
ఏఎన్‌యూ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సమయం, శ్రమ ఆదా చేయడంతోపాటు సులభతరమైన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. దీంతో చాలా టోల్ ప్లాజాలు ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేస్తుండగా, కొన్ని టోల్ ప్లాజాల వద్ద కొంత సడలింపునిచ్చి నగదు లావాదేవీలు జరపుతుండగా, మరికొన్ని పాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానా రూపంలో అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని వాహన దారులు చెబుతున్నారు.
ఫాస్టాగ్ పొందడం ఎలా..
ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, వాలెట్ సంస్థలు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, లేదా ఫాస్టాగ్ సేవలకు అనుమతించిన జాతీయ బ్యాంకుల్లోనూ ఫాస్టాగ్‌ను వాహన దారుడు పొందవచ్చు.
ఫాస్టాగ్ అనుమతి ఉన్న బ్యాంకులు, వాలెట్ సంస్థలు..
దేశ వ్యాప్తంగా 22 జాతీయ బ్యాంకులు పలు వాలెట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సేవలకు అనుమతించింది. బ్యాంకుల్లో.. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సెస్ బ్యాంక్, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లతోపాటు ఎయిర్‌టెల్, పేటీఎం, ఈక్విటాస్, ఐహెచ్‌ఎంసీఎల్, పాల్ మర్చెంట్స్ వంటి వాలెట్లలో ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఫాస్టాగ్ పొందేందుకు ఏ పత్రాలు సమర్పించాలి...
ఫాస్టాగ్ పొందేందుకు వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన ఆర్‌సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను సంబంధిత ధరఖాస్తుకు జత చేయాలి. సంబంధిత సంస్థ లేదా బ్యాంకు కేంద్రం వారు సంబంధిత పత్రాలను పరిశీలించిన వెంటనే ఫాస్టాగ్ జారీ చేస్తారు.
రీఛార్జ్ ఎలా..
ఫాస్టార్ రీఛార్జ్‌ను వాహన దారుడు ప్రభుత్వం గుర్తించిన 22 బ్యాంకుల్లో ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగి ఉంటే ఆ ఖాతాకు ఫాస్టాగ్‌ను జత చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజా వద్ద ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేయబడతాయి. లేదా ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాల ద్వారా ప్రీపెయిడ్ విధానంలో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
చెల్లింపులు ఎలా జరుగుతాయి..
వాహన దారుడు దాటుటున్న టోల్ ప్లాజా వద్ద నిర్ధేశించిన టారిఫ్‌ను బట్టి ఫాస్టాగ్ ఎకౌంట్ నుంచి నగదు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. సింగిల్ ప్రయాణమా, అప్ అండ్ డౌన్ కావాలా అనేది చెప్పాల్సినవసరం లేదు. ఒక సారి టోల్ ప్లాజా దాటుతుంటే సింగల్ జర్నీ క్రింద నిర్థేశించిన మొత్తం కట్ అవుతుంది. అదే వాహన దారుడు 24 గంటల లోపు మరలా అదే టోల్ గేట్ నుంచి తిరిగి వెనుకకు వెళితే సింగిల్ ప్రయాణంలో సగం మొత్తం మాత్రమే కట్ అవుతుంది.
లోకల్ పాస్ విధానమూ అందుబాటులో...
ఫాస్టాగ్ సౌకర్యం ఉన్న వాహన దారుడు తమకు దగ్గర్లోని టోల్ ప్లాజా వద్ద లోకల్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వాహనదారుడు ఆ టోల్ ప్లాజా నుంచి నిర్థేశించిన కిలోమీటర్లలోపు ప్రాంతంలో నివసిస్తున్నట్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాహనం ఆర్‌సీతోపాటు మూడు నెలల లోపు చెల్లింపులు జరిగిన గ్యాస్ బిల్లు వంటి అడ్రస్ ఫ్రూఫ్ జిరాక్సులను సంబంధిత టోల్ ప్లాజా వద్ద కేంద్రంలో సమర్పించాలి. లోకల్ పాస్ కోసం ఆ టోల్ ప్లాజా నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించాలి. లోకల్ పాస్ ఉన్న వాహనదారుడు నెలలో ఎన్నిసార్లయినా ఆ టోల్‌ప్లాజా నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
ఐసీఐసీఐ ఫాస్టాగ్ లోకల్ పాస్ వినియోగదారులకు 11 నెలల ఆటో రెన్యువల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పదకొండు నెలల తరువాత మరలా నిర్ధేశిత పత్రాలు సమర్పించి ఆటో రెన్యువల్ పొందవచ్చు. లేదా టోల్ ప్లాజా వద్ద ఉన్న కేంద్రంలో ప్రతి నెలా ఒకటవ తారీఖు కల్లా నిర్ధేశించిన నగదు చెల్లించి మంత్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోరెన్యువల్ లోకల్ పాస్ సౌకర్యం ఉన్న ఫాస్టాగ్ వినియోగదారుడు ప్రతినెలా 27వ తేదీకల్లా తమ ఫాస్టాగ్ ఎకౌంట్‌లో నిర్ధేశించిన మొత్తం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ ఆ ఎకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోతే ఆటోరెన్యువల్ జరగదు.
Comments
Please login to add a commentAdd a comment