రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మేకల లోడ్ లారీ
ఐదుగురు అక్కడికక్కడే మృతి.. మరో ఐదుగురికి తీవ్రగాయాలు
మృతులంతా మధ్యప్రదేశ్ వాసులే..
అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణం కావొచ్చన్న పోలీసులు
చేగుంట (తూప్రాన్)/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నాగ్‌పూర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. నాగ్‌పూర్ వైపు నుంచి మేకల లోడుతో హైదరాబాద్‌కు వస్తున్న లారీ.. రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా చేగుంట శివార్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులేనని గుర్తించారు. గాయపడ్డవారికి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌కు మేకలు తీసుకొస్తూ..
44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ దాణా లారీ శుక్రవారం తెల్లవారుజామున టైర్ పంక్చరై, రోడ్డుపై ఆగిపోయింది. అదే దారిలో నాగ్‌పూర్ వైపు నుంచి మేకల లోడ్ లారీ వస్తోంది. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న మేకల మండీకి ఉదయమే మేకలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఆత్రుతతోనే డ్రైవర్ వేగంగా లారీని నడిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది.
ఈ ధాటికి మేకల లోడ్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో కూర్చుని ఉన్న ఇద్దరు, వెనుకాల ట్రాలీలో మేకలతోపాటు ఉన్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతివేగం.. నిద్రమత్తుతో!
ప్రమాదం జరిగినప్పుడు మేకల లారీ గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో మూల మలుపు ఉంది. దానికితోడు తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డుపై ఆగిఉన్న దాణా లారీని సరిగా గమనించకపోవడం వల్లే ప్రమాదానికి దారితీసి ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదంలో లారీలోని 80 వరకు మేకలు కూడా మృతి చెందాయి.
మృతులంతా మధ్యప్రదేశ్ వాసులు
ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని గుర్తించారు. క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న మేకల వ్యాపారులు చిక్వారాజు(57), చిక్వా మనీశ్‌కుమార్ (30), వెనకాల ట్రాలీలో మేకలతోపాటు కూర్చున్న కారి్మకులు ఎండీ ఇబ్రహీం (21), ఎండీ షబ్బీర్ (48), ఎండీ జిసాన్ (21) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ బుట్టాసింగ్, మేకల వ్యాపారి లాల్‌మణి, రమేశ్‌లాల్, మహేశ్‌లాల్, శుక్లాల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment