టోల్ పాస్‌లు జారీ చేయడానికి సంకల్పించింది.
వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.
వార్షిక, లైఫ్ టైం పాస్‌లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఏకరీతి టోల్ విధానం
వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment