తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలను సందర్శించే వారి కోసం ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టైగర్ రిజర్వ్‌లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వసూలు చేసే ఎకోసిస్టమ్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేషన్ (ఈఎంసీ) రుసుమును ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వసూలు చేయనున్నారు. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వల్ల వాహనాల సుదీర్ఘ క్యూలు, జాప్యాలను నివారించవచ్చు. తద్వారా సందర్శకులు అటవీ ప్రాంతాలలోని అందాలను, ఆహ్లాదకర వాతావరణాన్ని, వన్యప్రాణులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించవచ్చు.
టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. దేశంమంతటా అన్ని ఫోర్-వీలర్‌లు, భారీ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment