ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
అక్కడికక్కడే ఇద్దరి మృతి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
వాహనాన్ని 100 మీటర్లు ఈడ్చుకుపోయిన లారీ
కృష్ణా జిల్లా పెడన సమీపంలో ఘటన
మృతులు ముగ్గురూ పెయింటింగ్ వర్కర్లే
ఆ కుటుంబాలకు వారే ఆధారం
పెడన: కృష్ణా జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తమూరు దళితవాడకు చెందిన పాపవర్తి శాంతరాజు (26)తోపాటు బాపట్ల విజయచందర్ (40), పీతల అజయ్ (24) పెయింటింగ్ పనికోసం గురువారం ఉదయం మచిలీపట్నం వెళ్లారు.
పని ముగించుకుని సాయంత్రం ముగ్గురూ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. పెడన సమీపంలోని పెడన– బంటుమిల్లి బైపాస్ రోడ్డులో వస్తుండగా మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు రాంగ్ రూట్‌లో వచ్చి, శాంతరాజు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దాదాపు వంద మీటర్ల దూరం బైక్‌ను ఈడ్చుకుపోయింది. విజయచందర్, శాంతరాజు, అజయ్ రోడ్డుపై పడిపోయారు.
విజయచందర్, శాంతరాజు అక్కడిక్కడే చనిపోగా అజయ్‌ను మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పుప్పాల పవన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ కుటుంబాలకు వారే ఆధారం
మృతులు పెయింటింగ్ పనులు చేసి రోజువారీ కూలీతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరు ముగ్గురి మృతితో ఆ కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. బాపట్ల విజయచందర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. వీరు పది, ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు.
ఆ కుటుంబానికి దిక్కు విజయచందరే. శాంతరాజుకు తండ్రి లేడు. అన్న, శాంతరాజు సంపాదిస్తూ ఆఖరి తమ్ముడ్ని చదివించుకుంటున్నారు. పీతల అజయ్‌కి కూడా తండ్రి లేడు. సోదరుడితో కలిసి పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment