సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు అపహరణ
ఫిబ్రవరి 7న వివాహం నిశ్చయం
అంతలోనే పెళ్లి కుమార్తె ఇంట్లో సొమ్మంతా లూటీ
అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు.
ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్‌లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు.
ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్‌లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.
మరో రెండు ఇళ్లలోనూ చోరీ
కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment