
Central Govt Has Sanctioned Four National Highways: కేంద్రం తెలంగాణకు మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేసింది. అందులో ఒకదానిని నాలుగేళ్ల క్రితం, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. వీటికి టెండర్లు పిలిచేందు కు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా.. అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతా ల్లో 10 మీటర్లు వెడల్పుగా మారనున్నాయి.
అన్నీ కీలక రోడ్లే..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రం రాష్ట్రానికి విరివిగా జాతీయ రహదారులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సగటు ప్రతి వంద కిలోమీటర్లకు 3.02 కిలోమీటర్లుకాగా.. ప్రస్తుతం తెలంగాణ లో జాతీయ రహదారుల సగటు 3.44 కిలోమీటర్లుగా ఉంది. కొత్త రోడ్లతో ఈ సగటు మరికొంత పెరగనుంది. కొత్తగా అభివృద్ధి చేయనున్న నాలుగూ కీలకమైనవే. ఇందులో జనగామ–దుద్దెడ మధ్య ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం నాలుగేళ్ల క్రితమే జాతీయ రహదారిగా గుర్తించింది.
కానీ నిధులు మంజూరుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసి పంప గా తాజాగా పనులకు అనుమతి మంజూరు చేసింది. 45.5 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.423 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇక గతేడాది జాతీయ రహదారుల హోదా దక్కించుకున్న మెదక్–సిద్దిపేట, సిద్దిపేట–ఎల్కతుర్తి, వలిగొండ–తొర్రూరు రోడ్లకు కూడా అనుమతులు వచ్చాయి. వీటి డీపీఆర్‌లను పరిశీలించిన కేంద్రం పనులకు పచ్చజెండా ఊపింది.
త్వరలోనే ఈ నాలుగు రోడ్ల పనులు మొదలై.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోడ్లు ఏడు మీటర్ల వెడల్పే ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే సింగిల్ రోడ్లుగానే ఉన్నాయి. కానీ ట్రాఫిక్ ఎక్కువగానే ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులుగా మారాక ఇబ్బందులు తప్పనున్నాయి. మొత్తంగా ఈ నాలుగు రోడ్లకు రూ.2,432 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను కేంద్రమే ఇవ్వనుంది.