సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లలో ఇన్‌సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంఘం కీలక సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇన్‌సర్వీస్ కోటా సీట్లను సాధించేందుకు పోరాటం చేయాలని పిలుపు ఇవ్వనున్నారు. ఢిల్లీ వెళ్లి ఎంపీలను, ఇతర కేంద్ర పెద్దలను కలసి విన్నవించాలని తీర్మానించాలని భావిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సమావేశంలో ఈ ప్రాంత డాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపైనా చర్చించే అవకాశముంది.
‘నీట్’తో కోటాకు టాటా..
రాష్ట్రాల్లో పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్‌సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అయితే నీట్ పరీక్షలతో ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ కోటాను రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు.
సుప్రీం కోర్టులో పిటిషన్..
ఇన్‌సర్వీస్ కోటా రద్దుపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం ఎంసీఐ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్‌సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకురారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఘ ప్రతినిధులను సంఘటితం చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మెడికల్ పీజీ కోటాపై డాక్టర్ల పోరాటం
Published Sun, Dec 30 2018 2:01 AM | Last Updated on Sun, Dec 30 2018 2:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment