2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆర్ధిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు ఉండనున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, పథకాలకు సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ వచ్చే నెల ప్రారంభం నుంచే అమలులోకి వస్తాయి. ఈ కథనంలో ఫిబ్రవరి 1నుంచి ఎలాంటి అంశాలలో మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం.
ఫాస్ట్‌ట్యాగ్ ఈ-కేవైసీ
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇప్పటికి దాదాపు 7 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేసినట్లు, ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. అంతే కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్ట్‌ట్యాగ్‌లు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC పూర్తి కాకుంటే అలాంటి ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2023-24 సిరీస్ 4
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2024లో 2023-24 సిరీస్‌లో సావరిన్ గోల్డ్ బాండ్‌ల(SGB) చివరి విడతను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 ఫిబ్రవరి 12న ప్రారంభమై.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. గత సిరీస్ డిసెంబర్ 18న ప్రారంభమై.. డిసెంబర్ 22కు ముగిసింది.
నేషనల్ పెన్షన్ సిస్టం నిధుల పాక్షిక ఉపసంహరణ
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మొదటి ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రాయితీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన కస్టమర్లకు గృహ రుణ రాయితీలను అందిస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలకు చివరి తేదీ జనవరి 31, 2024. ఫ్లెక్సీపే, ఎన్‌ఆర్‌ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ కస్టమర్‌లకు రాయితీ అందుబాటులో ఉంది. సిబిల్ స్కోర్‌పై ఆధారపడి గృహ రుణాల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు
ధన్ లక్ష్మి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకు వచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకానికి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ స్కీమ్ లాస్ట్ డేట్ 2023 నవంబర్ 30 అయినప్పటికీ.. ఆ సమయంలో గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సాధారణ పౌరులైతే 7.4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment