
సాధారణంగా చాలామందికి నిర్ణీత గడువు తర్వాత టోల్‌ప్లాజాలను మారుస్తారు లేదా తొలగిస్తారనే అపోహ ఉంది. కానీ దానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారుల రుసుముల నిబంధనలు-2008 ప్రకారం.. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత మూలధన వ్యయాన్ని రికవరీ చేశాక టోల్ ప్లాజాలను తొలగించాలనే ఎలాంటి నిబంధనా లేదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
దేశంలోని జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన ఏ ఒక్క టోల్ ప్లాజాలోనూ ఇప్పటివరకు మూలధన వ్యయాన్ని పూర్తిగా రికవరీ చేయలేదని గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తాయి.
రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది.
ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..?
మరోవైపు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానునట్లు గడ్కరీ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment