రాష్ట్రం 2 ముక్కలు... విద్యార్థుల ఫ్యూచర్ వెయ్యి చెక్కలు
రాష్ట్రం 2 ముక్కలు... విద్యార్థుల ఫ్యూచర్ వెయ్యి చెక్కలు
Published Mon, Jul 28 2014 11:38 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
రాష్ట్రమైతే రెండు ముక్కలైంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం వెయ్యి చెక్కలయ్యేట్టుంది. వై ఎస్ ఆర్ వల్ల వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తారో లేదో...ఇప్పటి వరకూ తెలియడం లేదు. ఒకవేళ కొనసాగించినా తెలంగాణలో చదువుకునే ఏపీ విద్యార్ధులకు ఆ సదుపాయం అందుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. మరో వైపు పాత ఫీజు బకాయిలు ఎవరు చెల్లిస్తారనేది విద్యార్థులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న.
ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విద్యార్ధుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో గత విద్యా సంవత్సరానికి అందాల్సిన రూ.800 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించాల్సి వుంది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఎవరు చెల్లించాలనే విషయంపైన కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాజధానితో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు ఎవరు చెల్లించాలనే విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు.
ఈ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తమ కాలేజీల నుంచి సర్టిఫికెట్లు అందుతాయా లేదా అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు. దీనికి తోడు ఎంసెట్ ఫలితాలు విడుదలై నెలరోజులు దాటుతున్నా... ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకాలేదు. అసలు ఎప్పుడు జరుగతుందో తెలీక విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంతే సంగతులా అన్నదీ ఇప్పటికీ తేలలేదు. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది.
Advertisement