nujiveedu IIIT
-
నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోరీ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. క్యాంపస్‌లో ఉన్న ఓ1 బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో దొంగలు పడి బంగారు ఆభరణాలను, వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లారు. గడులను తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు ప్లాట్లోని బీరువాలు, కప్‌బోర్డులు తెరిచి వాటిల్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ఈ క్వార్టర్లో సీఎస్ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బి.పద్మ కుటుంబం నివాసముంటోంది.ఆమెకు వారం రోజులుగా డెంగీ జ్వరం కావడంతో నూజివీడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఆమెకు తోడుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ ఘటనలో రూ.1.95 లక్షల నగదు, రెండు కాసుల బంగారం వస్తువులు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫ్లాట్ నం.203లో కూడా చోరీ జరిగింది. అయితే ఆ కుటుంబం ఊరినుంచి వస్తే గానీ ఏమేమి చోరీకి గురయ్యాయో తెలియదు. ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన 16 ఏళ్లల్లో తొలిసారిగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో బ్లాక్‌లో ఉన్న మిగిలిన ఫ్లాట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌లో 8వేల మంది విద్యార్థులు, వెయ్యిమంది ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఉంటున్నారు.ప్రతి షిప్టులో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా చోరీ జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా, సెక్యూరిటీ పాయింట్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సరిహద్దుల వద్ద కాకుండా ఎక్కడో ఏర్పాటు చేయడం గమనార్హం. -
ట్రిపుల్ ఐటీలకు 38,100 దరఖాస్తులు
నూజివీడు(ఏలూరు): రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం 38,100 దరఖాస్తులు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని పేర్కొన్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా మరో 100 సీట్లు కలిపి 1100 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 13న ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించి మార్కులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించనున్నారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
విదేశాల్లో మెరిసే..నూజివీడు మురిసె
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు అయిన ట్రిపుల్ ఐటీల్లో వికసించిన విద్యాకుసుమాలు నేడు ఖండాంతరాల్లో పరిమళాలు వెదజల్లుతున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌కు చెందిన కొల్లి మీనాకుమారి కూడా ఈ కోవకు చెందిన యువతే. పరదేశంలో తెలుగునేల గొప్పతనం చాటుతోంది. జర్మనీలో యువ సైంటిస్టుగా రాణిస్తూ, పుట్టిన గడ్డకు.. చదువు నేర్పిన విద్యా సంస్థకు పేరుతెస్తోంది. సాక్షి, నూజివీడు(విజయవాడ) : నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని తన ప్రతిభతో జర్మనీలోని ఫిలిప్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ సత్తా చాటుతోంది. తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన కొల్లి మీనాకుమారి స్వగ్రామం విజయనగరం జిల్లా కామన్నవలస. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చివరి అమ్మాయి అయిన మీనాకుమారి తొలి నుంచి చదువులో ముందుండేది. బాడంగి హైస్కూల్లో పదో తరగతి చదివి మెరుగైన మార్కులు తెచ్చుకోవడంతో ట్రిపుల్ ఐటీ సీటును సాధించింది. గేట్లో ర్యాంక్ తెచ్చుకొని.. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి గేట్ రాయగా వరంగల్‌లోని నిట్‌లో సీటు లభించింది. అక్కడ చేరి రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ విభాగంలో 2015–17 ఏడాదిలో ఎంటెక్ పూర్తిచేసింది. ఈ విభాగంలో వస్తున్న నూతన మార్పులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంది. అనంతరం డెహ్రాడూన్‌లోని ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేసింది. ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేస్తుండగానే జర్మనీలో, థాయ్‌లాండ్‌లో పీహెచ్డీ చేసేందుకు అవకాశాలు వచ్చాయి. జపాన్ ప్రభుత్వ ఉపకార వేతనంతో థాయిలాండ్‌లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏఐటీ)లో పరిశోధన చేయడానికి ఎంపికైంది. ప్రస్తుతం ఫిలిప్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ ట్రిపుల్ ఐటీ ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటుతోంది. ఆమె చేసిన పీహెచ్డీ పరిశోధకు మార్బర్గ్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ పురస్కారం సైతం లభించింది. గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం. ట్రిపుల్ ఐటీలే లేకుంటే వేలాది మంది విద్యార్థులు నేడు ఉన్న గొప్ప గొప్ప స్థాయిల్లో ఉండేవారే కాదు. లక్షలాది రూపాయల ఫీజులు కట్టి చదివించే స్థోమత లేని నిరుపేద, పేద వర్గాల పిల్లలే ఇందులో చదువుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మరింత పదును పెట్టడంలో ట్రిపుల్ ఐటీలు ఎంతో దోహదపడుతున్నాయి. – కొల్లి మీనాకుమారి -
నేటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
నూజివీడు : ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అడ్మిషన్ల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌన్సెలింగ్‌ను ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ డాక్టర్ ఇబ్ర హీంఖాన్ పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, తెలంగాణలోని బాసరలలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,807మందిని ఎంపిక చేసిన ఆర్జీయూకేటీ అధికారులు ఈ నెల ఏడో తేదీన ప్రకటించారు. మొత్తం ఎంపికైన వారిలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి 936 మందిని కేటాయించారు. ట్రిపుల్ ఐటీలకు కృష్ణా జిల్లా నుంచి 153 మంది ఎంపికయ్యారు. తొలి రోజు 500 మందికి కౌన్సెలింగ్ స్థానిక ట్రిపుల్ ఐటీలో బుధవారం 500 మందికి, గురువారం 436 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యార్థులకు కాల్‌లెటర్లు పంపారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 12 కౌంటర్లను ఏర్పాటుచేశారు. విధుల నిర్వహణ కోసం 70 మంది సిబ్బందిని, మరో 35 మంది వాలంటీర్లను నియ మించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తారు. విద్యార్థులతోపాటు వచ్చేవారికి రూ.30లకు భోజనం అందిస్తారు. 28 నుంచి తరగతుల ప్రారంభం ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థుల స్థానంలో వెయిటింగ్‌లిస్టులో ఉన్నవారిని పిలుస్తారు. సీటు కేటాయించిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,500, జనరల్ విద్యార్థులు రూ.3వేలు చొప్పున చెల్లించాలి.