జగనన్న కాలనీలో ఇసుక దొంగతనం కేసులో ఆయన అనుచరులపైనే కేసు
నిందితుల్లో ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్
వారిని తప్పించేందుకు రెండు రోజులుగా మంత్రి ప్రయత్నాలు
వైఎస్సార్‌సీపీపై చోరీ నెపాన్ని వేసిన మంత్రి
ఆ కొద్దిసేపటికే ఆయన అనుచరులపైనే కేసు పెట్టిన అధికారులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది.
మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్.సుధాసాగర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది.
ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్‌ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి.
ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్‌పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment