ఈ ఏడాది ఘరానా నేరాలకు తోడు విచిత్ర ఉదంతాలు
తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర ఘటనలు
పోలీసులకు కొత్త తల నొప్పులు
సాక్షి, అమరావతి /హైదరాబాద్: చిల్లర దొంగతనాలు మొదలు రూ.కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ఉదంతాల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో వివిధ నేరాలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్‌ఐఆర్‌లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమిటంటే..
సైనేడ్ హత్యలు
గుంటూరు జిల్లాలో ఓ తల్లీ కూతురు, వారి స్నేహితురాలు పాల్పడ్డ సైనేడ్ హత్యలు సంచలనం రేపాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నాగూర్ బి అనే మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుతో మొత్తం కుట్ర బయటపడింది. తెనాలికి చెందిన ముడియా రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వారి స్నేహితురాలు గునగప్ప రజినీ ముందస్తు పన్నాగంతో నాగూర్‌బీ అనే మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె బంగారం కాజేయాలని భావించారు.
నాగూర్‌బీని నమ్మించి ఆటోలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. దారిలో ఆటో డ్రైవర్‌తో బ్రీజర్ కొనిపించారు. ఆ బ్రీజర్‌లో సైనేడ్ కలిపి నాగూర్‌బీతో బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అంతకుముందు కూడా ఇదే రీతిలో చేసిన హత్యలు కూడా బయటపడ్డాయి. నాగమ్మ అనే మహిళ నుంచి వెంకటేశ్వరి రూ.20 వేలు అప్పు తీసుకుంది.
ఆ అప్పును ఎగవేసేందుకు సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి నాగమ్మను హత్య చేసింది. 2022లో వెంకటేశ్వరి తన అత్త సుబ్బలక్ష్మిని కూడా ఇలానే సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి హత్య చేసింది. తెనాలికి చెందిన మోషే అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. అతని ఇన్సూరెన్స్, పెన్షన్ డబ్బులు పంచుకోవాలనే ఒప్పందంతో రమణమ్మ, వెంకటేశ్వరి.. మోషే భార్యతో కలసి అతడిని హత్య చేశారు. రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీ, ఆటో డ్రైవర్‌తోపాటు సైనేడ్ విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దొంగ నోట్లు ఆశ చూపి..
‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం’ అని ఆశ చూపించి స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ఆస్పరిలో పెంటయ్య అనే రైతు అప్పుల పాలయ్యాడు. తన పొలాన్ని రూ.17.50 లక్షలకు విక్రయించాడు. ఆ సొమ్మును కాజేయాలని అతని స్నేహితులు బోడిగుండ నరసింహుడు, హనుమంతు భావించారు. ‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం... దాంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి’ అని ఆశ చూపించారు. డబ్బులు పట్టుకుని ఆలూరు మండలం హళేబీడుకు రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన పెంటయ్య రూ.7.50 లక్షలు తీసుకుని వెళ్లారు.
అక్కడ స్నేహితులు ఆయనతో సైనైడ్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించి హత్య చేశారు. పెంటయ్య మృతదేహాన్ని సమీపంలోని పంపయ్య ఆచారి అనే వ్యక్తి పొలంలో పూడ్చి పెట్టారు. అందుకుగాను ఆచారికి కొంత సొమ్ము ముట్టజెబుతామన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండటంతో బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి ఆటోలో ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు వంక వద్దకు తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. మృతదేహాన్ని సమీప గ్రామస్తులు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదైంది. బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
వదిన ఆస్తిని కాజేయడం కోసం భీమవరంలో ఓ వ్యక్తి పన్నిన ‘మృతదేహం పార్సిల్’ పన్నాగం విస్మయ పరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన శ్రీధర్ వర్మకు ఇద్దరు భార్యలతోపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తన రెండో భార్య రేవతి తల్లిదండ్రుల ఆస్తిపై అతను కన్నేశాడు. ఆ ఆస్తిలో తన రెండో భార్య అక్కకు కూడా వాటా ఉంది. దాంతో ఆమె వాటాను కూడా దక్కించుకోవడం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఆమె (వదిన) నిర్మిస్తున్న ఇంటి కోసం రెండుసార్లు క్షత్రియ ఫౌండేషన్ పేరుతో నిర్మాణ సామగ్రిని పంపించాడు. మూడోసారి నిర్మాణ సామగ్రి పేరుతో ఓ మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపాడు. అందుకోసం తన ప్రియురాలితో కలసి తన గ్రామానికి చెందిన మద్యానికి బానిసైన యువకుడిని హత్య చేశాడు.
అతని మృతదేహాన్ని తన వదిన ఇంటికి పార్సిల్ పంపాడు. రూ.1.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్సిల్‌లో ఓ లేఖ రాసి పెట్టాడు. ఆ పార్సిల్ చూడగానే వదిన భయపడి తనకు ఫోన్ చేసి పిలుస్తుందని.. ఆమెకు సహకరించినట్టుగా నటించి రూ.1.30 కోట్లు సర్దుబాటు పేరుతో ఆమె ఆస్తిని దక్కించుకోవాలన్నది శ్రీధర్ వర్మ పన్నాగం. అయితే తీవ్ర ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. కాగా, ఆస్తి మొత్తం దక్కాక ఇద్దరు భార్యలను కూడా వదిలించుకుని ప్రియురాలు సుష్మాతో ఉడాయించాలని శ్రీధర్ వర్మ భావించాడు. దీంతో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
మద్యంపై మక్కువతో..
పనిచేస్తున్న సంస్థలకు సున్నం పెట్టే వాళ్లు.. అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆర్‌యూ పబ్‌లో పనిచేసే వినీత్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డు వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్‌లోకి ప్రవేశించి రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, మొహిట్ చాన్ దాన్ బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని రూ.2 లక్షల నగదు కూడా కొట్టేశాడు.
మాస్టార్‌కు ఎదురైన ప్రేమ వేధింపులు
బస్టాప్ లాంటి ప్రదేశాల్లో రోడ్‌సైడ్ రోమియోల ఆగడాల గురించి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై క్షక్షగట్టింది. లెక్చరర్‌తోపాటు ఆయన కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరకు జైలుపాలైంది.
హుస్సేన్‌సాగర్‌లో ‘90 ఎంఎల్’స్టోరీ
సాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లోకి దిగి ‘చుక్క’కావాలంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. నడుము లోతు నీళ్లున్న ప్రాంతంలో అతడు నిల్చుని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్ నీటిలోకి తాడు విసిరి, దాన్ని పట్టుకుని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు.. తనకు ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరకు గంటన్నరపాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు.
‘అతడి’పైనా అత్యాచార యత్నం
యువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలకు సంబంధించిన కేసులు నేటికీ నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై అత్యాచారయత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్‌నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి మసాజ్ థెరపిస్టుగా పరిచయమైన ఓ మహిళ.. భరత్‌నగర్ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి అతన్ని భరత్‌నగర్ కాలనీలోని మహిళ ఇంటికి తీసుకెళ్లి మసాజ్ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు గుంజారు. ఆపై ఇంకా డబ్బివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ ‘లైంగిక వేధింపులు’తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె అలా... అతడు ఇలా
భిన్న మనస్తత్వాలుగల భార్యభర్తల్ని మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లోని రామాంతపూర్‌లో నివసించే ఓ ‘విపరీత’జంట వ్యవహారం ఉప్పల్ ఠాణా అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్‌గా పనిచేసిన మహిళ మద్యానికి బానిసగా మారింది. నిత్యం మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు చిక్కేది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసుస్టేషన్‌కే వచ్చి న్యూసెన్స్ చేసి వెళ్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె భర్త కూడా తక్కువేం కాదు.. చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల గోడలు దూకి చెప్పులు, బూట్లు చోరీ చేసేవాడు. సీసీ కెమెరాల ఆధారంతో ఒకరోజు అతని ఇంటిపై దాడి చేసిన స్థానికులు వందల జతల పాదరక్షలు గుర్తించి పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment