రూ.1.95 లక్షల నగదు, బంగారు, వెండి వస్తువుల అపహరణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. క్యాంపస్‌లో ఉన్న ఓ1 బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో దొంగలు పడి బంగారు ఆభరణాలను, వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లారు. గడులను తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు ప్లాట్‌లోని బీరువాలు, కప్‌బోర్డులు తెరిచి వాటిల్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ఈ క్వార్టర్‌లో సీఎస్‌ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బి.పద్మ కుటుంబం నివాసముంటోంది.
ఆమెకు వారం రోజులుగా డెంగీ జ్వరం కావడంతో నూజివీడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఆమెకు తోడుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ ఘటనలో రూ.1.95 లక్షల నగదు, రెండు కాసుల బంగారం వస్తువులు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫ్లాట్ నం.203లో కూడా చోరీ జరిగింది. అయితే ఆ కుటుంబం ఊరినుంచి వస్తే గానీ ఏమేమి చోరీకి గురయ్యాయో తెలియదు.
ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేసిన 16 ఏళ్లల్లో తొలిసారిగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో బ్లాక్‌లో ఉన్న మిగిలిన ఫ్లాట్‌ల వారు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌లో 8వేల మంది విద్యార్థులు, వెయ్యిమంది ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఉంటున్నారు.
ప్రతి షిప్టులో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా చోరీ జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా, సెక్యూరిటీ పాయింట్‌లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సరిహద్దుల వద్ద కాకుండా ఎక్కడో ఏర్పాటు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment