wedding house
-
పెళ్లివారింట విషాదం
అంబాజీపేట (పి.గన్నవరం): బంధువులు.. స్నేహితులతో కళకళాడాల్సిన పెళ్లి వారింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నెల 9న నిర్వహించే వివాహానికి సంబంధించి పెళ్లి కొడుకును చేసే సమయంలో బాజభజంత్రీలతో మార్మోగాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన పోచిరాజు శేషగిరిరావు, లక్ష్మి దంపతులు తూర్పుగోదావరి జిల్లా, అంబాజీపేటలో ఉంటున్న తమ బావ సూర్యనారాయణ మనవడి వివాహానికి హాజరయ్యేందుకు ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. కొత్తపేట మండలం, మోడేకుర్రు సమీపంలో ఐషర్ వ్యాన్‌ను వీరు ప్రయాణిస్తున్న వ్యాగనార్ కారు బలంగా ఢీ కొట్టడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమలాపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియడంతో పెళ్లివారి ఇళ్లు శోకసముద్రంలో మునిగిపోయాయి. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన శేషగిరిరావు హైకోర్టులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. వనస్థలిపురంలో ఉంటున్నారు. -
పెళ్లింట విషాదం!
ఆ ఇంట్లో నాలుగు రోజుల క్రితం వివాహ వేడుక ఘనంగా జరిగింది. సోమవారం తిరుగు పెళ్లి కూడా బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య సాగింది. అంతలోనే పెళ్లి వేడుకలో విషాదం. విద్యుత్ స్తంభం రూపంలో మృత్యువు తోడల్లుళ్లను కబళించింది. పెళ్లింట రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటన బుధవారం ఆదోని మండలం కపటి గ్రామంలో చోటు చేసుకుంది. ఆదోని: పట్టణంలోని రాయనగర్‌కు చెందిన దిలీప్, కపటి గ్రామానికి చెందిన బాలరాజు తోడల్లుళ్లు. కపటిలో ఆదివారం జరిగిన బావమరిది సురేష్ పెళ్లిలో అంతా తామై వ్యవహరించారు. బావ మరిది పెళ్లి ఘనంగా చేశారు. మరుసటి రోజు సోమవారం వధువు ఇంట కోసిగిలో తిరుగు పెళ్లిని కూడా ముగించుకుని అదే రోజు రాత్రి తిరిగి కపటికి చేరుకున్నారు. బుధవారం..బావమరిది ఇంటికి సమీపంలో విద్యుత్ స్తంభం పాతేందుకు సిద్ధం అయ్యారు. తాళ్ల సాయంతో కొందరు స్తంభాన్ని పైకి లేపి నిలబెట్టగా బాలరాజు, దిలీప్ గడ్డపారతో దానిని గుంతలోకి నెడుతున్నారు. అయితే పైన ఓ సెల్ టవర్ కోసం లాగిన విద్యుత్ లైన్ స్తంభానికి తాకి.. ఇనుప చువ్వల ద్వారా విద్యుత్తు ప్రవహించింది. దీంతో గడ్డపార పట్టుకున్న బాలరాజు, దిలీప్ గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోయారు. మిగతా వారు గమనించి స్తంభాన్ని నేలమీద పడేసి...బాలరాజు(28), దిలీప్(30)ని దూరంగా లాగి, వెంటనే ఆటోలో ఆదోని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతదేహాలను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. బాలరాజుకు భార్య ఏసుకుమారి, ఇద్దరు పిల్లలు, దిలీప్‌కు భార్య ఎలంగిమాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనా? విద్యుత్ లేన్ తమ ఇంటికి దూరంగా ఉందని, తమ ఇంటికి సమీపంలోనే మరో స్తంభం ఏర్పాటు చేయాలని చాలా సార్లు విద్యుత్తు అధికారులు, సిబ్బందికి సురేష్ విన్నవించుకున్నారు. అయితే ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. గాలి, వాన సమయంలో సర్వీసు వైరు తెగి పడితే ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని భయపడిన సురేష్ కుటుంబ సభ్యులు ఎక్కడో వృథాగా పడి ఉన్న పాత విద్యుత్తు స్తంభాన్ని తీసుకు వచ్చి ఇంటి వద్ద వేసుకున్నారు. స్వంతంగా అయినా దానిని ఏర్పాటు చేసుకోవానుకున్నట్లు తెలుస్తోంది. సరైన అవగాహన లేక పోవడంతో సిమెంట్ పెచ్చులూడి, ఇనుప చువ్వలు తేలిన స్తంభాన్ని పాతేందుకు చేసిన ప్రయత్నంలోనే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. అధికారులు స్పందించి ఉంటే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యేవి కాదని గ్రామ మాజీ సర్పంచ్ రాజు, మృతుల బంధువు చిన్నప్ప, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు విద్యుత్ అధికారులే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. మా నిర్లక్ష్యం లేదు కపటి ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెప్పడం అన్యాయం. ఇంటి వద్ద విద్యుత్ స్తంభం అవసరాన్ని మా దృష్టికి తీసుకు రాలేదు. సిబ్బందికి చెప్పారో లేదో నాకు తెలియదు. సిబ్బంది సానుకూలంగా స్పందించకుంటే ఏఈ, ఏడీఈ, డీఈ దృష్టికి తీసుకురావాలి. ఎక్కడో తెచ్చుకున్న స్తంభాన్ని స్వంతంగా పాతుకోకూడదు. కనీసం మా దృష్టికి తెచ్చినా ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆర్థిక సాయం అందిస్తాం. ఈ విషయమై ఉన్నత స్థాయిలోనే అ«ధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.–ఖలీల్ బాబు, ఆదోని ఏడీఈ -
జల్లూరులో పెళ్లింట చోరీ
పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం జల్లూరులో ఓ పెళ్లి ఇంట చోరీ జరిగింది. బీరువాను పగలకొట్టి రూ.రెండు లక్షల నగదు, బంగారు, వెండి వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితులు చెప్పారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రోడ్డులో జల్లూరు రామాలయం సమీపంలో నివసిస్తున్న బత్తిన సూరిబాబు మేనకోడలు వివాహం నిమిత్తం కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి అన్నవరం వెళ్లారు. పెళ్లి ముగించుకుని ఉదయం ఇంటికి చేరుకునే సరికి ఇంటి రెండు గదుల తలుపులు తెరిచి, బీరువాలు పగలకొట్టి చోరీ చేసినట్టుగా గుర్తించారు. ఈ మేరకు పిఠాపురం రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై పీవీఆర్ మూర్తి, కూŠల్స్ టీమ్ ఎస్సై ప్రశాంతి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. బీరువాల్లోని రూ.రెండు లక్షల నగదు, 12 తులాల వెండి వస్తువులు, కాసున్నర బంగారపు వస్తువులు చోరీకి గురైనట్టు సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లి ఇంట్లో బంగారం చోరీ
తిమ్మాజిపేట (నాగర్‌కర్నూల్): పెళ్లి కోసం తెచ్చి ఇంట్లో దాచిన బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన మండలంలోని కోడుపర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడు రాందేవ్‌రెడ్డికి గురువారం జడ్చర్లలోని ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో సహా సొంత గ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి శ్రీనివాసరెడ్డి కూతురు కల్పన తన నగలతోపాటు అత్తగారి బంధువులకు సంబంధించిన నగలను సూట్‌కేస్ బ్యాగులో దాచి పెట్టి ఇంటిపైన నిద్రించారు. ఉదయం లేచి గదిలో చూడగా సూట్‌కేస్ బ్యాగును కోసి అందులోని 24 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు గమనించారు. శుక్రవారం బంగారం చోరీకి గురైనట్లు తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎస్పీ కోడుపర్తిలో పెళ్లి ఇంట్లో 24 తులాల బంగారం అపహరణకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ విచారణ చేపట్టారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. బంగారు నగలు ఎలా అపహరణకు గురయ్యాయో ఫిర్యాదుదారు కల్పనను అడిగి తెలుసుకున్నారు. తన నగలతోపాటు బంధువుల నగలను సూట్‌కేసులో ఉంచి తాను మేడపైన నిద్రించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం లేచి చూసేసరికి నగలు లేవన్నారు. దీంతో ఎస్పీ గురువారం రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరిగారు.. ఇంట్లో నిద్రించిన బంధువుల వివరాలు సీఐ చేత నమోదు చేయించుకున్నారు. ప్రాథమికంగా నగలు ఎవరు అపహరించింది గుర్తించలేదని, త్వరలో నగలు దొంగిలించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. -
పెళ్లింట‘అకాల’ విషాదం
మరో మూడురోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగేవి.. ఇప్పటికే ఆడపడుచుల కుటుంబ సభ్యుల రాక.. దగ్గరి బంధువుల కోలాహలం.. వివాహ మహోత్సవానికి చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు.. పిల్లల కేరింతలు ఇలా ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉంది. ఇంతలోనే విధి ఆ కుటుంబంపై కన్నెర్రజేసింది.. మృత్యువు విద్యుత్ రూపంలో మామాఅల్లుడిని కబళించగా.. మరో నలుగురిని గాయాలపాల్జేసి.. పెళ్లింట పెను విషాదాన్ని నింపింది. అర్వపల్లి (తుంగతుర్తి) : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి బాసపోలు సత్యనారాయణ(54), పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు ఇప్పటికే చేశారు. కాగా కుమారుడు ఉపేందర్ వివా హం ఈనెల 12న నిశ్చయమైంది. పెళ్లి పత్రికలు కొట్టించి పంచారు. పెళ్లికి కావాల్సిన సరుకులు తెచ్చిపెట్టుకున్నారు. ఈనెల 11న ఉపేందర్‌ను పెళ్లి కుమారుడి చేసి 12న వివాహం జరగనుంది. జనగామ జిల్లా దేవరప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మౌనికతో వివాహం కుదిరింది. అయితే ఈ వివాహం వధువు ఇంట్లో జరగనుండగా వరుడి ఇంట్లో పెళ్లి కుమారుడిని చేయడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆదివారం రాత్రే ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు పెళ్లి వేడుకలకు కొమ్మాలకు వచ్చారు. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సి ఉండగా.. పెళ్లి వేడుకలతో ఆ ఇల్లు కళకళలాడాల్సి ఉండగా ఒక్కసారిగా జరిగిన అనుకోని ప్రమాదంతో విషాదం అలుముకుంది. పెళ్లికి ముందే వచ్చిన బంధువులంతా దు:ఖ సాగరంలో మునిగిపోయారు ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టించింది. ఇద్దరు అల్లుళ్లది జనగామ జిల్లానే.. సత్యనారాయణ పెద్ద కుమార్తె ఉమను జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన గవాని శోభన్‌బాబుతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు చరణ్‌తేజ ఉన్నారు. రెండో కుతురు నవనీతను ఇదే జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరికి చెందిన సురపు వెంకటష్తో వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. కొమ్మాలలో విషాదఛాయలు సత్యనారాయణ ఇంట్లో మారో రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లికి ముందు అనుకోని ఘటనతో మామ, అల్లుళ్లు ఒకేసారి మరణించడం, కుటుంబ సభ్యులు నలుగురు గాయడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చూసిన గ్రామస్తులు బోరున విలపించారు. ఎక్కడి మృతదేహాలు అక్కడికే.. విద్యుదాఘాతంతో మరణించిన బాసపోలు సత్యనారాయణ, ఆయన అల్లుడు శోభన్‌బాబుల మృతదేహాలకు తుంగతుర్తి ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. అనంతరం మామ మృతదేహాన్ని కొమ్మాలకు, అల్లుడి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జనగామ జిల్లా రామవరం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. అయితే వేర్వేరుగా జిల్లాల్లో అంత్యక్రియలు జరగడంతో బంధువులు ఎటు వెళ్లాలి.. ఎవరి అంత్యక్రియల్లో పాల్గొనాలో అర్థంకాక దు:ఖసాగరంలో మునిగారు. పెద్ద కూతురు పద్మ ఇటు భర్త చనిపోవడంతో ఇది జీర్ణించుకోలేక అటు తండ్రి అంత్యక్రియకు వెళ్లలేక దేవుడా నాపై ఇంత కక్ష ఎందుకు అంటూ బోరున విలపించడం పలువురిని కంటతడిపెట్టించింది. కాగా ఉపేందర్‌కు పిల్లనిచ్చే అత్తింటి వారు కూడా నాబిడ్డ జీవితం ఇలా అయిపోందని విలపించారు. ఎస్సై మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరండా రేకులు సరిచేస్తుండగా.. వారం రోజుల కిందట వచ్చిన ఈదురుగాలు లు, అకాల వర్షానికి సత్యనారాయణ ఇంటి వరండా రేకులు చెల్లాచెదురయ్యాయి. కాగా వాటిని సోమవారం అల్లుళ్లతో కలిసి సత్యనారాయణ సరిచేస్తున్నాడు. ఈదురుగాలులకు మళ్లీ రేకులు లేవకుండా జేవైరును సత్యనారాయణ, ఆయన పెద్దల్లుడు గవాని శోభన్‌బాబు (32) గట్టిగా గుంజి కడుతున్నారు. అయితే జేవైరు కిందనే ఉన్న కరెంటు సర్వీసు వైరు రేకుకు తగిలి తెగింది. ఈక్రమంలో జేవైరుకు కరెంటు సరఫరా అయి విద్యాదాఘాతంతో సత్యనారాయణ, శోభన్‌బాబు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే వీరిని కాపాడబోయిన సత్యనారాయణ భార్య పద్మ, చిన్నల్లుడు సురపు వెంకటేష్, పెళ్లి కుమారుడు ఉపేందర్ వారి బంధువు అయిన బాసపోలు విజయ్ గాయపడ్డారు. వీరు కరెంటు షాక్‌తో కేకలు వేస్తుండగా గ్రామానికి చెందిన మందడి పిచ్చిరెడ్డి వచ్చి సర్వీసు వైరును గుంజి పక్కకు వేసి నలుగురి ప్రాణాలు కాడారు. ఈ ప్రమాదంలో మరణిం చిన పెద్దల్లుడు శోభన్‌బాబుది జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామం. ఈయన ఇదే జిల్లాలోని దేవరుప్పలలో ప్రైవేట్ పాఠశాల స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గాయపడిన చిన్నల్లుడు సురపు వెంకన్నది ఇదే జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి స్వగ్రామం. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున సాయం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి సాయం అందించనున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ చెప్పారు. సోమవారం సంఘటనాస్థలిని సందర్శించి సత్యనారాయణ, శోభన్‌బాబుల మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పెళ్లింటో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సాయం త్వరగా అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్, సర్పంచ్ కుంట్ల సురేందర్‌రెడ్డి, మాదం వీరారెడ్డి, కె.సైదులు, శిగ రంజిత్, బి.ప్రవీణ్,గడ్డం వెంకన్న, ధర్మాజి, చిర్రబోయిన వెంకన్న,ఎస్.శ్రీనివాస్, లక్ష్మణ్, నాగులు, కేఎస్‌రెడ్డి, అర్జున్ ఉన్నారు. -
పెళ్లింట విషాదం
పచ్చని తోరణం..బంధు, మిత్రుల సంబరం..మేళతాళాలు, డప్పువాయిద్యాలతో అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి ఇంట ఉన్నట్లుండి విషాదం చోటు చేసుకుంది. తన చెల్లెలి వివాహ వేడుకకు తెచ్చిన సప్లయర్స్ సామాన్లు తిరిగి ఇచ్చేందుకు ఎడ్లబండిపై వెళుతుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో పెళ్లికుమార్తె సోదరుడు మృతి చెందిన ఘటన ఆదివారం పులగుట్టపల్లి చిన్న తండాలో జరిగింది. – గుంతకల్లు రూరల్ గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి చిన్నతండాకు చెందిన వాలేనాయక్, తిప్పమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మూడో కుమారుడైన శంకర్‌నాయక్(30)కు నాగవేణితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో వాలేనాయక్ చివరి సంతానమైన లక్ష్మీబాయి వివాహం ఆదివారం గ్రామంలో ఘనంగా జరిపించారు. పెళ్లి వేడుకకు తెచ్చిన సప్లయర్ సామగ్రిని తిరిగి అప్పజెప్పేందుకు శంకర్‌నాయక్ ఎడ్లబండిలో వేసుకుని బయల్దేరాడు. మార్గంమధ్యలో అనుకోకుండా బెదిరిన ఎద్దులు ఉన్నపళంగా పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. దీంతో సప్లయర్ సామగ్రితో నిండుగా ఉన్న ఎద్దుల బండి ఒక్కసారిగా తిరగబడింది. సప్లయర్స్ సామగ్రి మొత్తం అతడిపై పడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు.దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లింట్లో విషాదం
హైదరాబాద్: ఓ పెళ్లి ఇంట్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి ముగించుకుని గుంటూరు నుంచి నగరానికి గురువారం అర్ధరాత్రి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెలితే .... కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, అరుణకుమారి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్దకుమారుడు వినయ్ చైతన్య వివాహం గురువారం స్వస్థలం గుంటూరు జిల్లాలో నిర్వహించారు. వివాహ వేడుకలు అన్ని పూర్తిచేసుకుని అర్ధరాత్రి గుంటూరు నుండి నగరానికి బయలుదేరారు. వివాహానికి కొనుగోలు చేసిన కారులో అరుణ కుమారి, సత్యనారాయణ లతో పాటు అరుణ కుమారి తండ్రి పిన్నమనేని కామేశ్వరరావు (74), అతని భార్య అన్నపూర్ణమ్మ(68), అరుణ కుమారి చిన్న కొడుకు సందీప్ కారు నడుపుతూ కూకట్‌పల్లిలోని నివాసానికి వస్తున్నారు. పెళ్లి పనులు, రాత్రి డ్రై వింగ్ కావడంతో కారు నడుపుతున్న సందీప్ అప్పటికే పూర్తిగా అలసిపోయాడు. తెల్లవారు జామున సుమారు 4 గంటల సమయంలో కొద్దిదూరంలో ఇంటికి చేరతాం అనే సమయంలో ఎర్రమంజిల్ రోడ్డు లోని మెట్రో పిల్లర్‌కు వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు లోనుండి కామేశ్వరరావు బయటపడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పక్కనే కూర్చున్న అన్నపూర్ణమ్మ కూడా తీవ్ర గాయాలపాలైంది. కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో అరుణకుమారి, సత్యనారాయణ, సందీప్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.