పట్టుబడిన మోటారు బైక్‌లు
జయపురం: అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జయపురం సబ్ డవిజనల్ పోలీసు అధికారి హరీష్ బి.సి స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుచుగా బైక్‌లు దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అరెస్టు చేయబడినవారు జయపురం విక్రమనగర్ లాల్‌సాహి గ్రామానికి చెందిన ఎల్.అఖిల్ ఉరఫ్ ఉదయ్(22), బొయిపరిగుడ సమితి దసమంతపూర్‌కు చెందిన కృష్ణ నాయిక్ (19)లుగా వెల్లడించారు. వారిద్దరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామని, అలాగే నవరంగపూర్ జిల్లా కొడింగ సమితి చొటాహండికి చెందిన పద్మణ హరిజన్ ఉరఫ్ గులెట్(25)ని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. నిందితుల నుంచి 11 మోటారు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాలో ఇకెంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
ఇలా పట్టుబడ్డారు
జయపురం పవర్ హౌస్ కాలనీలో ఉంటున్న జి.గణేష్ తన బైక్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. ఆ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నట్లు తెలిసిందని ఆయన తెలియజేశారు. పోలీసులు నిందితులు దొంగిలించిన బైక్‌ను వెంబడించి గాంధీ కూడలి వద్ద పట్టుకున్నారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా తాము అనేక బైక్‌లు దొంగిలించి నవరంగపూర్ జిల్లా కొడింగ సమితి ఛొటాహండి గ్రామంలో పద్మన్ హరిజన్‌కు అమ్మినట్లు తెలియజేశారు.
అనంతరం పోలీసులు సబ్ ఇన్‌స్పెక్టర్ మహంతి బెహర, ఏఎస్‌ఐ విష్ణు మడకామిలతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. కొడింగ పోలీసుల సహకారంతో చొటాహండి గ్రామంలో దాడి నిర్వహించగా, ఆ సమయంలో పద్మన్ 10 బైక్‌లు అమ్మేందుకు పెట్టాడని తెలిపారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లలో జయపురం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలించబడిన 4 బైక్‌లు, కొరాపుట్ పట్టణం, జయపురం సదర్, కుంధ్రా పోలీసుస్టేషన్ల పరిధిలో ఒక్కొక్క బైక్‌లు కాగా, రెండు బైక్‌లు ఛత్తిష్‌ఘడ్ రాష్ట్ర జగదల్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోనివి. అలాగే బెలడిల్లా పోలీసుస్టేషన్ పరిధిలో ఒకటి కాగా, తెలంగాణ రాష్ట్రం నల్గొండ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బైక్ దొంగిలించబడిందని వివరించారు.
టార్గెట్ తెలంగాణ, ఏపీ
ఒడిషాలోని ఈ దొంగల బ్యాచ్ ప్రధానంగా చిన్న పట్టణాలను టార్గెట్ చేస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా.. తమ పని తాము చేసుకుపోతుంది. సిసి సర్వైలెన్స్ పెద్దగా లేని చోట.. బైక్ లను క్షణాల్లో మాయం చేయడం వీరి విధానం. ఎంతగా తాళాలు వేసినా.. వీరికున్న నైపుణ్యంతో సులభంగా అన్ లాక్ చేస్తారు. అదేవిధంగా నంబరు లేని ఒక బైక్ సైతం వారి నుంచి సీజ్ చేసినట్లు వెల్లడించారు. బైక్‌ల యజమానులు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి వారి బైక్‌లను తీసుకెళ్లవచ్చని తెలియజేశారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి సంబిత్ కుమార్ బెహర, ఎస్‌ఐ సంజయ కుమార్ మహంతి, సిద్ధార్ధ కుమార్ బెహరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment