సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారుల మీదుగా పారే వాగులు, వంకలపై కొత్తగా 300 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల్లో వెంటనే వంతెనలు నిర్మించి వరద పారేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని, లేకుంటే రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఇటీవల అధికారులు నివేదిక సమర్పించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో అధికారులు సర్వే చేసి 300 ప్రాంతాల్లో వంతెనలు అవసరమని తేల్చారు. ఇప్పుడు వాటిల్లో 150 వంతెనల పనులను ప్రారంభించి వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు.
10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో..
పంచాయతీ రోడ్లు పోను రాష్ట్ర స్థాయి రోడ్ల నిడివి 28 వేల కిలోమీటర్ల మేర ఉంది. వాటిల్లో కొన్ని చోట్లే వంతెనలు ఉన్నాయి. మిగతా చోట్ల పాత కల్వర్టులు, పాత బ్రిడ్జీలకే మరమ్మతులు చేస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. గత రెండేళ్లలో వరదలకు 133 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. వాగులు పారే మరో 167 చోట్ల వంతెనలు లేవు.
వర్షాకాలంలో ఆ రోడ్ల మీదుగానే వరద పారుతోంది. ఈ ప్రాంతాల్లో రూ. 635 కోట్లతో వంతెనలు నిర్మించనున్నారు. 10 మీటర్ల నుంచి 50 మీటర్ల నిడివితో వాటిని ఎత్తుగా నిర్మించనున్నారు. గత పదేళ్లలో వరదనీరు ఆయా ప్రాంతాల్లో ఎంత ఎత్తు, ఎంత వెడల్పుతో ప్రవహించిందన్న వివరాలను సేకరించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో వంతెనల పొడవు, ఎత్తు నిర్ధారించారు.
ప్రారంభమైన పునరుద్ధరణ పనులు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి రాష్ట్ర రహదారులకు కాలానుగుణ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 వేల కి.మీ. నిడివిగల రోడ్లను పటిష్టపరిచేలా మరమ్మతులు చేపట్టనున్నారు. వాటిని 1,187 పనులుగా విభజించగా ఇందులో ఇప్పటికే 126 పనులు పూర్తి చేశారు. మిగతా వాటిల్లో 173 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 474 పనులు టెండర్లు పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతావాటికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ మరమ్మతులకు రూ. 1,700 కోట్లు ఖర్చు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment