15 రోడ్లు అప్‌గ్రేడ్‌ చేయండి State R and B Minister Komatireddy request to Nitin Gadkari | Sakshi
Sakshi News home page

15 రోడ్లు అప్‌గ్రేడ్‌ చేయండి

Published Fri, Feb 2 2024 4:01 AM

State R and B Minister Komatireddy request to Nitin Gadkari - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామి క కారిడార్లు, పర్యాటక, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన భేటీలో వినతిపత్రం సమర్పించారు.

ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి గుర్తుచేశారు. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024–25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు.  

మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్లు(780కి.మీ) 
♦ చౌటుప్పల్‌–(ఎన్‌హెచ్‌65)–ఆమనగల్లు–షాద్‌నగర్‌ –సంగారెడ్డి (ఎన్‌హెచ్‌65) 182 కి.మీ  
♦ మరికల్‌ (ఎన్‌హెచ్‌167)– నారాయటపేట–రామసముద్రం (ఎన్‌హెచ్‌150) 63 కి.మీ
♦ పెద్దపల్లి (ఎస్‌హెచ్‌1)– కాటారం (ఎన్‌హెచ్‌353సి) 66 కి.మీ
♦ పుల్లూరు (ఎన్‌హెచ్‌44)–అలంపూర్‌–జెట్‌ప్రోల్‌–పెంట్లవెల్లి–కొల్లాపూర్‌–లింగాల–అచ్చంపేట– డిండి (ఎన్‌హెచ్‌765)–దేవరకొండ(ఎన్‌హెచ్‌176)–మల్లేపల్లి (ఎన్‌హెచ్‌167)– నల్లగొండ (ఎన్‌హెచ్‌–565) 225 కి.మీ 
♦ వనపర్తి –కొత్తకోట–గద్వాల – మంత్రాలయం (ఎన్‌హెచ్‌167) 110 కి.మీ
♦ మన్నెగూడ (ఎన్‌హెచ్‌163)–వికారాబాద్‌–తాండూరు–జహీరాబాద్‌–బీదర్‌ (ఎన్‌హెచ్‌–50) 134 కి.మీ  

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి 
భారతమాల పథకం ఫేజ్‌–1లో భాగంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి–నర్సాపూర్‌–తూప్రాన్‌–చౌటుప్పల్‌‘) గ్రీన్‌ ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ మాత్రమే మంజూరై ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోందని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. కాగా దక్షిణభాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు.  

నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు హై దరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌65) పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దీని ఏర్పాటుకు రూ.65 కోట్లు వన్‌ టైం గ్రాంట్‌ క్రింద మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్‌పోర్ట్‌ ఫీల్డ్‌లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని కోమటిరెడ్డి అన్నారు.

మంత్రి వెంట తాండూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు బి.మనోహర్‌రెడ్డి, జనంపల్లి అనిరుద్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ డా.గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement