సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తప్పనిసరి కావడం, ఇంటి దొంగల ఆట కట్టు కావటంతో జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదాయం వచ్చిపడుతోంది. ఇంతకాలం జవాబుదారీ విధానం లేకపోవటంతో ఎన్ని వాహనాలు టోల్‌ప్లాజాలను దాటుతున్నాయి, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తోంది.. సరైన లెక్కాపత్రం లేకుండా పోయింది. సిబ్బంది హస్తలాఘవం బాగా ఉండటంతో దాదాపు సగానికి సగం మొత్తం గాయబ్ అవుతూ వచ్చింది.
ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము ఆటోమేటిక్‌గా వసూలవుతుండటంతో భారీ మొత్తం జమవుతోంది. ఇంతకాలం ఫాస్టాగ్ లేని వాహనాల సంఖ్య కూడా గణనీయంగా కనిపిస్తూండేది. కానీ గత రెండు మూడు నెలల్లో ఫాస్టాగ్ పొందిన వాహనాల సంఖ్య గరిష్టస్థాయికి చేరింది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని జాతీయ రహదారుల మీద పరుగుపెడుతున్న వాహనాల్లో 98 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. దీంతో నిత్యం రాష్ట్రంలోని 27 టోల్ కేంద్రాల ద్వారా రూ.మూడున్నర కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు ఆదాయం నమోదవుతుండటం విశేషం.
ఫాస్టాగ్ తప్పనిసరితో..
మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ గతేడాది ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనం వస్తే అప్పటికప్పుడు ట్యాగ్ కొని అతికించుకోవటమో, లేదా రెట్టింపు రుసుమును పెనాల్టీగా చెల్లించి ముందుకు వెళ్లటమో, లేదా వెనుదిరిగి వెళ్లిపోవటమో చేయాల్సిన పరిస్థితిని గత ఫిబ్రవరి నుంచి అమలులోకి తెచ్చారు. దీంతో వాహనదారులందరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయటం ప్రారంభించారు. తాజాగా.. సంక్రాంతి ప్రయాణాల కోసం ఎక్కువ మంది ఫాస్టాగ్ కొనేశారు. ప్రస్తుతం 98 శాతం వాహనాలకు ట్యాగ్ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment