State Highways
-
15 రోడ్లు అప్‌గ్రేడ్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామి క కారిడార్లు, పర్యాటక, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వినతిపత్రం సమర్పించారు. ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి గుర్తుచేశారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024–25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్లు(780కి.మీ) ♦ చౌటుప్పల్–(ఎన్‌హెచ్65)–ఆమనగల్లు–షాద్‌నగర్ –సంగారెడ్డి (ఎన్‌హెచ్65) 182 కి.మీ ♦ మరికల్ (ఎన్‌హెచ్167)– నారాయటపేట–రామసముద్రం (ఎన్‌హెచ్150) 63 కి.మీ ♦ పెద్దపల్లి (ఎస్‌హెచ్1)– కాటారం (ఎన్‌హెచ్353సి) 66 కి.మీ ♦ పుల్లూరు (ఎన్‌హెచ్44)–అలంపూర్–జెట్‌ప్రోల్–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట– డిండి (ఎన్‌హెచ్765)–దేవరకొండ(ఎన్‌హెచ్176)–మల్లేపల్లి (ఎన్‌హెచ్167)– నల్లగొండ (ఎన్‌హెచ్–565) 225 కి.మీ ♦ వనపర్తి –కొత్తకోట–గద్వాల – మంత్రాలయం (ఎన్‌హెచ్167) 110 కి.మీ ♦ మన్నెగూడ (ఎన్‌హెచ్163)–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్ (ఎన్‌హెచ్–50) 134 కి.మీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి భారతమాల పథకం ఫేజ్–1లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–చౌటుప్పల్‘) గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మాత్రమే మంజూరై ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోందని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. కాగా దక్షిణభాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు హై దరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65) పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దీని ఏర్పాటుకు రూ.65 కోట్లు వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్‌లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి వెంట తాండూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు బి.మనోహర్‌రెడ్డి, జనంపల్లి అనిరుద్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
తెలంగాణలో కొత్తగా 300 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారుల మీదుగా పారే వాగులు, వంకలపై కొత్తగా 300 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల్లో వెంటనే వంతెనలు నిర్మించి వరద పారేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని, లేకుంటే రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఇటీవల అధికారులు నివేదిక సమర్పించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో అధికారులు సర్వే చేసి 300 ప్రాంతాల్లో వంతెనలు అవసరమని తేల్చారు. ఇప్పుడు వాటిల్లో 150 వంతెనల పనులను ప్రారంభించి వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో.. పంచాయతీ రోడ్లు పోను రాష్ట్ర స్థాయి రోడ్ల నిడివి 28 వేల కిలోమీటర్ల మేర ఉంది. వాటిల్లో కొన్ని చోట్లే వంతెనలు ఉన్నాయి. మిగతా చోట్ల పాత కల్వర్టులు, పాత బ్రిడ్జీలకే మరమ్మతులు చేస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. గత రెండేళ్లలో వరదలకు 133 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. వాగులు పారే మరో 167 చోట్ల వంతెనలు లేవు. వర్షాకాలంలో ఆ రోడ్ల మీదుగానే వరద పారుతోంది. ఈ ప్రాంతాల్లో రూ. 635 కోట్లతో వంతెనలు నిర్మించనున్నారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. గత పదేళ్లలో వరదనీరు ఆయా ప్రాంతాల్లో ఎంత ఎత్తు, ఎంత వెడల్పుతో ప్రవహించిందన్న వివరాలను సేకరించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో వంతెనల పొడవు, ఎత్తు నిర్ధారించారు. ప్రారంభమైన పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి రాష్ట్ర రహదారులకు కాలానుగుణ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 వేల కి.మీ. నిడివిగల రోడ్లను పటిష్టపరిచేలా మరమ్మతులు చేపట్టనున్నారు. వాటిని 1,187 పనులుగా విభజించగా ఇందులో ఇప్పటికే 126 పనులు పూర్తి చేశారు. మిగతా వాటిల్లో 173 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 474 పనులు టెండర్లు పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతావాటికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ మరమ్మతులకు రూ. 1,700 కోట్లు ఖర్చు కానుంది. -
తెలంగాణలో మరో నాలుగు జాతీయ రహదారులు
Central Govt Has Sanctioned Four National Highways: కేంద్రం తెలంగాణకు మరో నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేసింది. అందులో ఒకదానిని నాలుగేళ్ల క్రితం, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. వీటికి టెండర్లు పిలిచేందు కు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా.. అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతా ల్లో 10 మీటర్లు వెడల్పుగా మారనున్నాయి. అన్నీ కీలక రోడ్లే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రం రాష్ట్రానికి విరివిగా జాతీయ రహదారులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సగటు ప్రతి వంద కిలోమీటర్లకు 3.02 కిలోమీటర్లుకాగా.. ప్రస్తుతం తెలంగాణ లో జాతీయ రహదారుల సగటు 3.44 కిలోమీటర్లుగా ఉంది. కొత్త రోడ్లతో ఈ సగటు మరికొంత పెరగనుంది. కొత్తగా అభివృద్ధి చేయనున్న నాలుగూ కీలకమైనవే. ఇందులో జనగామ–దుద్దెడ మధ్య ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం నాలుగేళ్ల క్రితమే జాతీయ రహదారిగా గుర్తించింది. కానీ నిధులు మంజూరుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసి పంప గా తాజాగా పనులకు అనుమతి మంజూరు చేసింది. 45.5 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.423 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇక గతేడాది జాతీయ రహదారుల హోదా దక్కించుకున్న మెదక్–సిద్దిపేట, సిద్దిపేట–ఎల్కతుర్తి, వలిగొండ–తొర్రూరు రోడ్లకు కూడా అనుమతులు వచ్చాయి. వీటి డీపీఆర్‌లను పరిశీలించిన కేంద్రం పనులకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఈ నాలుగు రోడ్ల పనులు మొదలై.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోడ్లు ఏడు మీటర్ల వెడల్పే ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే సింగిల్ రోడ్లుగానే ఉన్నాయి. కానీ ట్రాఫిక్ ఎక్కువగానే ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులుగా మారాక ఇబ్బందులు తప్పనున్నాయి. మొత్తంగా ఈ నాలుగు రోడ్లకు రూ.2,432 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను కేంద్రమే ఇవ్వనుంది. -
Telangana: ఇవేం రోడ్లు.. వాహనదారుల బెంబేలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీరాజ్ శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖకు బదిలీ అయిన గ్రామీణ రోడ్లు.. ఇలా ఆ రోడ్డు, ఈ రోడ్డు అని లేదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ధైర్యం చేసి కొద్దిగా దూరంగా వెళితే చాలు ఒళ్లు హూనమవుతోంది. ఎప్పట్నుంచో మరమ్మతులకు నోచక గుంతలు పడిన రోడ్లు ఇటీవలి భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు తీస్తున్నాయి. జాతీయ రహదారుల మరమ్మతుకు చాలాచోట్ల సాంకేతిక అంశాలు అడ్డుగా మారుతుండగా, రాష్ట్ర రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు నిధుల లేమి ఆటంకంగా మారింది. రోడ్లు భవనాల శాఖలోకి బదిలీ అయిన గ్రామీణ రోడ్లపై.. అప్పట్నుంచీ ఒక్క కంకర రాయి కూడా పడలేదంటే అతిశయోక్తి కాదు. హైవేపై స్పీడుకు తారు ధరలతో బ్రేకు జాతీయ రహదారులంటే.. వాహనం రయ్యిన దూసుకెళ్లేలా, ఎలాంటి కుదుపులకు తావివ్వని విధంగా నున్నగా, విశాలంగా ఉండాలి. ఆ మేరకు తీర్చిదిద్దేందుకే సాధారణ రోడ్లను జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తారు. వాటి నిర్వహణ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు వాటిని ఓ విచిత్ర సమస్య వెంటాడుతోంది. కోవిడ్ సమస్య ఉత్పన్నం కాకముందు తారు ధర మెట్రిక్ టన్నుకు రూ.27 వేలుగా ఉండేది. గత ఏడాదిన్నర కాలంలో దాని ధర ఏకంగా రూ.40 వేలకు చేరింది. దీంతో జాతీయ రహదారుల రెన్యూవల్ వర్క్స్ (పూర్తిస్థాయి మరమ్మతులు)కు పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ ధరను కోట్ చేస్తున్నారు. సాధారణంగా 5 శాతం ఎక్సెస్ వరకు అనుమతి ఉంటుంది. కానీ తారు ధర భారీగా పెరగటంతో కాంట్రాక్టర్లు 25 శాతం వరకు ధర పెంచి కోట్ చేస్తున్నారు. ఇది నిబంధనలకు లోబడి లేని విషయం కావటంతో అధికారులు టెండర్లను రద్దు చేస్తున్నారు. కొన్ని చోట్ల టెండర్లు ఓకే అయినా.. తారు ధర అదుపులోకి వచ్చాక రెన్యూవల్ వర్క్స్ చేపట్టొచ్చని కాంట్రాక్టర్లు చిన్నపాటి గుంతలను సరిచేసేందుకే పరిమితమవుతున్నారు. రాష్ట్ర రహదారుల్లో 20 వేల కి.మీ. తిప్పలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరుసల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మించిన దాదాపు 8 వేల కి.మీ. రోడ్లు మాత్రం బాగున్నాయి. ఇవి పోను రాష్ట్రంలో మిగిలిన 20 వేల కి.మీ మేర విస్తరించి ఉన్న రాష్ట్ర రహదారులు మాత్రం క్రమంగా దారుణంగా మారుతున్నాయి. ఇందులో ఏడు వేల కి.మీ మేర ఉన్న పాత పంచా యతీరాజ్ శాఖలోని గ్రామీణ రోడ్లు దాదాపు ధ్వంసమయ్యాయి. ఈ రోడ్లను ఉన్నతీకరించేందుకు గత ఏడేళ్ల కాలంలో కొన్నికొన్ని చొప్పున రోడ్లు భవనాల శాఖకు బదిలీ చేశారు. ఈ శాఖ ఆధీనంలోని 21 వేల కి.మీ. రోడ్లను నిర్వహించేందుకే నిధులు సరిపోని పరిస్థితిలో, కొత్తగా వచ్చిచేరిన ఈ రోడ్లను నిర్వహించటం దానివల్ల కావటం లేదు. దీంతో ఈ ఏడేళ్లలో ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ఆ రోడ్లను బలవంతంగా తమకు అప్పగించారన్న అభిప్రాయంతో ఆ శాఖ ఉంది. వరంగల్ శివారు హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామం నుంచి ఎల్కతుర్తి మధ్య రోడ్డు. దీని పరిస్థితి కూడా దారుణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నామరూపాల్లేకుండా చెదిరిపోయి పెద్దపెద్ద గోతులేర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అయినప్పటికీ ఆరోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఉత్తర తెలంగాణలో కొంత మేర ఓకే ఇక గత ఏడాది నుంచి వానలు, ఇతర కారణాలతో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోడ్ల మరమ్మతుకు డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ప్రభుత్వం రూ.300 కోట్లు (బొగ్గు తవ్వకాల ప్రభావం ఉన్న జిల్లాలకు) కేటాయించింది. వాటితో కొన్ని ప్రాంతాల్లో పనులు జరగటంతో కొంతమేర ఆయా రోడ్లు బాగుపడ్డాయి. పనులు జరగని చోట్ల వాహనాలు సరిగా తిరగలేని దుస్థితే ఉంది. అదే దక్షిణ తెలంగాణలో పనులు అంతగా జరగకపోవటంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు నెలకొన్నాయి. ఇటీవలి వానల తర్వాత గుంతలు పూడ్చేందుకు రోడ్లు భవనాల శాఖ రూ.25 కోట్లు విడుదల చేసింది. కానీ అవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. తీర్చిదిద్దాలంటే వేల కోట్లు కావాలి ఇప్పటికిప్పుడు 21 వేల కి.మీ రోడ్లపై గుంతలు పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటే రూ.550 కోట్లు కావాలని ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారు. ఆ నిధుల కోసం ఇప్పుడు ఆ శాఖ ఎదురుచూస్తోంది. గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. వీటిల్లో ఒక్క పాత పంచాయతీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకే రూ.250 కోట్లు అవసరం. వాటిని పూర్తిస్థాయి మరమ్మతు చేస్తూ సింగిల్ రోడ్లుగా కొత్త తారు పూతతో తీర్చి దిద్దాలంటే ఏకంగా రూ.3 వేల కోట్లు కావాలి. అదే రెండు వరుసలకు విస్తరించాలంటే రూ.5 వేల కోట్లు కావాలి. ముట్టుకుంటే ఇంత ఖర్చు కానుండటంతో రోడ్లు భవనాల శాఖ వాటి జోలికెళ్లటం లేదు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మరిపెడ–దంతాలపల్లి మధ్య రోడ్డు దుస్థితి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు పూర్తిస్థాయి మరమ్మతు జరిగింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అప్పట్నుంచీ తూట్లు పడుతూ పడుతూ ఇలా తయారయ్యింది. పెద్దపెద్ద గుంతలతో వాహనదారులకు నిత్యం నరకం చూపుతోంది. ఇటీవల దీని మరమ్మతుకు 3 పర్యాయాలు టెండర్లు పిలిస్తే, తారు (బిటమిన్) ధరలు బాగా పెరిగాయని చెప్పి కాంట్రాక్టర్లు 25శాతానికి పైగా ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేయటంతో అధికారులు తిరస్కరించారు. తారు ధరల పెంపునకు తగ్గట్టు బిల్లులు చెల్లించే అవకాశం లేక జాతీయ రహదారుల విభాగం విషయాన్ని ఢిల్లీకి చేరవేసి మిన్నకుండిపోయింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే హైదరాబాద్–నల్లగొండ ప్రధాన రహదారి అంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. అంతలా ఈ రోడ్డు దెబ్బతింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలు ఆటంకంగా మారాయి. ఫలితంగా వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. -
ఇక రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారులపై కూడా ఫాస్టాగ్ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు, ఔటర్ రింగురోడ్డుపై మాత్రమే ఫాస్టాగ్‌తో నగదు రహిత చెల్లింపు విధానం అమలవుతోంది. గత 15వ తేదీ నుంచి అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలలో అన్ని గేట్లను పూర్తిగా ఫాస్టాగ్‌తో అనుసంధానించిన విషయం తెలిసిందే. గతేడాదిలోనే ఒక గేట్ మినహా మిగతావి ఫాస్టాగ్ పరిధిలోకి వచ్చాయి. కానీ, రాష్ట్ర రహదారులపై మాత్రం ఇంకా నగదు చెల్లింపు విధానం కొనసాగుతోంది. ఇక మార్చి ఒకటో తేదీ నుంచి హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై ఇది అమలులోకి రానుంది. ప్రస్తుతానికి ఒక రహదారిపైనే.. రాష్ట్రంలో టోల్‌ప్లాజాలున్న రాష్ట్ర రహదారులు రెండు. మొదటిది హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారి కాగా, రెండోది నార్కెట్‌పల్లి-అద్దంకి (పాత ఎన్‌హెచ్-5) రోడ్డు. ఇందులో రాజీవ్ రహదారిపై దుద్దెడ, రేణికుంట, బసంత్‌నగర్‌ల వద్ద మూడు ప్లాజాలున్నాయి. ఈ మూడింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఫాస్టాగ్ విధానాన్ని మార్చి ఒకటి నుంచి అమలులోకి తేవాలని భావిస్తున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై మూడు టోల్ప్లాజాలున్నాయి. ఇందులో మాడుగులపల్లి వద్ద ఉన్న ప్లాజా తెలంగాణలో ఉండగా, మిగతా రెండు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. మాడుగులపల్లి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ వ్యవస్థ ఏర్పాటైంది. కానీ, మిగతా రెండుచోట్ల కాలేదు. ఈ మూడు ప్లాజాలు కూడా ఒకే కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నాయి. దీంతో మూడింటిని ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రోడ్డుపై మాత్రం మార్చి చివరికిగానీ, ఏప్రిల్ మొదటి వారంలోగాని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. సిస్టం ఏర్పాటుపై స్పష్టత లేక.. రాష్ట్ర రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌కు సంబంధించిన సెన్సార్లు, ఇతర ఆటోమేటిక్ వ్యవస్థ, దాని సాఫ్ట్వేర్ కొనుగోలు ఖర్చు విషయంలో ప్రభుత్వానికి-కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత రాలేదు. ఈ రోడ్ల ఒప్పందాలు 2010లో జరిగాయి. అప్పటికీ ఫాస్టాగ్ విధానంపై అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటుకు ఒక్కోప్లాజా వద్ద దాదాపు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ రూ.20 లక్షలకు మాత్రమే రీయింబర్స్ చేస్తోంది. మిగతా ఖర్చును కాంట్రాక్టర్ భరించాల్సి ఉంది. కానీ.. మొత్తం ఖర్చును రీయింబర్స్ చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, ముందైతే ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించటంతో ప్రస్తుతానికి కాంట్రాక్టరే వ్యయాన్ని భరిస్తున్నారు. ట్యాగ్ లేకుంటే రెట్టింపు ఫీజు ఫాస్టాగ్ లేకుండా టోల్‌గేట్‌లోకి వస్తే రెట్టింపు రుసుము చెల్లించే పద్ధతి ప్రస్తుతం జాతీయ రహదారులపై అమలవుతోంది. ఇదే పద్ధతి ఇక రాష్ట్ర రహదారులపై (ఫాస్టాగ్ ప్రారంభం అయినప్పటి నుంచి) అమలులోకి రానుంది. ప్రస్తుతానికి రహదారులపై 75 వాహనాలకు మాత్రమే ట్యాగ్ ఉంటోంది. మిగతావారు అప్పటికప్పుడు ట్యాగ్ కొనటమో, రెట్టింపు ఫీజు చెల్లించి వెళ్లటమో చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లమీద దూసుకుపోయే వాహనదారులు కూడా అప్రమత్తం కావాల్సిందే. ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉన్న వాహనాల కోసం ఒక అత్యవసర మార్గం తప్ప మిగతావాటిల్లో కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందే. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
డెమో కారిడార్లుగా డేంజర్ రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉన్న రాష్ట్ర రహదారులు ఇకపై డెమో కారిడార్లుగా మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వంద కిలోమీటర్ల చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. డెమో కారిడార్లతో ప్రమాదాల శాతం తగ్గుతుందని పేర్కొంది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలన్నిటినీ గుర్తించి ఆయా చోట్ల డెమో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. జిల్లాల్లో ఏ రాష్ట్ర రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో త్వరలో నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను కోరామని వివరించింది. మొత్తం 1,300 కి.మీ మేర ► 13 జిల్లాల్లో 1,300 కి.మీ. మేర రాష్ట్ర రహదారులపై డెమో కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో డెమో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ► ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాల మధ్య 139 కి.మీ మేర రేణిగుంట–రాయలచెరువు డెమో కారిడార్ ఉంది. తాజాగా ఇవే జిల్లాల్లో రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య మరో డెమో కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లాలోని కొండమోడు–పేరేచర్ల, కృష్ణా జిల్లాలోని విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమ గోదావరిలోని భీమవరం మధ్య డెమో కారిడార్ ప్రతిపాదించారు. రూ.2.5 కోట్లతో రోడ్ సేఫ్టీ ఆడిట్ రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర రూ.2.5 కోట్లతో రోడ్ సేఫ్టీ ఆడిట్ (రోడ్డు భద్రత పరిశీలన)ను ప్రారంభించినట్లు రవాణా శాఖ తెలిపింది. ఇకపై కొత్తగా 5 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నా..రోడ్ సేఫ్టీ ఆడిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వివరించింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.25 కోట్ల విలువైన బ్లాక్‌స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)ల మెరుగుదల పనులు జరిగాయని, మరో రూ.50 కోట్ల పనులు కొనసాగుతున్నట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, మోటారు వాహన చట్టం అమలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధిస్తున్న జరిమానాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికను పంపింది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు ► 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య డెమో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందజేసింది. ► 2013లో ఈ రహదారిలో 250 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా.. కారిడార్ ఏర్పాటు తర్వాత ప్రమాదాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2015 నాటికి సగానికి తగ్గగా, 2017 నాటికి వంద వరకు నమోదయ్యాయి. ఇక 2018 నాటికి పదుల సంఖ్యలోనే ప్రమాదాలు నమోదు కావడం గమనార్హం. డెమో కారిడార్ అంటే... డెమో కారిడార్ అంటే ప్రమాదాలకు అంతగా అవకాశం లేనిరోడ్డు. డెమో కారిడార్ కింద తొలుత ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఎక్కడా గుంతలు లేకుండా చూస్తారు. నిర్దేశిత బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వాహనాల బరువును చూసేందుకు ఆయా రోడ్లలో వే బ్రిడ్జిలు (కాటా యంత్రాలు) ఏర్పాటు చేస్తారు. ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచుతారు. -
రహదార్ల మరమ్మతులకు రూ.450 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు రూ.450 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర రహదారులు (స్టేట్ హైవేస్), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్)పై అన్ని రకాల మరమ్మతులకు కలిపి రూ.625 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే రూ.450 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందులో రాష్ట్ర రహదారులకు రూ.250 కోట్ల, జిల్లా ప్రధాన రహదారులకు రూ.200 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో రహదార్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో స్టేట్ హైవేస్ పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ట్రాఫిక్ ఉండే పాలకొల్లు–పూలపల్లి, నర్సాపూర్–అశ్వారావుపేట, బూర్గంపాడు–అశ్వారావుపేట, మార్టేరు–ప్రక్కిలంక రహదార్లు అధ్వానంగా ఉన్నాయి. తూర్పుగోదావరిలో సోమేశ్వరం–రాజానగరం, కాట్రేనికోన–చల్లపల్లి, కరప–చింతపల్లి, రాజమండ్రి–చినకొండేపూడి తదితర రహదార్లను వెంటనే మరమ్మతులు చేసేందుకు నిధుల్ని ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి మరమ్మతులకు, ట్రాఫిక్, జనసాంద్రత ఎక్కువగా ఉండే రహదారులపై గుంతల్ని సరిజేయడానికి నిధుల్ని ఖర్చు చేయనున్నారు. కాగా గతంలో చేసిన జాతీయ రహదార్ల మరమ్మతుల పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులున్నాయి. వీటికోసం రూ.27 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.293 కోట్ల వరకు పెండింగ్ బిల్లులుండగా క్లియర్ చేసేందుకు ఆర్ అండ్ బీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రహదార్ల రెన్యువల్‌కు రూ.700 కోట్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దీర్ఘకాలిక పనితీరు ఆధారిత నిర్వహణ కాంట్రాక్టు కింద రెండు వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లకు అనుమతులొచ్చాయి. సాధారణంగా ప్రతి ఏడాది రహదార్లను రెన్యువల్ (దెబ్బతిన్న మేర కొత్తగా లేయర్ వేయడం) చేస్తారు. -
టోల్గేట్లలో ఇక ఫాస్ట్‌గా!
గుంటూరు – విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రద్దీగా ఉండే కాజ టోల్‌గేట్‌ను దాటాలంటే వాహనాలు బారులు తీరిన సమయంలో 10 – 15 నిమిషాలు పడుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షణ తప్పదు. వాహనాలు చీమల్లా కదులుతుండటంతో ఇంధనం వృథా అవుతోంది. జాతీయ రహదారులపై 10 టోల్గేట్లు దాటాలంటే సగటున అర లీటరు నుంచి లీటరు దాకా ఇంధనం వృథా అవుతోందని అంచనా. అదే ‘ఫాస్టాగ్’ వరుసలో వెళ్తే రెండు నిమిషాల్లో టోల్గేట్ దాటవచ్చు. ప్రస్తుతం టోల్గేట్లలో ఒక వరుస మాత్రమే ఫాస్టాగ్ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి టోల్గేట్లలో అన్ని వరుసలను ఫాస్టాగ్‌గా మారుస్తారు. వాహనదారులు కేవలం ఒక్క వరుసలో మాత్రమే డబ్బులు చెల్లించి రశీదు తీసుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ నినాదంతో అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. కేవలం ఒక్క వరుసలో మాత్రమే నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. ఏపీలోని 43 ఎన్హెచ్ఏఐ టోల్గేట్లలో ఫాస్టాగ్ అమలవుతుంది. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులు, స్థానిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ప్రీ పెయిడ్ పాసులు ఇచ్చి.. ఫాస్టాగ్ విధానంలో రాయితీలు వర్తించేలా ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులిచ్చింది. పలు రకాలుగా రీ చార్జి సదుపాయం: టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ వరుసలో వాహనాలు 25–40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. క్యాష్ లెస్ విధానంలో ఫాస్టాగ్ అమలవుతుంది. ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ల కోసం కేంద్రం 23 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. అమెజాన్, ఫాస్టాగ్ యాప్, పేటీఎం ద్వారా రీ ఛార్జి చేసుకునే సదుపాయం ఉంది. ఇవీ ఉపయోగాలు.. - ఇంధనం, సమయం ఆదా. - కాలుష్యం తగ్గుతుంది. - ట్రాఫిక్ సమస్యలుండవు. - చోరీకి గురైన ఫాస్టాగ్ ఉన్న వాహనం టోల్‌ప్లాజా దాటగానే యజమాని ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. స్టేట్ హైవే టోల్‌ప్లాజాల్లోనూ... జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో తుమ్మలచెరువు వద్ద, సంతమాగులూరు సమీపం లోని ఏల్చూరు, రాజమండ్రి బ్రిడ్జి, పులిగడ్డ వారధి వద్ద ఇలాంటి టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో రెండువైపులా ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాల వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. ఫాస్టాగ్ అంటే..? బ్యాంకు ఖాతాతో అనుసంధానం కలిగి ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ స్టిక్కర్ మీదున్న బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ఐడీ యంత్రం గుర్తించి రీడ్ చేస్తుంది. వాహనం టోల్‌ప్లాజాను దాటుతుండగా టోల్ రుసుమును రీఛార్జి మొత్తం నుంచి మినహాయించుకుంటుంది. ఈ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఏపీలో ఫాస్టాగ్ ద్వారా ప్రస్తుతం 20 నుంచి 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అంచనా. సిబ్బంది కుదింపు?: టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుతో భవిష్యత్తులో సిబ్బంది కుదింపు చర్యలు చేపట్టనున్నట్లు కొంతమంది టోల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని టోల్‌ప్లాజాల్లో సగటున 105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. సరుకు రవాణా సమయం ఆదా టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్ సమస్యతో సమయం, ఇంధనం వృథా అవుతోంది. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఫాస్టాగ్ అమలుతో కొన్ని సమస్యలు తీరినట్లే. – ఈశ్వరరావు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫాస్టాగ్‌కు కేంద్రం సాయం స్టేట్ హైవేస్‌లోని టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుకు రూ.20 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఈ భారం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. – మనోహర్‌రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఎండీ -
కోర్టు దారి ఎటో?
► నగర, గ్రామీణ పరిధిలోకి రహదారులు ► టాస్మాక్‌ల కోసం స్థాయి తగ్గింపు ► కోర్టుకు వ్యవహారం ► వాడివేడిగా వాదనలు సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రెండు వేల కిమీ దూరం మేరకు జాతీయ, రాష్ట్ర రహదారులు నగర, గ్రామీణ రోడ్లుగా మారనున్నాయి. టాస్మాక్ మద్యం దుకాణాల ఏర్పాటు లక్ష్యంగా రోడ్ల స్థాయిని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వ్యవహారం కోర్టుకు చేరడంతో మంగళవారం వాదనలు వాడివేడిగా సాగాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని టాస్మాక్ మద్యం దుకాణాల్ని తొలగించాల్సిందేని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్రంలో మూడు వేలకు పైగా దుకాణాలు మూత పడ్డాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. మరో చోటకు దుకాణాల్ని మార్చే ప్రయత్నాలు సాగుతున్నా, ప్రజల్లో బయలు దేరిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో మాత్రమే దుకాణాలు ఉండ కూడదంటూ కోర్టు ఆదేశించిన దృష్ట్యా, తమ అధికారాల్ని ప్రయోగించి ఆ రహదారుల్ని గ్రామీణ, నగర రోడ్లుగా మార్చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగ్గ ఉత్తర్వుల స్థానిక సంస్థలకు ఇటీవల జారీ అయ్యాయి. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సిద్ధమైంది. డీఎంకే కోర్టును ఆశ్రయించేలోపు తమ పనితనాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగమేఘాలపై స్థానిక సంస్థల నుంచి వివరాలను సేకరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు ఏఏ గ్రామాలు, నగర పరిధిలో ఎన్ని కిలోమీటర్ల దూరం మేరకు ఉన్నాయో వివరాలను సేకరించి. అందుకు తగ్గ కార్యచరణను వేగవంతం చేశారు. మంగళవారం సీఎం కే పళనిస్వామి నేతృత్వంలో మంత్రులు తంగమణి, వేలుమణి, జయకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, రెవెన్యూ, మార్కెటింగ్, నగర, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో కూడిన సమావేశంలో ఈ చర్చ సాగింది.మొత్తంగా 2వేల కిమీ దూరం మేరకు ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్ని ఇక, స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. రెండు వేల కిమీ దూరం : రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో, నగర, మహానగర, పట్టణ, గ్రామ పంచాయతీల మీదుగా 2,193 కీ.మీ దూరం మేరకు రాష్ట్ర, జాతీయ రహదారులు సాగుతున్నట్టు తేల్చారు. ఆయా గ్రామాలు, నగరాల పరిధి, సరిహద్దుల ఆధారంగా ఈ వివరాలను సేకరించారు. ఈ రోడ్ల అభివృద్ధికి రహదారుల శాఖతో పాటు స్థానిక సంస్థలు నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నాయి. ఇక, ఆయా సంస్థల పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ఆయా స్థానిక సంస్థల నిధులు వెచ్చించబోతున్నారు. రహదారుల్ని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఇది వరకు ఉన్న చోట్లే టాస్మాక్ మద్యం దుకాణాలను మళ్లీ పునర్ ప్రారంభించుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తుండడం గమనార్హం. ఆ మేరకు రాజధాని నగరం చెన్నైలోని అన్నా సాలై, పూందమల్లి హైరోడ్డు, జవహర్లాల్రోడ్డు, పరింగి మలై – పూందమల్లి రోడ్డు, పల్లావరం –తురైపాక్కం వంటి రాష్ట్ర రహదారులను కార్పొరేషన్ రోడ్డులుగా మార్చేయనున్నారు. నగరం పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇది వరకు కార్పొరేషన్ రూ. 550 కోట్లు కేటాయిస్తుండగా, రహదారుల శాఖ కేవలం 120 కోట్లు అప్పగించేది. కార్పొరేషన్ అత్యధికంగా నిధుల్ని వెచ్చిస్తున్న దృష్ట్యా, ఇక ఆ రహదారులు నగర రోడ్లుగా మార్చేయనున్నారు. ఈ దిశగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 562 కీ.మీ దూరం మేరకు ఉన్న రహదారులు, నగరæ రోడ్లు గా మార్చేందుకు నిర్ణయించడం గమనించాల్సిన విష యం. ఇక, కొన్ని చోట్ల విస్తరణలో ఉన్న రహదారుల్ని సైతం స్థానిక సంస్థల పరి ధిలోకి తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కోర్టుకు వ్యవహారం: ప్రభుత్వం వేగం పెంచిన దృష్ట్యా, డిఎంకే కోర్టు తలుపుల్ని తట్టింది. డిఎంకే ఎంపి ఆర్ఎస్ భారతీ, న్యాయవాది బాలుల నేతృత్వంలో మంగళవారం రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందరేష్‌లతో కూడిన బెంచ్ ముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు విల్సన్, ఎల్ఎస్ రాజాలు వాదనలు వినిపించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్ని గ్రామీణ, నగర రోడ్లుగా మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. సుప్రీం కోర్టును బురిడీ కొట్టించి, టాస్మాక్ మద్యం దుకాణాల ఏర్పాటు లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫుడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి హాజరై, ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల పరిధిలోని స్థానిక సంస్థల్లో కింద ఉన్న ఈ రోడ్లను విస్తరణ, అభివృద్ధిలో భాగంగా కేంద్రం జాతీయ రహదారులుగా, కొత్త నిబంధనల మేరకు రాష్ట్ర రహదారులుగా మార్చారని వివరించారు. ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఉన్న రహదారులు మాత్రమే రోడ్లుగా మారనున్నాయన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, తొసి పుచ్చాలని పట్టుబట్టారు. అత్యవసర పిటిషన్లు కావడంతో బుధవారం నుంచి విచారణ వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
మద్యం దుకాణాలపై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టవద్దన్న తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 500 మీటర్ల లోపున మద్యం షాపుల్ని నిషేధించామని జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఎల్.నాగేశ్వర రావుల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. మద్యం షాపులు తరలించమని కోరడమంటే రాష్ట్రాల మద్యం పాలసీని ప్రభావితం చేయడం కాదని, జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాల దూరానికి సంబంధించిన అంశం మాత్రమేనని ధర్మాసనం పేర్కొంది. జాతీయ రహదారులపై తాగి నడపడానికి స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. -
ఇక కాంక్రీట్ రోడ్లే!
కంపెనీల నుంచి తక్కువ ధరకు సిమెంట్ దేశవ్యాప్తంగా ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం అందులో భాగంగానే రాష్ట్రానికీ రాయితీ సిమెంట్ త్వరలో ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందం సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో దర్జాగా కనిపించే కాంక్రీట్ రోడ్లు త్వరలో మన రాష్ట్రంలో కూడా కనిపించబోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా చేపట్టే జాతీయ రహదారులను సిమెంట్‌తో నిర్మించనున్నట్లు కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర రహదారుల విషయంలోనూ అదే మార్గాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు కొన్ని చోట్లే కనిపించిన కాంక్రీట్ రోడ్లు ఇకపై విస్తృతం కానున్నాయి. తారు రోడ్లతో పోల్చితే సిమెంటు రోడ్ల నిర్మాణానికి 15 నుంచి 20 శాతం వరకు అధిక వ్యయమవుతుంది. కానీ నేరుగా సిమెంటు కంపెనీల నుంచే తక్కువ ధరకు సిమెంటును పొందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు రాయితీ రేట్లకు సిమెంట్‌ను అందించేలా ఆయా కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చే రాష్ట్రాలకు కూడా అదే ధరకు సిమెంట్‌ను అందజేస్తామని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ర్ట ప్రభుత్వం.. తెలంగాణలో కొత్తగా భారీ స్థాయిలో నిర్మించనున్న రోడ్లలో ముఖ్యమైన వాటిని సిమెంట్ డిజైన్లోకి మార్చాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నితిన్ గడ్కారీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ర్టంలో నిర్మించనున్న కాంక్రీట్ రోడ్ల వివరాలతో నివేదికను అందజేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం రాష్ర్ట యంత్రాంగం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో బ్యాగుపై రూ. 100 ఆదా రోడ్లు, వంతెనలు నిర్మించే కాంట్రాక్టర్లు, సిమెంటు కంపెనీల మధ్య అనుసంధానం కోసం ఇటీవల కేంద్రం ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సిమెంటు తయారీదారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి నేరుగా రోడ్ల నిర్మాణదారులకు సిమెంట్‌ను తక్కువ ధరకు పంపిణీ చేయాలని సూచించింది. దీనికి తయారీదారులు కూడా అంగీకరించారు. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో ధరను కోట్ చేయనుంది. ఇలా ఈ ఒప్పందం పరిధిలో దాదాపు 101 కంపెనీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వెరసి హీనపక్షంగా మార్కెట్ ధర కంటే ప్రతి బస్తాపై రూ.100 వరకు రాయితీ ఉంటుందని అంచనా. ఫలితంగా తారు రోడ్డు నిర్మాణానికయ్యే వ్యయం కంటే సిమెంట్ రోడ్డు నిర్మాణ వ్యయం మరీ ఎక్కువయ్యే అవకాశం లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై ఖర్చు తక్కువే... రాష్ట్రంలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిర్మించే రోడ్లకు తారు పొరలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వ్యయం అధికంగా ఉంటోం ది. కానీ కాంక్రీట్ రోడ్లకు అదనంగా పొరలు నిర్మించాల్సిన అవసరం ఉండదు. అంటే తారు పొరలు ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఇంచుమించు సిమెంటు రోడ్డు వ్యయానికి సమానంగా ఖర్చవుతోంది. అలాంటి చోట్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తే అదనంగా అయ్యే వ్యయం పెద్దగా ఉండదు. దీంతో అలాంటి రోడ్లను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 6 వేల కోట్లతో రోడ్లు, వంతెనలను నిర్మించబోతున్నారు. వీటికి వీలైనంత మేర రాయితీ ధరలకు సిమెంటును నేరుగా కంపెనీల నుంచి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం నుంచి తెలుసుకునేందుకు త్వరలో ఓ ఉన్నత స్థాయిబృందాన్ని ఢిల్లీకి పంపుతోంది.