FASTag
-
ఫాస్టాగ్ కొత్త డిజైన్.. దుర్వినియోగానికి ఇక చెక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫాస్ట్‌ట్యాగ్ కొత్త డిజైన్‌ను ఆవిష్కరించింది. వాహనదారులకు సమయం వృధాను తగ్గించడంతోపాటు చిన్న వాహనాల ట్యాగ్‌లతో భారీ వాహనాలు చేస్తున్న దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది."వెహికల్ క్లాస్ (VC-04) కేటగిరీలో ఫాస్ట్‌ట్యాగ్ కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టాం. అధునాతన ఫాస్ట్‌ట్యాగ్ డిజైన్ వాహన గుర్తింపు, టోల్ సేకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే వాహనదారుల సమయం ఆదా అవుతుంది" అని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్త ట్యాగ్ ఆగస్టు 30 నుండి అందుబాటులో వచ్చింది.ఫాస్టాగ్ కొత్త డిజైన్ ప్రత్యేకంగా వెహికల్ క్లాస్-4 (VC-04) కోసం ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇందులో కారు, జీప్, వ్యాన్ కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం, ట్రక్కుల వంటి భారీ వాహనాలపై VC-04 ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కొత్త డిజైన్ వాహనాల కేటగిరీని సులభంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. తప్పు కేటగిరీ వాహనాలపై తక్షణ చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. -
టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా? కేంద్రం క్లారిటీ
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద క్యూ పొడవు లేదా వేచి ఉండే సమయాల ఆధారంగా ప్రస్తుత నిబంధనలు టోల్ ఫీజు మినహాయింపులను అందించవని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎంపీలు లేవనెత్తిన ఆందోళనలను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో రెండు వేర్వేరు సమాధానాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.60 కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ రెండు ప్లాజాల్లో టోల్ వసూలు చేస్తున్నారని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ఎన్‌హెచ్ ఫీజు నిబంధనలు, రాయితీ ఒప్పందం ప్రకారం 60 కి.మీ పరిధిలో ఉన్నప్పటికీ ఫీజు ప్లాజాలకు అనుమతి ఉంటుంది" అని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా దీనికి సంబంధించి 2022 మార్చిలో గడ్కరీ మాట్లాడిన పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. 60-కిమీ పరిధిలో ఒకే ఒక టోల్ ప్లాజా ఉంటుందని, అదనంగా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని అందులో ఆయన హామీ ఇచ్చారు.అయితే, లోక్‌సభలో ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం దీనికి విరుద్ధంగా అలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం, అవసరమైతే 60 కిలోమీటర్లలోపు అదనపు టోల్ ప్లాజాలకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు గడ్కరీ వివరించారు.ఇక కొత్త టోల్ ప్లాజాల రూపకల్పనకు మార్గదర్శకాల్లో భాగంగా రద్దీ సమయాల్లో వాహనాల క్యూలు 100 మీటర్లు దాటితే బూమ్ బారియర్స్‌ను ఎత్తివేసే అంశంపై మరో ఎంపీ అడిగిన ప్రశ్నకూ గడ్కరీ స్పందించారు. “ఫీజు ప్లాజాల వద్ద నిర్ణీత దూరం లేదా సమయ పరిమితి దాటి వాహనాలను నిలిపివేసిన సందర్భంలో ఆ వాహనాలను యూజర్ ఫీజు నుంచి మినహాయించే నిబంధన లేదు” అని ఆయన స్పష్టం చేశారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అమలును ఆయన గుర్తు చేశారు. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. -
రేపటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్.. అవి మార్చుకోవాల్సిందే!
వాహనాల ఫాస్టాగ్‌కు సంబంధించిన కొత్త రూల్స్ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.నూతన నిబంధనలు ఇవే..ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను అందించే కంపెనీలు 3-5 సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్‌లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. అదే ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా మార్చాలి. వాహన యజమానులు తమ ఫాస్టాగ్‌ల జారీ తేదీలను పరిశీలించుకుని తక్షణమే మార్చుకోవాలి.ఆగస్టు 1 నుంచి అన్ని ఫాస్టాగ్‌లను వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నూతన వాహన యజమానులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి డేటాబేస్‌ను ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.ఈ మార్పులతో పాటు వాహనాలను సులభంగా గుర్తించడానికి వాహనానికి సంబంధించిన ముందు, వెనుక వైపుల స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్ ప్రొవైడర్లు అప్లోడ్ చేయాలి. కమ్యూనికేషన్, అప్డేట్స్ సజావుగా సాగేందుకు ప్రతి ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్‌కు కనెక్ట్ చేయాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు అక్టోబర్ 31. టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకూడదంటే చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగానే కేవైసీ చేసుకోవడం మంచిది. -
ఎన్హెచ్ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెహికల్ విండ్‌స్క్రీన్ మీద కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి తప్పకుండా వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్‌పై అంటించాలి.కొందరు వాహనదారులు విండ్‌స్క్రీన్ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటించకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.విండ్‌స్క్రీన్ మీద ఫాస్ట్‌ట్యాగ్‌ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సక్షన్ జరుగుతుంది. అప్పుడు గేట్ వేంగంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వెనుక వచ్చే వాహనదారులు కూడా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. అలా కాకూండా ఫాస్ట్‌ట్యాగ్ అడ్డదిడ్డంగా, ఎక్కడపడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా.. వెనుక వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. -
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కొత్త సర్వీసులు
భారతీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన డిజిటల్ చెల్లింపు సర్వీసులను విస్తరించేందుకు బిల్‌డెస్క్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ పేమెంట్స్ అండ్ సూపర్‌కాయిన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ..‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్)తో కొత్త సేవలను ఏకీకృతం చేయడానికి బిల్‌డెస్క్‌తో కుదిదిన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ అందిస్తున్న ఈ సేవలకు అదనంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి 10 శాతం వరకు సూపర్కాయిన్లను రెడీమ్ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా దేశమంతటా సుమారు 1.3 బిలియన్(130 కోట్లు) లావాదేవీలు జరుగుతాయని సమాచారం. 2026 నాటికి ఈ సంఖ్య 3 బిలియన్ల(300 కోట్లు)కు పైగా ఉంటుందని అంచనా. -
FASTag: పార్క్ ప్లస్‌తో చేతులు కలిపిన స్విగ్గీ - 10 నిమిషాల్లో ఫాస్ట్‌ట్యాగ్..
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. పార్క్ ప్లస్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ఏర్పడటానికి కారణం ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పది నిమిషాల్లోపు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. వినియోగదారులకు అందించడానికి ఈరోజు భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్‌ట్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ పార్క్ ప్లస్‌తో చేతులు కలిపింది. ఈ సౌలభ్యం ప్రస్తుతం 29 నగరాల్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ని నేరుగా వారి ఇంటి వద్దకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ హెడ్ 'ఫణి కిషన్' మాట్లాడుతూ.. ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయడానికి బ్యాంక్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తారు. అయితే కార్డు డెలివరీ అండ్ యాక్టివేషన్ కోసం 3 నుంచి 7 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఫాస్ట్‌ట్యాగ్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుందని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి పార్క్ ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అమిత్ లఖోటియా' మాట్లాడుతూ.. మా ప్రధాన లక్ష్యం కారు యజమానికి ఆనందాన్ని కలిగించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేసే వారు త్వరితగతిని డెలివరీ పొందటానికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహకరిస్తుందని అన్నారు. -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్‌సైట్‌లోని ఎఫ్ఏక్యూ సెక్షన్‌ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్‌మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
మీ ఫాస్ట్ ట్యాగ్ KYC పూర్తి చేశారా? ఇంకా 3 రోజులే గడువు
-
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్‌లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్‌లో ఫాస్టాగ్‌లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్‌గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్‌ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్‌లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్‌లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్‌కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్‌గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదా..? డీయాక్టివేషన్ ఎలా..? కొత్తది ఎలా తీసుకోవాలి..?
-
మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే..
ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన ఆర్బీఐ తేదీని సవరించింది. ఈ నేపథ్యంలో ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఇటీవల ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థానంలో యాక్సిస్ బ్యాంక్‌తో ఒన్97 కమ్యునికేషన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రీఛార్జ్‌లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పేటీఎంను ఉపయోగించవచ్చా? ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌ల కోసం పేటీఎం యాప్‌ని ఉపయోగించవచ్చని కంపెనీ తన FAQ పేజీలో ధ్రువీకరించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ.. వంటి అధీకృత బ్యాంకులకు తమ పేటీఎంను లింక్ చేసిన వారిపై తాజా నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ ఎప్పటిలాగే పని చేస్తాయా? కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని ఉపయోగించవచ్చా? పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు.. ఉపసంహరించుకోవచ్చు.. మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు మాత్రం చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించవచ్చా? ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అందులో డబ్బును డిపాజిట్ చేయలేరు. అందులో ఉన్న నగదును ఉపయోగించవచ్చు. లేదా గడువులోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్‌ని మూసివేయవచ్చు. అందులో ఉన్న నగదు రీఫండ్ కోసం బ్యాంక్‌ని కోరవచ్చు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. -
పేటీఎం ద్వారా ఫాస్టాగ్ టోల్ చెల్లిస్తున్నారా.. ఎన్హెచ్ఏఐ కీలక అప్డేట్
పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను తొలగించారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) తరఫున టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ(ఐహెచ్ఎంసీఎల్) ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని చెప్పింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితా ఇదే.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ కాస్మోస్ బ్యాంక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ జె అండ్ కె బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారస్వత్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ యుకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యెస్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించవద్దని పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం గడువులోపు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనం కదులుతున్నపుడు నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ పరికరం. దేశవ్యాప్తంగా 100కి పైగా రాష్ట్ర రహదారి టోల్ ప్లాజాలు సహా అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో కలిపి 750కి పైగా టోల్లు పనిచేస్తున్నాయి. -
ఎయిర్టెల్ నెత్తిన పాలు పోసిన పేటీఎం!
గత కొద్ది రోజులు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు యూజర్ల తాకిడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లు తెరవడం, ఫాస్టాగ్ వంటి ఆఫర్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే కొత్త కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందని సీఈఓ అనుబ్రత బిస్వాస్ తెలిపారు. అయితే, మరో పేమెంట్ బ్యాంక్ పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలతోనే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు యూజర్లు క్యూకట్టారా? లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ల స్వీకరణ, ఫాస్టాగ్ కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆర్బీఐ పేటీఎంను ఆదేశించింది. అయితే, ఇది ఆర్బీఐ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెగ్యులేటరీ నిబంధనల్ని పేటీఎం పాటించకపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 5 నుంచి 7 రెట్లు పెరిగిన యూజర్లు అదే సమయంలో పేటీఎం యూజర్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఫలితంగా లావాదేవీలు సంఖ్య పెరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్స్, యూపీఐ, ఫాస్టాగ్‌తో పాటు ఇతర సర్వీసుల్ని వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య జనవరి నుంచి 5-7 రెట్లు ఎక్కువ చేరిందని సీఈఓ బిశ్వావ్ తెలిపారు. 59మిలియన్లకు పెరిగి ఇదిలా ఉండగా,ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిసెంబరు 2023 త్రైమాసికంలో రూ. 469 కోట్ల ఆదాయంలో వృద్ధిని కనబరించింది. దీంతో ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి నికర లాభం రూ.11 కోట్లకు చేరిందని పేర్కొంది. సంవత్సరం క్రితంతో పోలిస్తే ఈ మొత్తం 120 వృద్దిని నమోదు చేసింది. బ్యాంక్ నెలవారీ లావాదేవీలు జరిపే యూజర్లు 59 మిలియన్లకు పెరిగారు. భారీ స్థాయిలో డిపాజిట్లు చేశారు. ఇది త్రైమాసికంలో సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.2,339 కోట్లకు చేరుకుంది. అంతకంతకూ ఎయిర్టెల్ ఆదాయం బ్యాంక్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ రూ. 2,62,800 కోట్లకు చేరింది. ఇక డెబిట్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో సహా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇతర సేవల వల్ల.. కస్టమర్ల నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకున్నందుకు గాను ఎయిర్టెల్ ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
పేటీఎం, ఫాస్టాగ్‌పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. -
ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే..
టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేశారు. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ విధానం తొలగించడానికి ప్రధాన కారణం 'జీపీఎస్' బేస్డ్ విధానం అమలులోకి రావడమే. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి, దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. అంతకంటే ముందు దేశంలో ఈ జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను అమలులోకి తీసుకురావడానికి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్లు సమాచారం. 2021లో ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ తరువాత వీటన్నింటిని దశల వారీగా తొలగించనున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే? జీపీఎస్ బేస్డ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్‌తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త సిస్టం అమలుచేయడానికి కేంద్రం సిద్ధమైంది. -
FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగింపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్హెచ్ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్‌తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం. -
కేవైసీ అప్డేట్.. రేపే లాస్ట్ డేట్ - ఇలా అప్డేట్ చేసుకోండి
ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌లను కేవైసీతో అప్డేట్ చేసుకోవాలని, దీని కోసం జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఎన్హెచ్ఏఐ ఇచ్చిన గడువు రేపటితో (జనవరి 31) ముగుస్తుంది. ఈ కథనంలో ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? అప్డేట్ చేయడం ఎలా? ఎందుకు అప్డేట్ చేసుకోవాలని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆర్ధిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు ఉండనున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, పథకాలకు సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ వచ్చే నెల ప్రారంభం నుంచే అమలులోకి వస్తాయి. ఈ కథనంలో ఫిబ్రవరి 1నుంచి ఎలాంటి అంశాలలో మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ ఈ-కేవైసీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 7 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేసినట్లు, ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. అంతే కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్ట్‌ట్యాగ్‌లు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC పూర్తి కాకుంటే అలాంటి ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2023-24 సిరీస్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2024లో 2023-24 సిరీస్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ల(SGB) చివరి విడతను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 ఫిబ్రవరి 12న ప్రారంభమై.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. గత సిరీస్ డిసెంబర్ 18న ప్రారంభమై.. డిసెంబర్ 22కు ముగిసింది. నేషనల్ పెన్షన్ సిస్టం నిధుల పాక్షిక ఉపసంహరణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మొదటి ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రాయితీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన కస్టమర్లకు గృహ రుణ రాయితీలను అందిస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలకు చివరి తేదీ జనవరి 31, 2024. ఫ్లెక్సీపే, ఎన్ఆర్ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ కస్టమర్లకు రాయితీ అందుబాటులో ఉంది. సిబిల్ స్కోర్‌పై ఆధారపడి గృహ రుణాల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు ధన్ లక్ష్మి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకు వచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకానికి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ స్కీమ్ లాస్ట్ డేట్ 2023 నవంబర్ 30 అయినప్పటికీ.. ఆ సమయంలో గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సాధారణ పౌరులైతే 7.4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. -
FASTag: వాహనదారులకు అలర్ట్.. ఫాస్ట్‌ట్యాగ్‌పై NHAI కీలక ప్రకటన
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి? ఆలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. NHAI ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా.. అలంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్‌ట్యాగ్ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31 లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకులు ఎనిమిది కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలామంది ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి గతంలో వెల్లడించారు. ఇదీ చదవండి: 60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే? కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిని అరికట్టడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుడు KYC చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ఈ విధానికి కూడా జనవరి 31 తరువాత మంగళం పాడనున్నారు. -
ఫాస్టాగ్ అకౌంట్ల నుంచి జరిమానాలు కట్.. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆటకట్టు!
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు బెంగళూరు పోలీసులు సూపర్ ఐడియా వేశారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనదారులకు వారి ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను ఉపయోగించి జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అతివేగం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజులుగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, వాహనం నడుపుతున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? ఇక టూవీలర్లు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల వల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా వాటిని ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లకుండా నిషేధించారు. తాజాగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓవర్‌స్పీడ్‌కు కళ్లెం వేయడానికి వాహనాల ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన స్థాయిలో ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటువంటి ఆలోచనను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే జరిమానా వసూలు సులభతరంగా మారుతుంది. వాహనాలను మాన్యువల్‌గా ఆపి జరిమానాలు విధించే అవసరం ఉండదు. అయితే నేరుగా ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా ద్వారా జరిమానాలను వసూలు చేయడం అనేది ప్రధాన గోప్యతా సమస్యను లేవనెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి వసూలు చేస్తున్న జరిమానాల మొత్తం ఎన్హెచ్ఏఐకి వెళుతోందని, అలా కాకుండా ప్రభుత్వానికి జమ చేయాలనేది తమ ప్రణాళిక అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. -
ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్‌హెచ్‌ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్..
తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలను సందర్శించే వారి కోసం ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టైగర్ రిజర్వ్‌లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వసూలు చేసే ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ (ఈఎంసీ) రుసుమును ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వసూలు చేయనున్నారు. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వల్ల వాహనాల సుదీర్ఘ క్యూలు, జాప్యాలను నివారించవచ్చు. తద్వారా సందర్శకులు అటవీ ప్రాంతాలలోని అందాలను, ఆహ్లాదకర వాతావరణాన్ని, వన్యప్రాణులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల కోసం ఎన్హెచ్ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. దేశంమంతటా అన్ని ఫోర్-వీలర్లు, భారీ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. -
ఫాస్టాగ్‌తో టోల్ కలెక్షన్ అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదార్లలో ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు గతేడాది రూ.50,855 కోట్లు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇది ఏకంగా 46 శాతం అధికం కావడం విశేషం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకారం డిసెంబర్లో ఫాస్టాగ్ ద్వారా సగటున రోజుకు రూ.134.44 కోట్ల టోల్ ఫీజు వసూలైంది. గత నెల 24న గరిష్టంగా రూ.144.19 కోట్లు నమోదైంది. 2022లో ఫాస్టాగ్ లావాదేవీలు 48 శాతం అధికమై 324 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్టాగ్స్ జారీ అయ్యాయి. ఫాస్టాగ్ ఆధారంగా ఫీజును స్వీకరించే టోల్ ప్లాజాల సంఖ్య 922 నుంచి గతేడాది 1,181కి చేరింది. -
పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్ కష్టాలు
విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్‌వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఒకసారి రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది. ఫాస్టాగ్ సేవలు ప్రారంభం గన్నవరం విమానాశ్రయంలోని టోల్గేట్లో ఫాస్టాగ్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్గేట్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్గేట్ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు.